Prasen Bellamkonda……… రంగమార్తండ ప్రివ్యూ చూసి గాలన్ల కొద్దీ కన్నీరు పారించిన వారంతా నన్ను క్షమించాలి… అంతలేదు. టు బి ఆర్ నాట్ టు బి అనే షేక్స్పియరిన్ సంధిగ్ధత సినిమాలో చాలా సార్లు వినపడుతుంది. ఆ ప్రశ్న వెంటే దట్స్ నాట్ ద కొచ్చెన్ అనే సమాధానం కూడా ఉంటుంది కానీ… ఇప్పుడీ సమీక్షకుడికీ అదే క్వష్చన్. సినిమా బాగున్నవైపు నిలబడి మాట్లాడాలా బాగాలేని వైపు నిలబడి మాట్లాడాలా అని..
బాగా ఉన్న వైపు నిలబడి మాట్లాడడం ఓకే… కానీ బాగా లేని వైపు కూడా నిలబడి మాట్లాడాలనుకోవడం పట్ల సంధిగ్ధత, ఎందుకంటే ఇటువంటి సినిమాలు బతకాలి. ఇటువంటి సినిమాలు కచ్చితంగా బట్ట కట్టాలి.
బ్రహ్మానందంలో వెకిలి హాస్య నటుడే కాక ఒక మహా సీరియస్ నటుడు దాక్కున్నాడని చెప్పి, వాడ్ని బయటకు లాగి, ఇక ముందు అతను ఎలాంటి పాత్రలు చెయ్యాలో నిర్ధారించిన ఇటువంటి సినిమాలు కచ్చితంగా బతకాలి.రమ్యకృష్ణ లౌడ్ గా కాక అండర్ ప్లే తో కూడా ఇరగదీసెయ్యగలదని నిరూపించిన ఇటువంటి సినిమాలు కచ్చితంగా బట్టకట్టాలి. భావోద్వేగాల ఎత్తుపల్లాలలో విలవిల్లాడడం ఎంత సుఖమైన బాధో తెలియ చెప్పే ఇటువంటి సినిమాలు కచ్చితంగా బతికి బట్టకట్టాలి. ఫ-లు, మాధచ్చోద్ లకు చాలా దూరంగా వున్న ఇటువంటి సినిమాలు తప్పకుండా బతకాలి.
Ads
సరే మరైతే నాట్ టు బి సంగతేంటి?
సినిమా కథలో రెండు అంశాలున్నాయి. ఒకటి నాటకం గొప్పదనం. రెండు తమ ఆస్తులను పిల్లలకు అప్పగించి రోడ్డున పడే ముసలి తల్లి తండ్రుల కష్టాలు. నిజానికి ఈ రెండు అంశాల మధ్య ఏ పొంతనా లేదు. పొంతనే లేని ఈ రెంటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయంలో దర్శకుడికి స్పష్టత లేకుండా పోయింది.
పిల్లల చేతిలో దెబ్బతిన్న ముసలి తండ్రి వృత్తి ఏదన్నది ఈ తరహా కథలో ప్రధానాంశం కాదు. ధర్మ దాత లో ఎయెన్నార్ జమీందార్ అయివుండి చితికి పోతాడు. అక్కడ అతనిదీ అదే సమస్య. బహుదూరపు బాటసారి, సంసారం ఒక చదరంగం సినిమాలలోని వృద్ధులది అసలు ఏ వృత్తో పెద్దగా చర్చకే రాదు. ఎందుకంటే అక్కడ ఫోకస్ పిల్లల దుర్మార్గపు ప్రవర్తన మీదే.
రంగ మార్తాండలో స్టేజి నటుడు, షేక్స్పియర్, లౌడ్ యాక్టింగ్ తదితర అంశాల గురించి మాట్లాడి చివరకు మన అమ్మానాన్నలను మనం కాపాడుకుందాం అని యూఎస్‌పి ఇస్తే ప్రేక్షకుడేమనుకోవాలి. సినిమాకు ముఖ్యంగా అవసరమైన కాన్‌ఫ్లిక్ట్ మిస్సయిందిక్కడే. రంగస్థలం మీద నటించడానికి, జీవితంలో నటించడానికి మధ్య వైరుధ్యమే అసలు కాన్‌ఫ్లిక్ట్ అని దర్శకుడు గ్రహించలేక పోయాడు.
సరే, ధియేటర్ బయటకు వచ్చిన ప్రేక్షకుడు తన ఆస్తులను పిల్లలకు బతికుండగానే రాసేయ్యొద్దు అని తీర్మానించుకుంటే అది దర్శకుడి లేదా కథకుడి విజయమే. కానీ అది ధర్మదాత కాలం నాటి పాత చింతకాయ. ఈ నాటకాల బ్యాక్ డ్రాప్ ఏమిటి. దాన్ని దర్శకుడు వాడుకోవడంలో ఎక్కడ విఫలమయాడు. మరాఠీ నట సామ్రాట్ లో నాటకాన్ని బతికించుకుందాం అనే ఒక వేదన సినిమా ఆత్మగా వినపడుతూంటుంది కదా . దాన్ని కృష్ణ వంశీ తెలుగులో వినపడకుండా ఎందుకు చేసాడు. అసలు నాటకాన్ని చంపిందే సినిమా కదా.. నాటకాన్ని బతికించుకుందాం అని సినిమా ద్వారా చెప్పడం ఏమిటి అని కృష్ణ వంశీ అనుకున్నాడేమో.
సినిమాలో ఎంతసేపూ ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు గొప్ప నటుడు అని ఊదర గొట్టడమే తప్ప ఆ గొప్పతనాన్ని ప్రేక్షకుడికి రుజువు చేసే అంకం ఒకటి కూడా లేదు. ఏ కాటి సీనో, ఏ రక్త కన్నీరు సీనో, ఏ చింతామణి సీనో, ఏ కన్యాశుల్కమ్ సీనో, ఏ రావణ బ్రహ్మ రుద్రవీణ సీనో పెట్టి రంగమార్తాండుడి నటనా కౌశలం చూపి ఉంటే బాగుండేది. లేదూ , ఇవన్నీ ఒక్కో సందర్భంలో ఒక్కోటి చూపి ఉంటే కూడా బాగుండేది.
అలా సావిత్రి బయోపిక్ లోనూ ఎన్టీఆర్ బయోపిక్ లోనూ, రజని కాంత్ జగపతి బాబుల కధానాయకుడులోనూ సన్నివేశాలను పునఃసృష్టించి, ఆయా దర్శకులు గెలిచారు కూడా. అలాంటి ప్రయత్నం బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ ల నడుమ ఆసుపత్రిలో సుయోధన రాధేయ సంవాదం రూపంలో జరిగినా ఆ సన్నివేశంలో మార్కులన్నీ బ్రహ్మానందం కొట్టేసాడు. నేనైతే రంగమార్తాండుడిగా ప్రకాష్ రాజ్ పరిపూర్ణంగా విఫలమయాడనే చెపుతాను.
మరాఠీ నాటకాన్ని మరాఠీ సినిమాగా చాలా మార్చి తీశారు. మరాఠీ సినిమాను తెలుగు సినిమాగా ఇంకా చాలా మార్చారు. అయినా ఏదో మిస్సింగ్. ముఖ్యంగా నానా పాటేకర్ దారిదాపుల్లోకి కూడా ప్రకాష్ రాజ్ చేరలేదు. ఫస్థాఫ్ చాలా లాగ్. సెకండ్ హాఫ్ కొంత నయం. పాటలు అస్సలు బాలేవు, ఇళయరాజా గురించి ఈ లైన్ రాయాల్సొస్తుందని కలలో కూడా అనుకోలేదు.. చిన్న పాత్రలైనా రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ, ఆదర్శ్ బాగా చేసారు.
పాత్రల పార్ధివ దేహాలు, ఇంద్రథనుస్సుకు మరో రెండు రంగులద్ది నవరసాలు చేసి… లాంటి ఎన్నో సంభాషణలు బాగున్నాయి. అదే టు బి నాట్ టు బి సంధిగ్ధతతోనే ప్రివ్యూయర్స్ కూడా కన్నీళ్లు కార్చినట్టు నటించి ఉంటే మాత్రం వాళ్లనే నేను క్షమించేస్తా. ఒకటి మాత్రం తీవ్ర అభ్యంతరకరం. మిత్రుడు ఎంత భరించలేని వేదన అనుభవిస్తున్నా, ముక్తి ప్రసాదించమని అతడే వేడుకున్నా అతడ్ని గుప్పెడు నిద్ర మాత్రలతో చంపేయడం మాత్రం పోయటిక్ జస్టిస్ కాదు. మెర్సీ కిల్లింగ్ మెలో డ్రామా కూడా కాదు…
Share this Article