వార్త ఏమిటంటే..? భూగర్భంలోని ఒక టెక్టానిక్ ప్లేట్ రెండుగా విడిపోతోంది… దానిపై ఉన్న ఆఫ్రికా ఖండం కూడా రెండుగా చీలిపోతుంది… ఈ రెండు చీలికల నడుమ ఓ కొత్త సముద్రం ఏర్పడుతుంది… కానీ ఇవన్నీ జరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టొచ్చు….. ఇదీ వార్త… ఎవరో ఏదో రాస్తారు… ఇంకేం..? అందరూ దాన్నే పట్టుకుని పీకుతూ ఉంటారు… జరుగుతున్నది ఇదే…
ఏ ఇంగ్లిష్ వాడు రాస్తే ఈనాడు అనువాదం చేసుకుందో, సొంత భాషలో రాసుకుందో, లేక తనే ఈ కొత్త ఖండం, కొత్త సముద్రం అని కలలు కన్నదో కానీ…. ఫోటో మాత్రం బాగుంది… కానీ కొన్ని వేల సంవత్సరాల తరువాత రాజు ఎవడో, బంటు ఎవడో… ఈ చీలిక పూర్తి కావడానికి వేల సంవత్సరాలే కాదు, కోటి సంవత్సరాలు కూడా పట్టొచ్చు…
ఇది జరిగినా సరే… సోమాలియా, ఇథియోపియా, టాంజానియా, కెన్యాలోని కొన్ని ప్రాంతాలు విడిపోయినా సరే, వాటిని కలిపి కొత్త ఖండంగా గుర్తించాల్సిన పనేముంది..? నిజానికి ఒక ఖండం అనే పదానికి నిర్వచనం ఏమిటి..? ఖండంగా గుర్తించడానికి చుట్టూ సముద్రం ఉండి, కొన్ని దేశాలు కలిసి ఉండటమా అర్హత..? అలాగైతే మరి ఒక్కడూ ఉండని, పూర్తిగా మంచుతో నిండి ఉన్న అంటార్కిటికా ఖండం అనిపించుకోబడటం కరెక్టేనా..?
Ads
యూరప్, ఆసియా ఒకచోట కలిసే ఉంటాయి… అంతెందుకు..? రష్యా రెండు ఖండాల్లోనూ విస్తరించి ఉంటుంది కదా… ఆస్ట్రేలియా ఒకే దేశం కదా… సో, ఖండం అనే పదానికి స్పష్టమైన నిర్వచనం, ప్రమాణాలు కానీ లేవు… అందుకని రేప్పొద్దున మూడునాలుగు దేశాలు విడిపోయినా సరే, దాన్ని ఓ ప్రత్యేక ఖండంగా గుర్తించాల్సిన అవసరమూ లేదు…
ఒకవేళ ఆ చీలికి పెరిగి, అందులోకి సముద్రం విస్తరిస్తుంది తప్ప కొత్త సముద్రమేమీ పుట్టుకురాదు… నిజానికి సముద్రాలకు పేర్లు కూడా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెట్టుకోబడినవే తప్ప సముద్రం అనే పదానికి కూడా సరైన, సంపూర్ణ, స్పష్టమైన నిర్వచనం గానీ, ప్రామాణికాలు గానీ ఏమీ ఉండవు… ప్రస్తుతం కనిపిస్తున్న చీలిక ఓ పెద్ద భూకంపం తాలూకు ఎపిసెంటర్‌లాగా కనిపిస్తున్నది. అంతే తప్ప దాని విస్తృతి అంత పెద్దగా ఏమీలేదు… ఇప్పుడప్పుడే వైపరీత్యాలు ఏమీ చోటుచేసుకోవు… ఐనా అప్పటిలోగా భూతాపం రెండు డిగ్రీలు పెరిగితే జరగబోయే విధ్వంసంతో పోలిస్తే ఇది అసలు చెప్పుకోదగిన పరిణామమే కాబోదు…!!
ఉపసంహారం :: మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక కలిసి… దేశంలోని మిగతా ప్రాంతంతో ఇలాగే విడిపోతే… అంటే దండకారణ్యం, గోదావరికి దిగువ వైపు మొత్తం ఇలాగే చీలిపోతే… ఏ టెక్టానిక్ ప్లేటో కరుణిస్తే… ప్రపంచంలోని అగ్రదేశాల్లో ఒకటి, కాదు, ఒకటో నెంబరు దేశం లేదా కొత్త ఖండం అవుతుంది కదా అన్నాడు ఓ మిత్రుడు… నో కామెంట్…!! అప్పటికి తెలుగు భాష బతికి బట్టకడితే… తెలుగులోనే ఈ ఖండం పేరు పెట్టుకోవచ్చుననీ అన్నాడు…!!
Share this Article