అనేక మంది చనిపోతే అది ఒక సంఖ్య, మన వారు ఏ ఒక్కరు చనిపోయినా అది విషాదం… సమాజంలో మనం చూసే పోకడ ఇది. తన దాకా రానప్పుడు ‘తాను’లు కొందరు, పెద్దమనుషుల వేషం వేసుకొని, ఆ విషయంలో తమకు తగిన అవగాహన – జ్ఞానం లేకున్నప్పటికీ ఉత్తుత్తి భరోసాలు ఇస్తూ పోతుంటారు. మరణాల గురించి గతంలో లేని ప్రచారం ఇప్పుడు వుంది తప్ప, నిజంగా గుండె జబ్బుల మరణాలు పెరగలేదు అనే భ్రమ వల్ల… తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే, మరింత మంది చనిపోతారు. వాస్తవాలను గుర్తించాలి, ప్రమాదాలు ఎదురు కాకుండా తగిన నివారణ జాగ్రత్తలు తీసుకోవాలి. అదే వివేకం.
కోవిడ్ కాలం, ఆ తర్వాతి కాలంలోని మరణాల గురించి విశ్లేషించే ముందు ఒక విషయాన్ని పరిశీలిద్దాం. భూమిని ఒక చెట్టుగా భావించి, మనుషులను ఆకులుగా చూద్దాం. ఆకులు పండి రాలడాన్ని చనిపోవడంగా చూద్దాం. ఆకులు, ఈ సందర్భంలో మనుషులు… రాలిపోవడానికి ముసలితనం ఒక ముఖ్యమైన కారణం అయితే, దీర్ఘ కాలిక వ్యాధులు మరో ముఖ్యమైన కారణం. ఇంకా అనేక కారణాలు వున్నా, ఇప్పుడు దీర్ఘ కాలిక జబ్బుల గురించి మాట్లాడుకొందాం.
కోవిడ్ ఒక పెద్ద తుఫాన్ లా ప్రపంచాన్ని కుదిపేసింది. కోవిడ్ తో సహా ఏ తరుణ (ఎక్యూట్) వ్యాధి అయినప్పటికీ, వృద్ధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిని కూడా త్వరగా చావుకు దగ్గర చేస్తుంది. అనగా సాధారణ పరిస్థితులలో ఒక సంవత్సరం, రెండేళ్లు లేదా అంతకుమించి కాలం వరకు జీవించగలిగే అవకాశం వున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు… కోవిడ్ వంటి ప్రపంచ పీడ (పాండెమిక్) కాలంలోనే చనిపోతారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల కాలం మరణాలు సగటు కన్నా తక్కువగా ఉంటాయి. గత శతాబ్దపు స్పానిష్ ఫ్లూ ప్రపంచ పీడ తరువాత కొన్ని సంవత్సరాల పాటు మరణాలు తగ్గాయి.
Ads
కోవిడ్ తరువాత, ప్రస్తుతం మరణాలు కోవిడ్ ముందు కాలం సగటు మరణాలతో పోల్చి చూసినప్పుడు చాలా ఎక్కువగా వున్నాయి. కోవిడ్ కాలంలో వైద్యం అందని క్యాన్సర్, గుండె, ఇతర జబ్బులు వల్లనే కాకుండా… గతంలో ఏ జబ్బులూ లేని ఆరోగ్యంగా ఉండేవారు కూడా అధిక సంఖ్యలో మరణించడం గమనిస్తున్నాం. ఈ అంశాలు శాస్త్రీయంగా రుజువయ్యాయి. ప్రతి మరణం యొక్క కారణాన్నీ నమోదు చేసే విధానం ఉన్న అభివృద్ధి చెందిన దేశాలు అన్నింటిలోనూ కోవిడ్ తర్వాత అధిక మరణాలు గమనించారు.
2022 ఫిబ్రవరిలో విఖ్యాత శాస్త్రీయ జర్నల్ ‘నేచర్’ లో ప్రకటించిన అధ్యయనంలో, తేలికపాటి కోవిడ్ బారిన పడి బయటపడ్డ వారిలో కూడా గుండె సంబంధ అనారోగ్యాలు, మరణాలు చాలా పెరిగాయి అని తెలిపింది. కోవిడ్ జబ్బులో సంభవించే గుండె వాపు (మయోకార్డైటిస్) మూలంగా రోగులు గుండెపోటు, గుండె అవలయ (ఎర్రిత్మియా), ఊపిరితిత్తుల్లోనూ, మెదడు వంటి ఇతర అవయవాలలోనూ రక్తం గడ్డ కట్టడం వంటివి వైద్యశాస్త్రం గమనించిన విషయాలు.
కోవిడ్ తర్వాత గుండె మరణాలలో, గుండె రక్తనాళాల (కొరోనరీ ఆర్టెరీస్)లో అడ్డు (ప్లాక్) లేకుండా ఉండటం అధికంగా గమనించారు. ఈ రకం ‘మయోకార్డియల్ ఇన్ఫార్‌క్షన్ విత్ నాన్ అబ్‌స్ట్రక్టివ్ కొరోనరీ ఆర్టెరీస్’ (MINOCA) అనేది గతంలో దాదాపు 5% ఉండగా, కోవిడ్ బారిన పడి, కోలుకున్న గుండెపోటు రోగులలో… మహిళల్లో 35% గానూ పురుషుల్లో 18 శాతం గాను గమనించారు. వీరిలో రక్తం అతి చిన్న గడ్డలు కట్టి చిన్న రక్తనాళాలను అడ్డగించడం మూలంగా ఈ రకమైన గుండెపోటు సంభవిస్తుందని భావిస్తున్నారు.
తాజాగా, అభివృద్ధి చెందిన యూరోప్ లోని అన్ని దేశాలలో కోవిడ్ ముందటి సగటుతో పోల్చితే, దాదాపు 6 నుండి 16 శాతం మరణాలు అధికంగా నమోదయ్యాయి. అదేవిధంగా అమెరికా, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో కూడా కోవిడ్ పీడ తర్వాత అదనపు మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో అధిక శాతం గుండె జబ్బు మరణాలు. అనగా కోవిడ్ తర్వాత అదనపు మరణాలు – అందులోను గుండె మరణాలు పెరగడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. ఇటీవల కాలంలో 20 – 44 సంవత్సరాల మధ్య వయసుగల వారిలో గుండె సంబంధిత జబ్బులు దాదాపు 30 శాతం మేరకు పెరిగాయని అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ అధికారులు ప్రకటించారు.
గుండెపోటును నివారించడానికి గాను, గుండెపోటుకి గురయ్యే అవకాశాలు (రిస్క్ ఫ్యాక్టర్స్) ఎక్కువగా ఉన్న వారికి దీర్ఘకాలం పాటు ఏస్పిరిన్ 75 మిల్లీగ్రాములు వాడటం అనేది గొప్ప ఫలితాలను ఇచ్చేదిగా రుజువైన చికిత్స. అధిక రక్తపోటు, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, ఇప్పటికే గుండెకు రక్త సరఫరా తక్కువ కావడం వల్ల గుండె నొప్పి (Ischemia), స్టెంట్, బైపాస్ సర్జరీ, గుండెపోటుకు గురైన వారు, బ్రెయిన్ స్ట్రోక్ పేషంట్స్ కి మళ్లీ గుండెపోటు రాకుండా ఉండడానికి ఏస్పిరిన్ 75 మిల్లీ గ్రాములు రోజుకు ఒకటి చొప్పున వాడటం ప్రస్తుతం ప్రామాణిక వైద్యం. ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్ లలో కోవిడ్ బారిన పడి కోల్పోవడం కూడా చేర్చాలని కొందరు నిపుణులు చెప్తున్నారు. కడుపులో అల్సర్లు లేని, కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు ఏస్పిరిన్ వాడటం శ్రేయస్కరం. ఇది అవగాహన కోసం మాత్రమే. ఏ ఒక్కరికీ చికిత్స సలహా కాదు.,……… డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండీ, సాంక్రమిక వ్యాధుల నిపుణులు, కాకినాడ, 13 మార్చ్ 2023
Share this Article