వీళ్లు కమర్షియల్ కల్తీవీరులు కారు… వందల కోట్లు కుమ్మేసే చరిత్ర వక్రీకరణులు కారు… అవును, నేను చెబుతున్నది ది ఎలిఫెంట్ విష్పరర్స్ గురించే… దీనికి దర్శకురాలు కార్తీకి… ప్రధాన నిర్మాత గుణీత్ మోాంగా… కార్తీకి కూడా డబ్బు పెట్టింది… అంతేకాదు, ఆమె స్వయంగా ఓ సినిమాటోగ్రాఫర్… ఆస్కార్‌కు నామినేటయ్యాక హిందుస్థాన్ టైమ్స్ కార్తీకితో మాట్లాడి ఈమధ్య చాలా వివరాలు తెలియజేసింది… కనీసం చాలా పత్రికలు ఈ దశలో కూడా అసలు ఆ డాక్యుమెంటరీ ప్రాధాన్యాన్ని పట్టించుకోలేదు…
Ads
అయిదేళ్ల క్రితం కార్తీకి ఊటీకి వెళ్తోంది… తమిళనాడు… బొమ్మన్ కట్టునాయకన్ అనే ఓ జంతుసంరక్షకుడు రోడ్డు పక్కన కనిపించాడు… తనతోపాటు ముదుమలై అడవులకు చెందిన రఘు అనే ఓ బుల్లి ఏనుగు పిల్ల… నిజానికి ఆ సమయంలో రఘుకు స్నానం చేయించడానికి తీసుకెళ్తున్నాడు బొమ్మన్… అలా చూస్తూ ఉండిపోయింది కార్తీకి (36)… ఆ బంధం అపురూపంగా గోచరించింది ఆమెకు… కాసేపు అలాగే చూస్తుండిపోయింది కారు ఆపుకుని… ఆ ఏనుగు పిల్లకు తల్లి, తండ్రి, ఫ్రెండ్, అన్నీ ఆ బొమ్మనే…
ఆ అడవుల్లో కట్టునాయకన్ తెగ ఏనాటి నుంచో ఏనుగుల సంరక్షణను చూస్తుంటుంది… కృష్ణజింకల్ని ప్రేమించే బిష్ణోయ్ తెగ తెలుసు కదా… అలాగన్నమాట… ఆ ఇద్దరినీ చూశాక కార్తీకి కెరీరే మారిపోయింది… ఓ డాక్యుమెంటరీ తీయడానికి పురికొల్పింది… అంత హడావుడిగా తీసిపారేసే రకం కాదు ఆమె… ఆ బొమ్మన్ కుటుంబంతో కలిసిపోయింది కొన్నాళ్లు… ఆ బంధం పెరిగితే తన ఫిలిమ్ బాగా వస్తుందని ఆశ… కానీ అనుకోకుండా వాళ్లతో ఓ చుట్టరికమే డెవలపైంది ఆమెకు…
ఆ డాక్యుమెంటరీ మొత్తం బొమ్మన్, ఆయన భార్య బెల్లీ, రెండు బుల్లి ఏనుగులు… వాళ్ల నడుమ బంధం గురించి… వాటి పేర్లు రఘు, అమ్ము.. ఈ ఫిలిమ్ తీసుకుని కార్తీకి అమెరికా వెళ్లింది… అందరినీ ఆకర్షించింది అది… అలా డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేటైంది… ఆమె డబ్బులేమీ ఖర్చుపెట్టలేదు…
ఈ ఏనుగు పిల్ల రఘు తల్లి కరెంటు షాక్‌తో మరణిస్తుంది… 3 నెలల వయస్సులో ఉన్న రఘు మీద వేటకుక్కలు దాడిచేస్తాయి… దానికి సపర్యలు చేసిన ఫారెస్ట్ రేంజర్స్ దాని పోషణ, సంరక్షణ బాధ్యతను ఈ కుట్టునాయకన్ తెగకు చెందిన బొమ్మన్‌కు అప్పగిస్తారు… ఆ రిజర్వ్ ఫారెస్టులో బొమ్మన్ ఇల్లు… అక్కడికి తీసుకుపోతాడు… ‘ఏనుగుల సంరక్షణకు సంబంధించి నాకేమీ శిక్షణ లేదు…’ అయితేనేం, మా తెగ మొత్తం అందులో నిష్ణాతులే అంటోంది బెల్లీ…
కార్తీకి ఈ డాక్యుమెంటరీ తీయాలనుకుని, తనే దర్శకత్వం చేపట్టింది… డెబ్యూట్… నడి అడవిలో షూటింగ్… రెండు పిల్ల ఏనుగులు… ఒక్కొక్కటాీ 150 కిలోలు… అనేక సవాళ్ల నడుమ అయిదేళ్లు పట్టింది ఇది పూర్తి కావడానికి… ‘‘ఏడాదిన్నర సమయం నాకు ఆ కుటుంబంతో బంధం పెంచుకోవడం కోసమే సరిపోయింది… నా టీం కూడా చాలా చిన్నది… ముగ్గురే…’’ అని చెప్పుకొచ్చింది కార్తీకి… ఆ ఏనుగులు కెమెరాలున్నాయనే సంగతిని మరిచిపోవాలి… అందుకే ఈ నిరీక్షణ అంతా…
ఈ ఫిలిమ్ 40 నిమిషాల లోపే కదా… కానీ వీళ్ల షూటింగుల 450 గంటల ఫీడ్ వచ్చింది… దాన్ని కుదించడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది… చాలావరకూ ప్రకృతి సంబంధమైన సీన్స్… ప్రకృతితో మనిషి, ప్రకృతితో జంతువు, జంతువుతో మనిషి… ఈ బంధాలన్నీ తక్కువ నిడివిలో కవర్ కావాలి… అదే పెద్ద టాస్క్…
ఆ 450 గంటల నిడివిలో ప్రధాన పాత్ర అడవి… అడవిలో జంతువులు… మనుషులు, ఏనుగులు, గద్దలు, గుర్రాలు, కోతులు… చివరకు పులులు, చిరుత పులులు కూడా…! ‘‘మీరు నమ్ముతారా… అడవిలో ఉత్త పాదాలతో నడిచాం అనేకసార్లు… ఎందుకో మనసులో చెప్పులు విడిచి అడవిని గౌరవించాలనిపించేది…’’ అంటుంది కార్తీకి…
మాకు సమీపంలోనే ఓ చిరుత తన ఆహారంపై దాడి చేస్తుంటుంది… ఓ పులి వేటాడుతుంది… అవన్నీ స్పష్టంగా వినిపించేవి… మేం నిశ్శబ్దాన్ని ఆశ్రయించేవాళ్లం… ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడే బొమ్మన్, బెల్లీ పెళ్లి జరిగింది… అదీ షూట్ చేశాం… ‘‘నాన్న ఓ ఫోటోగ్రాఫర్, అమ్మ జంతుప్రేమికురాలు… మా బామ్మ నేచురలిస్టు, స్కూలు పిల్లలకు ప్రకృతి పాఠాలు నేర్పించేది… సో, నాకు నడకకన్నా ముందు ప్రకృతిని ప్రేమించడం నేర్పించింది మా కుటుంబం…
మాల్స్, మూవీస్‌కు కాదు… మా కుటుంబం అడవుల్లో, గుట్టల్లో, బీచుల్లో పడి తిరిగేది… నాకు 18 నెలలున్నప్పుడు ఫస్ట్ టైమ్ నన్ను క్యాంపింగుకు తీసుకుపోయారు… ఊటీలోని నీలగిరి బయోస్పియర్ రిజర్వ్‌లో పెరిగాను… అంటే అన్నిరకాల జంతువుల నడుమ పెరిగాను… మా ఇంటి గేటుకు దగ్గరలో కెమెరా ట్రాప్స్ పెట్టారు… చిరుతలు, పులులను ఆ కెమెరాలు బంధించేవి… అలా నాకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మీద ప్రేమ పెరిగింది’’ అని తన నేపథ్యాన్ని వివరించింది కార్తీకి…
ఇప్పుడు ఆస్కార్ ఆమెకు అంతులేని ఉత్సాహాన్ని, తదుపరి ప్రాజెక్టు దిశలో బలాన్ని ఇచ్చింది… ‘‘ప్రపంచానికి మరోవైపు వెళ్లిపోతున్నాను… పసిఫిక్ నార్త్ వెస్ట్‌లోని ఆర్కాస్ మీద, ప్రజలతో వాటి బంధం మీద ఫిలిమ్ తీస్తాను… ఏనుగుల్లాగే అవి కూడా తెలివైనవి… అందమైనవి… ఇంకా ఇంకా అడవుల లోపలికి వెళ్లాలి…’’ అంటూనే చివరలో అసలు విషయం చెప్పింది ఆమె… ది ఎలిఫెంట్ విష్పరర్స్ కథలోని రఘు పెద్దదైపోయింది… వాళ్లను విడిచిపెట్టి బయటికి వచ్చేసింది… త్వరలో అమ్ము కూడా ప్రకృతి ఒడిలోకి వెళ్లిపోకతప్పదు… !!
చివరగా :: మనదేశంలో ఎవరికైనా రెండుసార్లు ఆస్కార్ పురస్కారం వచ్చిందా..? వచ్చింది..! గుణీత్ మాంగా అనే మహిళా నిర్మాత రెండు సార్లు ఈ పురస్కారం పొందారు. “పీరియడ్ : ఎండ్ అఫ్ సెంటెన్స్” అనే డాక్యుమెంటరీకి 2019లో మొదటిసారి ఈ అవార్డు దక్కింది… ఈ ఏడాది రెండోసారి “ది ఎలిఫెంట్ విస్పరర్స్” డాక్యుమెంటరీకి ఆస్కార్ పురస్కారం లభించింది…
Share this Article