ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది… ఇది ఇక్కడ ఆగదు… రాజమౌళికి గెలుపు రుచి తగలడం కాదు, గెలిచే దారి తగిలింది… బాహుబలితో చాలామంది నిర్మాతలకు, దర్శకులకు విదేశీమార్గాలు, వందల కోట్లు మింట్ చేసుకునే ఎత్తుగడలు రుచిచూపించిన రాజమౌళి ఇప్పుడు ఆస్కార్ అవార్డులను చూపిస్తున్నాడు… ఆస్కార్ అవార్డులు కూడా మన జాతీయ అవార్డుల్లాంటివేననీ, ప్రయత్నిస్తే ఈజీగా కొట్టవచ్చుననీ నిరూపించి చూపించాడు… సో, రాబోయే రోజుల్లో మనకు ఆస్కార్ అవార్డులు చాలా రాబోతున్నాయన్నమాట…
అసలు ఇది దేశం నుంచి పంపించబడిన అధికారిక ఎంట్రీయే కాదు ఆర్ఆర్ఆర్… అయితేనేం, ప్రైవేటు పెయిడ్ ఎంట్రీగా ఏకంగా పది కేటగిరీల్లో చేరారు… ఇదేమార్గంలో మరికొందరు నిర్మాతలు కూడా తమ సినిమాల్ని ప్రవేశపెట్టారు… కానీ వాళ్లు అక్కడే వదిలేశారు… రాజమౌళి వదల్లేదు… తిష్ట వేశాడు… ఏయే మీటలు నొక్కితే పనవుతుందో తెలుసుకున్నాడు… ఒక్కొక్క కేటగిరీలో తమ ఎంట్రీ మాయమై, చివరకు ఒరిజినల్ సాంగ్‌లో నిలిచింది… నిలబడేలా చేశాడు…
Ads
నిజానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమా అవార్డులు తన లక్ష్యం… కానీ అదెందుకో కుదర్లేదు… కానీ వచ్చే సినిమాకు కొట్టేస్తాడు… దారి తెలిశాక పరుగు కష్టమా..? కాకపోతే తమ్మారెడ్డి చెప్పినట్టు డబ్బు… డబ్బు… డబ్బు… పోనీలే, తెలుగువాడి పేరు మారుమోగుతోంది కదా అనేది ఓ సమర్థన… అది ఇండియన్ సినిమా… ఒకవైపు డప్పుల కోలాహలం మిన్నంటుతూ ఉంటే నిజాలు మాట్లాడుకోవడం కొందరికి నచ్చదు, కానీ నిజం ఎప్పుడూ నిజమే… మాట్లాడుకోవాలి…
ఫాఫం… ఈ అవార్డుల లాబీయింగులో, ఈ ఘనతలో ఎక్కడా ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య పేరే వినిపించలేదు… మొదట్లో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ పేరు గానీ, లిరిక్ రైటర్ చంద్రబోస్ పేరు గానీ వినిపించలేదు… సోషల్ మీడియా బూతులు తిట్టాక వాళ్లనూ ఇన్వాల్వ్ చేశారు… ఒక వ్యాఖ్య తెలుగు నెటిజన్ల మధ్య బాగా సర్క్యులేటవుతోంది… ‘రాజమౌళి విజన్, కీరవాణి ట్యూన్, చంద్రబోస్ లిరిక్, ప్రేమరక్షిత్ కొరియోగ్రఫీ, జూనియర్ ఎన్టీయార్-రాంచరణ్ స్టెప్పులకు మోకరిల్లిన ఆస్కార్’… (ఫాఫం, ఈ ప్రచారంలోనూ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ మీద వివక్ష…)
నిజమే… అందరూ అభినందనీయులే… కానీ అసలు సిసలు క్రెడిట్ దక్కాల్సింది రాజమౌళికే… 1) తనకు పర్‌ఫెక్ట్‌గా నచ్చకపోతే ఎవరితోనైనా సరే ఎన్ని టేకులైనా తినిపిస్తాడు… తనకు రావల్సిన ఔట్‌పుట్ రావల్సిందే… 2) ఆస్కార్ అవార్డు దక్కించుకునే దారులు తెలుసుకోవడం… 3) ఖర్చుకు సిద్ధపడటం… 4) అక్కడే తిష్ట వేసి, పట్టువదలని రాజమౌళిలా దాని వెంటబడటం… కానీ క్రెడిట్ అంతా తనకు, కీరవాణికే రావాలనుకున్నాడు…
ఒక పాట అంటే ఎవరి ఘనత..? దర్శకుడు సరే… నిర్మాత కూడా అభినందనీయుడే… ట్యూన్ కట్టినోడు, లిరిక్ రాసినోడు, పాట పాడినోడు, స్టెప్పులు కంపోజ్ చేసినోడు, స్టెప్పులు వేసినోడే కాదు… అందంగా చిత్రీకరించిన సినిమాటోగ్రాఫర్, పాటలోని బిగువు సడలకుండా ఎడిటింగ్ చేసినోడు కూడా అభినందనీయుడే అవుతాడు… (దీనికి ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్…) కాకపోతే ఆ వేదిక మీద కప్పును చేత్తో పట్టుకున్నోడే చరిత్రలో నిలిచిపోతారు… ఇంకా నిజాల్లోకి వెళ్దాం…
ఈ పాట ఓ సాదాసీదా పాట… కమర్షియల్ ట్యూన్… సగటు తెలుగు సినిమా స్టెప్పుల పాట… పైగా తెలంగాణ నేటివ్ పాట అంటూ, తెలంగాణ హిస్టారిక్ హీరో పేరిట, అనేకానేక ఇతర పదాలతో కల్తీ చేయబడిన పాట… అసలు సినిమాయే ఇద్దరు చారిత్రిక పోరాటవీరుల చరిత్రను వక్రీకరించడం కదా… సరే, ప్రేక్షకులకు నచ్చింది… ‘‘చివరకు ఆస్కార్‌కు కూడా నచ్చింది’’… అదే రాజమౌళి మాయ… ఇటు ప్రేక్షకులనే కాదు, అటు ఆస్కార్ జడ్జిలను కూడా మాయ చేయడం మామాలూ విద్య కాదు… నువ్వు గొప్పోడివి రాజమౌళీ… నువ్వు అమెరికాలో పుట్టి ఉంటే హాలీవుడ్ దద్దరిల్లిపోయేది..!!
చివరగా :: ప్చ్, చంద్రబోస్ అదృష్టవంతుడు కాబట్టి నాటునాటు జెండాకు ఎక్కింది… మరుపురాని పూలు జల్లింది… కొమురం భీముడో పాటకు ఇదే ప్రయత్నం చేసి ఉంటే సుద్దాల అశోక్ తేజ అదృష్టవంతుడు అయ్యేవాడు… పాడిన కాలభైరవనూ ఈ ప్రచారహోరులోకి తీసుకొచ్చేవారు… రాజమౌళికి, కీరవాణికి మరింత ఆనందం దక్కేది… అబ్బే, అది అప్పట్లో సూపర్ హిట్ తెలంగాణ పాట మదనా సుందరి, మదనా సుందరి పాట ట్యూన్‌ను కాపీ కొట్టిందే కదా అంటారా..? భలేవారే… అవన్నీ ఆస్కార్‌లో ఎవడు చూస్తాడు..? అసలే ఇవి ఒరిజినల్ సాంగ్ అవార్డులు…!!
Share this Article