ఆస్కార్ దుకాణంలో అన్నీ ఎక్కువ రేట్లే ఉంటాయి… డబ్బు ఉండగానే సరిపోదు, దుకాణదారుడిని మెప్పిస్తే తప్ప కొనుక్కోలేం… ఆస్కార్ అంగడిలో ఏదైనా సరుకు కొనుక్కోవడం ఓ ఆర్ట్… అందుకే మనవాళ్లు చాలామంది భంగపడ్డారు… రాజమౌళి తెలివైన కొనుగోలుదారు, కొనడంలో సక్సెసయ్యాడు… దేశమంతా డప్పుమోతలు ఆకాశాన్నంటాయి… గతంలో బాలీవుడ్ నుంచి ఆస్కార్ ప్రయత్నాలు కొన్ని సీరియస్‌గానే జరిగాయి, కానీ ఎవరికీ ఏమీ రాలేదు…
స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు సంబంధించి రెండు అవార్డులొచ్చినయ్… అదేమో బ్రిటిష్ కంపెనీ నిర్మించిన సినిమా… అయితే ఇండియా నుంచి అత్యధిక సార్లు ఆస్కార్ తలుపుతట్టి భంగపడింది ఎవరో తెలుసా..? కమల్ హాసన్…! నో డౌట్, తను గొప్ప నటుడు… వయస్సు 68 ఏళ్లు… ఇండస్ట్రీలో వయస్సు 60 ఏళ్లు… దేశంలో ఇంతటి సుదీర్ఘమైన సినిమా కెరీర్ ఎవరికీ లేదు… తను లీడ్ రోల్స్ చేసిన 7 సినిమాలు ఆస్కార్ ముంగిట్లో నిలిచాయి, కానీ మార్కెటింగ్ వైఫల్యం కారణంగా ఒక్కటి కూడా కనీసం నామినేషన్ పొందలేకపోయింది… షార్ట్ లిస్ట్ దశనూ చేరలేకపోయింది…
తన వ్యక్తిగత జీవితం మీద చాలామందిలో ఓ పెదవి విరుపు కనిపిస్తుంది… తనతో ఏళ్ల సహజీవనం చేసిన వాళ్లకే తనంటే అసహ్యం… నటుడు వేరు- మనిషి వేరు… తను హేతువాది… రాజకీయవాది… పాలిటిక్సులో అట్టర్ ఫ్లాప్… సుహాసినిని, బిడ్డలను బజార్లకు పంపి డాన్సులు చేయించినా జనం వోట్లేయలేదు… ఇదంతా వ్యక్తిగతం, కానీ వృత్తిగతం అపూర్వం… అనేక ప్రయోగాలు, అబ్బురపరిచే నటన… తన అసలు పేరు పార్థసారథి… తండ్రి శ్రీనివాసన్… వెరసి పార్థసారథీ శ్రీనివాసన్…
Ads
ఇండియన్ సినిమాలో తను ఏమిటో సాధించిన అవార్డులు చెబుతాయి… మూణ్రాంపిరై, నాయకన్, ఇండియన్ సినిమాలకు జాతీయ ఉత్తమ నటుడు… థేవర్ మగన్‌కు అయిదు జాతీయ అవార్డులు వచ్చాయి… ఫిలిమ్ ఫేర్ అవార్డులకు లెక్కే లేదు… 19 అని అభిమానులు లెక్క చెబుతారు… కేవలం తమిళంలోనే కాదు, తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో నటనకు తను పొందిన అవార్డులు అవి… సినిమా సర్కిళ్లలో ఓ ప్రచారం ఉంది… దయచేసి, ఇకపై తనకు అవార్డులు ఇవ్వవద్దనీ, అసలు తన పేరే పరిశీలనకు తీసుకోవద్దనీ ఫిలిమ్ ఫేర్‌కు లేఖ రాశాడట… సాగర్ సినిమాలో నటనకు ఉత్తమ యాక్టర్, ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ అవార్డులు ఏకకాలంలో పొందాడు…
ఆస్కార్ సంగతికొస్తే… మొత్తం ఏడుసార్లు ఆస్కార్ ప్రయత్నాలు జరిగాయి… సాగర్ హిందీ సినిమాలో లీడ్ రోల్ పోషించినందుకు తొలి ప్రయత్నం… అదేగాకుండా క్షత్రియపుత్రుడు, ద్రోహి, నాయకుడు, భారతీయుడు, హేరామ్, స్వాతిముత్యం సినిమాల్లో నటనకూ ఆస్కార్ అవార్డుకు దరఖాస్తు చేశారు… కానీ ఆస్కార్ అవార్డుకు ఓ దరఖాస్తు పడేస్తే సరిపోదు… చాలా ఎఫర్ట్ ఉంటుంది… అది చేతకాలేదు… డబ్బు ఖర్చు పెట్టలేదు… నా నటనకు కళ్లుమూసుకుని అవార్డు ఇస్తారులే అనుకున్నాడు… దెబ్బకొట్టింది… ఒక్కటంటే ఒక్కటీ నామినేషన్ దశకు చేరలేదు…
నటనకు గుర్తింపు దిశలో కమల్‌హాసన్ అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందాడు… మరే ఇతర హీరోకు ఇది సాధ్యం కాలేదు… ఇప్పటికీ స్టిల్ రన్నింగ్ కెరీర్… కానీ తన మొత్తం కెరీర్‌లో తనకున్న అసంతృప్తి ఆస్కార్ అవార్డు పొందలేకపోవడం…! మొన్నమొన్ననే ఓ సినిమా వందల కోట్లు వసూలు చేసింది… ఏడు విఫలప్రయత్నాల తరువాత కమల్ హాసన్ ఇక ఆస్కార్ గడప తొక్కలేదు… నిజానికి దశావతారం సినిమాలో తన నటన ఆస్కార్ అవార్డుకు అర్హమైందే… లింగభేదం, వయోభేదం, జాతిభేదం, వృత్తిభేదం, దేశభేదం అన్నీ రిఫ్లెక్టయ్యేలా పది పాత్రల ఎంపిక జరిగింది… అపూర్వంగా నటించాడు…
స్వాతిముత్యం సినిమాకు అవార్డు వస్తుందని బలంగా నమ్మాడు కమల్ హాసన్… విఫలమైన తరువాత వాటిపై వైరాగ్యాన్ని పెంచుకున్నాడు… ప్రస్తుతం ఇండియన్-2, శెభాష్ నాయుడు సినిమాలున్నయ్ చేతిలో… బిగ్‌బాస్ హోస్టింగ్ సరేసరి… రాజమౌళికి కార్తికేయ దొరికినట్టు, కమల్‌హాసన్‌కు కూడా ‘చక్కబెట్టగల’ మార్కెటింగ్ దిట్ట దొరికిఉంటే ఒకటోరెండో ఆస్కార్ అవార్డులు ఖచ్చితంగా కొట్టేవాడు…!
Share this Article