ఎంత పెద్ద కమెడియన్ కావచ్చుగాక… కోట్ల మంది అభిమానులు ఉండవచ్చుగాక… తన షోలో ఒక్కసారైనా పాల్గొనాలని పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా కోరుకుంటూ ఉండవచ్చుగాక… సినిమావాళ్లేనా మమ్మల్నీ పిలవొచ్చు కదాని రాజకీయ నేతలు, బడా వ్యాపారులు కుళ్లిపోతుండవచ్చుగాక… కానీ ఒక్కసారి ఆ కమెడియన్ తన జానర్ మార్చి, సినిమాల్లో నటించి, ఇక్కడ కూడా ఆదరించండి అంటూ జనాన్ని వేడుకున్నా సరే… జనం వినిపించుకోకపోవచ్చు…
ఫోఫోవయ్యా… మంచి కామెడీ అందిస్తున్నవ్, మేం ఆనందిస్తున్నం, పిచ్చి సినిమాల్లో నటించడానికి వందల మంది ఉన్నారు, వాళ్ల ఎరీనాలోకి నువ్వు ఎందుకు వెళ్తున్నావు… నీ సీరియస్‌నెస్ మేం సినిమాల్లో చూడలేం… జస్ట్, వుయ్ లవ్ యువర్ కామెడీ వోన్లీ అని తేల్చిచెబుతుంటారు… మనకు తెలుసుగా… ఆలీ, సునీల్ వంటి ఉదాహరణలు ఎన్ని చూడలేదు..? అంతెందుకు నవ్వుకు తెలుగు ఐకన్‌లా నిలిచిన బ్రహ్మానందాన్ని ఒక్కసారి సీరియస్ పాత్ర వేయమనండి… తనకు అర్జెంటుగా తత్వం బోధపడుతుంది…
జనం ఎలా చూస్తారు..? ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదే ప్రధానం… నీ ప్రతిభ ఇతర జానర్లలోకి కూడా సమర్థంగా విస్తరిస్తే అన్నిసార్లూ అది ప్రజాదరణ పొందకపోవచ్చు… కపిల్ శర్మ ఇప్పుడు ఓ తాజా ఉదాహరణ… పెద్ద అక్షయ్ కుమార్ సినిమాలే కొట్టుకుపోతున్న ట్రెండ్ ఇప్పుడు బాలీవుడ్‌లో… పఠాన్, దృశ్యం-2 తప్ప రెండేళ్లుగా చెప్పుకోవడానికి ఏముంది..? ఏమీలేదు… అందులోనూ దృశ్యం కూడా సౌత్ క్రియేషనే… పఠాన్ విజయం అత్యంత అనుమానస్పదం…
Ads
అలా ప్రేక్షకుల తిరస్కరణకు గురవుతున్న సినిమాల జాబితాలో కపిల్ శర్మ నటించిన తాజా సినిమా జ్విగాటో కూడా చేరిపోయింది… అదీ మరీ దారుణ పరాజయం… మొదటిరోజు వసూళ్లు కేవలం 42 లక్షలు… అత్యంత దయనీయం… రెండోరోజు 65 లక్షలు… మూడోరోజు ఆదివారం కాబట్టి ఓ 10 లక్షలు పెరగొచ్చు… ఆ తరువాత..? దేవుడికే తెలియాలి… కపిల్ శర్మ కామెడీ ఎపిసోడ్స్ ఒక్కొక్కదాని బడ్జెట్ కోటిపైచిలుకు.. అంటే ఈ సినిమా ఎంత ఫ్లాపో అర్థం చేసుకోవచ్చు… (తన మొదటి సినిమా తొలిరోజున 8 కోట్లు సాధించింది… మలి సినిమా కూడా 3 కోట్లకు పైగా సంపాదించింది తొలిరోజు…)
నిజానికి ఈ సినిమా కథ మంచిదే… కపిల్ శర్మ ఓ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో బాయ్… (జొమాటో అని స్ఫురించేలా జ్విగాటో అని పేరు పెట్టారు…) కరోనా లాక్ డౌన్ పిరియడ్‌లో తను ఎదుర్కున్న కష్టాలు, ఆ కుటుంబం ఉపాధి పోరాటం ఈ సినిమా కథ… కపిల్ స్వతహాగా మంచి నటుడే… తనకుతోడుగా నటించిన షాహనా గోస్వామి నటనకూ ప్రశంసలు దక్కాయి… కానీ వసూళ్లు చూస్తే… నిజంగానే లాక్ డౌన్ పీరియడ్‌లో కొలువు కోల్పోయిన ఉద్యోగి బతుకు కష్టాల్లాగే ఉన్నాయి… !!
Share this Article