చదరంగం ఆటలో చంపబడిన పావులు… రాజు గానీ, బంటు గానీ… ఒకే బాక్సులోకి చేరతారు… అవి బతికి ఉన్నప్పుడే వాటి హోదాలు, విశిష్టతలు, విలువలు… సేమ్, కాలిపోయిన బల్బుల్లాగా… అన్ని ఫ్యూజ్డ్ బల్బులు ఒకటే… వాటి వాటేజ్ ఏమైనప్పటికీ -.. 0, 10, 40, 60, 100 వాట్స్ – ఇదిప్పుడు పట్టింపు లేదు… LED, CFL, హాలోజన్, ఫ్లోరోసెంట్ లేదా డెకరేటివ్ – కాలిపోయే ముందు అది ఏమిటనేది, కాలిపోయాక పట్టింపునకు రాదు…
ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిటైరయ్యాడు… ప్రభుత్వ క్వార్టర్ల నుంచి హౌసింగ్ సొసైటీలోని తన సొంత ఇంటికి మారాడు… ఇప్పటికీ తను ఓ పెద్ద హోదాలో ఉన్నాననే అనుకుంటాడు… ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు… సొసైటీ పార్కులో ప్రతి సాయంత్రం వాకింగుకు వచ్చినప్పుడు కూడా పెద్దగా ఎవరినీ చూడడు… పట్టించుకోడు… అదే హైఫై ఫీలింగు… ధిక్కారంగా చూస్తుంటాడు అందరి వైపు…
మొత్తానికి సీన్ కాస్త మారింది… ఓరోజు ఓ వృద్ధుడు బెంచ్ మీద తన పక్కనే కూర్చుని మాటలు కలిపాడు… అలా పలుసార్లు వాళ్లు కలిసేవాళ్లు… ప్రతి సంభాషణ ఏకపాత్రాభినయంలాగే… సదరు రిటైర్డ్ ఆఫీసర్ ఎప్పుడూ ఒకే గ్రామఫోన్ వినిపిస్తుంటాడు… ‘‘అసలు నేను ఎంత పెద్ద పోస్టులో పనిచేశానో తెలుసా..? హై పొజిషన్‌లో రిటైరయ్యాను… తప్పనిసరై ఇదుగో ఇక్కడికి వచ్చి బతకాల్సి వస్తోంది… ఈ కథాకాలక్షేపం నడుస్తూనే ఉంటుంది… ఆ ముసలాయన నిశ్శబ్దంగా వింటుంటాడు…
Ads
ఓరోజు సదరు రిటైర్డ్ ఆఫీసర్ ఆ ముసలాయన దగ్గర సొసైటీ సభ్యుల గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు… ఎవరెవరు ఏ హోదాల్లో పనిచేశారనేదే తనకు కావల్సింది… ఆ ముసలాయన ఏమన్నాడంటే… ‘‘చూడండి… పూర్తిగా రిటైరయ్యాక ఇంకా పనిచేస్తుండేవాళ్ల గురించి నేను ఏమీ కామెంట్ చేయను… కానీ నాలాగా పండు ముసలోళ్లం అయ్యాక అందరమూ ఫ్యూజ్డ్ బల్బులమే… ఒకసారి కాలిపోయాక నా వాటేజ్ ఎంత ఉండేది అయితేనేం… ఎంత వెలుగును ఇచ్చేది అయితేనేం… మాడిపోయింది… అంతే…’’ అన్నాడు నిర్వేదంగా… ఆయన మాటల్లో సత్యం ఉంది…
‘‘నువ్వు ఏ హోదాలో పనిచేశావో నేనెప్పుడూ పట్టించుకోలేదు… ఇక్కడ మనిద్దరమూ ఒకటే… నేను ఇక్కడ అయిదేళ్లుగా ఉంటున్నాను… నేనెవరో ఎవరికీ చెప్పలేదు, చెప్పాల్సిన పనీలేదు… అదిక్కడ అప్రస్తుతం… నేను రెండు టరమ్స్ ఎంపీగా పనిచేశాను… నీ కుడి పక్కన కాస్త దూరంగా కూర్చున్నాడు చూడు… పేరు వర్మ… ఇండియన్ రైల్వేస్ జనరల్ మేనేజర్‌గా చేసి రిటైరయ్యాడు…
ఇంకాస్త ఎడంగా కూర్చున్నాడు చూడు… ఆయన సింగ్… ఆర్మీలో మేజర్ జనరల్‌గా పనిచేశాడు… అదుగో ఆ మూలన బెంచ్ మీద మచ్చలేని తెల్లటి బట్టలు వేసుకుని కూర్చున్నాడు గమనించావా..? ఆయన మెహ్రా… ఇస్రో చీఫ్‌గా పనిచేశాడు… ఇవన్నీ వాళ్లు నాకు ఎప్పుడూ చెప్పలేదు… కానీ వాళ్ల గురించి నాకు తెలుసు… నేనూ ఎప్పుడూ వాళ్ల మాజీ హోదాల గురించి మాట్లాడను… మాట్లాడినా ఫాయిదా లేదు… మిత్రమా, ఇది నీకూ వర్తిస్తుంది… ఇది నీకు అర్థమైన రోజుల ఈ సొసైటీ జీవితంలో ప్రశాంతతను, శాంతిని పొందుతావు…’’ అని కొనసాగించాడు ఆయన…
ఇంకా చెప్పాడు… ‘‘ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు… రెండూ అందంగా కనిపిస్తాయి… ఆరాధనీయం… కానీ ఉదయించే సూర్యుడికే విలువ ఎక్కువ, ప్రాధాన్యం ఎక్కువ… తనకు ఎక్కువ ఆరాధనలు, పూజలు ఉంటాయి… అస్తమించే సూర్యుడికి అంత ప్రాముఖ్యం ఇవ్వరు… ఎలాగూ కుంగిపోయే సూర్యుడే కదా… ఇది లోకసహజం… ఎవరినీ తప్పుపట్టే పనిలేదు… నేను ఒకప్పుడు ఏమిటో తెలుసా అనే పదాల్ని ముందుగా డిలిట్ చేసేసుకో మిత్రమా… ఈరోజు మనది… రేపు ఏమిటో చెప్పలేం… ఏమో, ఎవరికి పిలుపు వస్తుందో, ఎవరు వెళ్లాల్సి వస్తుందో… మన హోదాలు, మన పాత సర్టిఫికెట్లు అన్నీ ఏదో ఒకరోజు ఒకేఒక సర్టిఫికెట్‌తో తీసేయబడతాయి… అదే ‘డెత్ సర్టిఫికెట్..!!
Share this Article