మలయాళం సినిమాల్లో నటించే జోజు జార్జ్ వైష్ణవ్ తేజ హీరోగా చేయబోయే ఓ తెలుగు సినిమాలో విలన్ పాత్రకు అక్షరాలా కోటిన్నర అడిగాడట… మలయాళీ నటులకు అంత డిమాండ్ ఉందా..? అంత భారీ పారితోషికాలు అడిగేంత సీన్ ఉందా..? ఉంది… ఇరట్టా సినిమా చూశాక జోజు జార్జ్ కోటిన్నర అడగడంలో తప్పేమీ లేదనిపిస్తుంది… ఇరగేశాడు సినిమాలో…
ఒక క్రైం థ్రిల్లర్ సినిమా తీస్తే… చివరివరకూ ఆ సస్పెన్స్ థ్రెడ్ ప్రేక్షకుడికి అంతుపట్టకూడదు… రకరకాల వ్యక్తుల మీదకు సందేహాలు పోయేలా స్క్రిప్టు రచన ఉండాలి… కథలోని కీలక పాయింట్లను ఒక్కొక్కటే పొరలాగా తీస్తూ వెళ్లాలి… దీనికితోడు పాత్రధారుల నటన, సంగీతం గట్రా బాగుంటే సినిమా క్లిక్కవుతుంది… ఇరట్టా అనే సినిమా మలయాళంలో సక్సెస్ సాధించింది…
ఇప్పుడు అదే తెలుగులోకి డబ్ అయిపోయి పలకరిస్తోంది… సినిమా కథేమిటబ్బా అని చూస్తే… అది కేరళ… వాగమన్ అనే ఊరు… అందులో ఓ పోలీస్ స్టేషన్… చిన్న ఈవెంట్ ఏదో జరుగుతూ ఉంటుంది… అక్కడికి అటవీ శాఖ మంత్రి రావల్సి ఉంది… అదే హడావుడిలో అందరూ ఉండగా స్టేషన్‌లో తుపాకీ కాల్పులు వినిపిస్తాయి… లోపల ఏఎస్ఐ వినోద్ చనిపోయి కనిపిస్తాడు… ఆ సమయంలో అక్కడ ముగ్గురు పోలీసులు లోపలే ఉంటారు…
Ads
ఇక అక్కడి నుంచీ మొదలవుతుంది… వినోద్‌ను చంపింది ఆ పోలీసులేనా..? లేక ఇంకేమైనా కారణాలున్నాయా..? పోలీసులే చంపితే కారణమేంటి..? ఈ ప్రశ్నలతో మొదలవుతుంది కథనం… ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌తో ఈ మరణానికి కారణాలను రివీల్ చేస్తూ వెళ్తాడు దర్శకుడు… అంటే మనమే ఊహిస్తూ ఉండాలి… ఆ ఎపిసోడ్స్ చూస్తూ ఎవరు చంపి ఉంటారు అని… ఏ దశకు మన ఊహాల్ని తీసుకెళ్తాడు దర్శకుడు అంటే వినోద్‌ను సోదరుడు ప్రమోద్ చంపి ఉంటాడని అనుమానిస్తాం ఒక దశలో… బట్ క్లైమాక్స్‌ను ఓ రేంజులో తీసుకుపోయాడు…
నిజానికి ఓ పోలీసాయన స్టేషన్‌లోనే, జనం ఎదుట, త్వరలో ఓ మంత్రి రాబోతున్న హడావుడిలో, పోలీసులు లోపల ఉండగానే హతమారిపోవడం అనేది మంచి పాయింట్… అఫ్‌కోర్స్, దాన్ని బలంగా, ఆసక్తికరంగా ప్రజెంట్ చేయగలిగితేనే ఇలాంటి పాయింట్లు పండుతాయి… ఇక్కడా అంతే… కథను చెప్పిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది… జోజూ జార్జ్ కూడా రెండు పాత్రల్ని ప్రతిభావంతంగా పోషించాడు… తను లేకపోతే సినిమా లేదు అన్నట్టుగా సాగుతుంది… సో, తెలుగు సినిమాకు కోటిన్నర అడిగాడంటే, అందులో అన్యాయం ఏమీ లేదు… రీజనబుల్ రేటే…!!
Share this Article