ఇదొక వ్యూహం… అనేకానేక ఉచిత షోలు వేసి, జర్నలిస్టులను, ఇతర ప్రముఖులను పిలిచి సినిమాను చూపించడం… వాళ్లు ఫేస్ బుక్‌లో మొహమాటం రివ్యూలు రాసి ఆహారాగాలు ఆలపిస్తారు… ఇవి గాకుండా పెయిడ్ రివ్యూలు ఓహోరాగాల్ని అందుకుంటాయి… తద్వారా ఓ రాయిని దేవుడిని చేస్తారు…
అంతే ఇక… అత్యంత పవిత్రం, నాటునాటు పాటలాగే… ఎవరూ విశ్లేషించడానికి వీల్లేదు, సమీక్షించడానికి వీల్లేదు… తటస్థులు కూడా భక్తితో దండం పెట్టాల్సిందే… ఆమధ్య సాయిపల్లవి నటించిన విరాటపర్వం మీద ఇలాగే రాశారు… తీరా సినిమా విడుదలయ్యాక అందులో ఏమీలేదని తెలిసి తటస్థ రివ్యూయర్లు ఏకిపారేశారు… సినిమా ఫట్‌మని కొట్టుకుపోయింది… మొన్నటి బలగం మాత్రం ఆ ప్రభావం నుంచి తప్పించుకుంది… లక్కీగా…
రంగమార్తాండ సినిమా కూడా అంతే… లబ్దప్రతిష్టులుగా సదరు చిత్ర నిర్మాత, దర్శకుడు, రచయిత భావించిన వాళ్లను పిలిచారు, చూపించారు కదా… వాళ్లు పలు కీర్తనలు రాశారు కదా… నిజంగా అంత గొప్పగా ఉందాని చూస్తే… అంత గొప్పతనం ఏమీ లేదు… కాకపోతే రొటీన్, ఫార్ములా, ఇమేజీ బిల్డప్పులు, చెత్తాచెదారం వంటి సినిమాలతో పోలిస్తే చాలా చాలా బెటర్…
Ads
అశ్లీలం లేదు, అడ్డమైన ఐటం సాంగ్స్ లేవు, పిచ్చి స్టెప్పులు, దరిద్రమైన ఫైట్స్ లేవు… కుటుంబ బంధాల్ని, ఉద్వేగాల్ని బలంగా ప్రజెంట్ చేయడానికి దర్శకుడు కృష్ణవంశీ ప్రయత్నించిన తీరు మాత్రం కనిపిస్తుంది… నటుల నుంచి ఉద్వేగాల్ని పిండుకోవడానికి ప్రయత్నించాడు… నిజానికి ఇలాంటి సబ్జెక్టులు ఈరోజుల్లో రిస్క్… ఐనాసరే సాహసం చేశాడు నిర్మాత ఎవరోగానీ, కృష్ణవంశీని నమ్ముకుని…
సినిమా అంత ప్రభావవంతంగా లేదు కనుకే ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా, నాలుగేళ్ల క్రితమే స్టార్టయినా బయ్యర్లు దొరకలేదు… నిర్మాత నానాకష్టాలూ పడ్డాడు పాపం అమ్ముకోవడానికి..! సరే, అవి అలా వదిలేస్తే ఒకప్పటి ప్రేక్షకుల టేస్ట్ వేరు… ఇప్పుడు వేరు… అద్భుతమైన విజయం సాధించిన శంకరాభరణం సినిమా కథలాంటిదే మళ్లీ ఆమధ్య అదే విశ్వనాథ్ ఏదో సినిమా తీశాడు… ఏమైంది..? సినిమా పేరు కూడా గుర్తులేదు ఎవరికీ…!
సేమ్, రంగస్థల కళాకారుల సబ్జెక్టు ఇప్పటి ప్రేక్షకుల్లో ఎవరికి పట్టాలి..? సరే, ఏ అసభ్యపు అప్రోచ్ కూడా లేకుండా, కేవలం జీవితపు ఉద్వేగాల్ని బలంగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించాడు కాబట్టి సినిమా నడవాలనే ఆశిద్దాం… మన దిక్కుమాలిన ఇమేజీ బిల్డప్పుల నుంచి ఇలాంటి సినిమాలే కాస్త రిలీఫ్… అయితే సినిమాలో కొన్ని బలాలు ఉండాలి… శంకరాభరణం సినిమాకు సంగీతం పెద్ద ప్లస్ పాయింట్… ప్రత్యేకించి బాలు గాత్రం…
కానీ రంగమార్తాండకు అదేమీ లేదు… అంతటి పేరుప్రఖ్యాతులు వహించిన ఇళయరాజా చేతులెత్తేశాడు… పైగా తనే పాడిన బిట్స్ చిరాకు పుట్టించాయి.,. సిరివెన్నెల కంటెంటు కూడా వృథా అయిపోయింది… ప్రకాష్ రాజ్ పలుచోట్ల అదుపు తప్పిపోయాడు… తను మంచి నటుడే కానీ నటన ‘అతి’ కాకూడదు… పాత్రకు సరిపడా నటన అంటే ఏమిటో ప్రకాష్ రాజ్ ఈరోజుకూ నేర్చుకునే స్థితిలోనే ఉన్నాడంటే ఆశ్చర్యమే… బ్రహ్మానందం స్వతహాగా మంచి నటుడు… తనను ఇండస్ట్రీ ఇన్నేళ్లూ సరిగ్గా వాడుకోలేదు గానీ తన సీనియారిటీ, తన అనుభవం ఈ సినిమాలో కనిపించింది… ఇన్నాళ్లూ తనను ఇలాంటి పాత్రలకు దూరం చేశారనే కసితో చేసినట్టనిపించింది… భేష్…
నిజం చెప్పాలంటే… ఈ ప్రకాష్ రాజ్, ఈ రమ్యకృష్ణల నటనను చాలాకాలంగా చూస్తున్నదే… జీవిత, రాజశేఖర్ బిడ్డ శివాత్మిక అభినయం బాగుంది… మంచి పాత్రలు పడాలే గానీ ఆమెలోని నటి మరింత విజృంభించే చాన్సుంది… అసలు ఓ గాయకుడిగా మాత్రమే పరిచయం ఉన్న రాహుల్ కూడా సటిల్డ్‌గా, ఆ పాత్రకు అవసరమైనంత నటనను కనబరిచాడు… ఎక్కువ లేదు, తక్కువ లేదు… అనసూయ గురించి చెప్పడం వేస్ట్…
కృష్ణవంశీ కెరీర్‌కే ఈ సినిమా పెద్ద అగ్నిపరీక్ష… ఖడ్గం, చందమామల తరువాత తను పెద్దగా హైలైట్ కాలేదు… ఈ సినిమా కూడా నాలుగేళ్లపాటు సుదీర్ఘంగా నిర్మాణం సాగింది… ఒకవేళ సినిమా విజయవంతం కాకపోతే ఈ దర్శకుడి కెరీర్ సందేహంలో పడిపోయినట్టే ఇక… తను పాటల చిత్రీకరణలో పెట్టింది పేరు… ఇందులో అంతగా ఏమీ కనిపించలేదు… కేవలం ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంల నటన ఒక సినిమాను గట్టెక్కిస్తుందా..? చూడాలి… కథనంలో బిగి లేదు, ఎడిటింగ్ లోపం…
మళ్లీ చెబుతున్నా… ఇది డప్పులు కొట్టి, నెత్తిన పెట్టుకోదగిన గొప్ప సినిమా ఏమీ కాదు, కాకపోతే ఇలాంటి కథాబలం ఉన్న సినిమాలు ఆడాల్సిన అవసరమైతే ఉంది…!!
Share this Article