Abdul Rajahussain …… రాసిన ఓ పోస్టు చాలా ఇంట్రస్టింగుగా ఉంది… తను ఎలాగూ అభూతకల్పనలు, అబద్ధాలు, అతిశయోక్తులు అస్సలు రాయడు… ఐనా ఆశ్చర్యంగానే ఉంది ఇంకా… పోస్టుపై విశ్లేషణ దేనికిలే గానీ, మీరూ చదివేయండి… ఇది సినిమా నటి భానుప్రియ గురించి… ఆమె ఆరోగ్యస్థితి బాగాలేదనీ, ఎవరినీ గుర్తుపట్టడం లేదనీ ఈమధ్య కొన్ని వార్తలు వచ్చినట్టు గుర్తు… ఇప్పుడెలా ఉందో తెలియదు… కానీ ఇది మాత్రం ఇంట్రస్టింగు…
‘‘ ఈరోజు కవి, విమర్శకులు సాంధ్యశ్రీ గారితో మాట్లాడుతుంటే ఎందుకో సినీనటి “భానుప్రియ ” విషయం వచ్చింది.. ఆమాట ఈమాట మాట్లాడుతుంటే.. భానుప్రియగారి ఒంటి నుంచి అద్భుత పరిమళం వస్తుంది మీకు తెలుసా? అన్నారు.. అంతకు ముందు ఇదే విషయం … భానుప్రియతో సినిమాలు తీసిన ఓ దర్శకుడు కూడా చెప్పి వుండటంతో… ఆసక్తిగా వుంది, వివరంగా చెప్పమన్నాను..
*అప్పుడెప్పుడో సినిమా షూటింగ్ చూద్దామని అన్నపూర్ణ స్టూడియోకు వెళ్ళాను.. అక్కడ విశ్వనాథ్ గారు, రామానాయుడు వున్నారు.. వాళ్ళతో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నప్పుడు ఓ కారొచ్చి మాముందు ఆగింది… కారులోంచి భానుప్రియ గారు దిగి మా దగ్గరకొచ్చారు. ఆమె రాగానే ఓ రకమైన అద్భుతపరిమళం గుప్పుమంది.. అది అత్తరో, సెంటో, డియోడరెంట్ వాసనో కాదు.. అంతకు ముందెప్పుడో ఓ అవధూతను కలిసినప్పుడు…. ఆయన నుంచి వచ్చిన సహజ వాసన గుర్తొచ్చింది..
Ads
తీరా విచారిస్తే.. భానుప్రియకు సెంటు, అత్తరులంటే ఎలర్జీ అట.. అసలామె పరిమళపు సబ్బు కూడా వాడదట.. బాంబే ఫైఫ్ స్టార్ హోటల్లో వున్నా.. కుంకుడుకాయలతోనే తలస్నానం చేసేవారట.. అలాగే ఒంటికి సున్నిపిండి రాసుకొని స్నానం చేసేవారట. అటువంటి భానుప్రియ నుండి అవధూతల నుంచి వచ్చే పరొమళం రావడం నిజంగా ఆశ్చర్యమనిపించింది..” అన్నారు సాంధ్యశ్రీ..!!
భాను ప్రియగారి సంగతలా వుంచి అసలీ అవధూతలెవరో తెలుసుకుందాం…!! అవధూత ఒక సంస్కృత పదం. సాధువులను లేక ఆధ్యాత్మికులను సూచించడానికి కొన్ని భారతీయ మతాలు లేదా ధార్మిక సాంప్రదాయాల నుండి ఈ అవధూత పదం ఆవిర్భవించిందని చెబుతారు. వీరు మానవ సహజమైన అహంకారాన్ని (ఇగో) వదలి ప్రతిఫలం లేకుండా సామాజిక మర్యాద, ప్రమాణాల కోసం ప్రాపంచిక (లౌకిక) చర్యలను చేపడతారు. సర్వాంగాలను పరిత్యజించిన వీరిని ‘సర్వసంగపరిత్యాగులు’ లేక ‘సన్యాసులు’ అని కూడా అంటారు.
వీరిని భారతీయ స్మృతులు కుటీచులు, బహుదకులు, హంసులు, పరమహంసులు అని నాలుగు తరగతులుగా విభజించాయి. వీరందరికంటే మహోన్నత స్థితికి చేరిన మహనీయులను..”అవధూతలంటారు.. భాను ప్రియ గారు అవధూత కాదు.. ఆమె ఒక సినీనటి మాత్రమే.. మరి ఈ అవధూతలను పోలిన పరిమళం ఎలా వస్తుందన్న ప్రశ్నకు సమాధానం లేదు. చెప్పేవాళ్ళు కూడా దొరకలేదు.. ఆమెకు అసలే తెలియదు…
భానుప్రియ… ఓ పద్మగంధి..!! సినీ నటి భాను ప్రియ గారు పద్మగంధా? మన ప్రబంధాల్లో ‘పద్మగంధి’ పేరు మీరు వినే వుంటారు. పద్మగంధి అంటే పద్మపు సువాసనగలిగిన స్త్రీ అని అర్ధం..!! నేను వ్యక్తిగతంగా ఆమెను చూడలేదు.. సినిమాల్లో మాత్రమే చూశాను.. ఆమెను చూసినవాళ్ళు, ఆమెతో సన్నిహితంగా … వున్నవాళ్ళు చెప్పిన మాటలే ఈ వ్యాసానికి ప్రేరణ.. మూలం. భానుప్రియ ఇప్పుడు మద్రాసులో వున్నారు. ఆమెకు మెమరీ లాస్ అని చెబుతున్నారు.. ఈ కారణంగా ఆమెకేదీ గుర్తుండటం లేదు. అందువల్ల సినిమాల్లో నటించడం లేదు… ఇదంతా భానుప్రియ ప్రజెంట్ స్టేటస్..!!
Share this Article