రాహల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలుశిక్షకు చాలా ప్రాధాన్యం ఉంది… క్షుద్రమైన రాజకీయ విమర్శలైనా సరే విచక్షణ విడిచి, సంయమనం కోల్పోయి, విజ్ఞతకు నీళ్లొదిలితే ఇలాంటి పరిణామాలు తప్పవు అనేది ఓ ముఖ్యమైన పాఠం… ఇంకా చాలా గుణపాఠాలున్నాయి… ముందుగా ఆ కేసు, పూర్వాపరాలు గట్రా ఓసారి చూద్దాం…
2019 ఏప్రిల్… కర్ణాటకలోని కోలార్ పట్టణంలో నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ‘మోడీ ‘ అనే ఇంటి పేరు వున్న వాళ్ళు అందరూ ఒకే రకంగా ఉంటారు అని విమర్శించాడు రాహుల్ గాంధీ… విదేశాలకి పారిపోయిన ‘నీరవ్ మోడీ’, ’లలిత్ మోడీ‘ల పేర్లని గుర్తుచేస్తూ… మోడీ అనే ఇంటి పేరు గల వాళ్ళు అందరూ దొంగలు అన్నాడు… అది మోడీని ఉద్దేశించిన విమర్శే అయినా ఒక ఇంటిపేరు మొత్తాన్ని కించపరిచాడు…
గుజరాత్ మాజీ మంత్రి, బిజేపి ఎంఎల్ఏ పూర్ణేష్ మోడీ సూరత్ పట్టణంలో IPC సెక్షన్లు 499 (Defamation) మరియు సెక్షన్ 500 [punishment for defamastion ] కింద ఫిర్యాదు చేశాడు… రాహుల్ తన వ్యాఖ్యల్లో మోడీ అనే ఇంటిపేరున్న వాళ్ళందరూ దొంగలుగా పేర్కొన్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు ! ఎన్నికల ప్రచారాన్ని వీడియో తీస్తారు కాబట్టి సాక్ష్యం గట్టిగానే ఉంది ! గుజరాత్ హైకోర్టుకు వెళ్లిన రాహుల్ తన కేసు మీద సూరత్‌లో విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్నాడు…
Ads
2023 ఫిబ్రవరి నెలలో గుజరాత్ హైకోర్ట్ రాహుల్ కేసు మీదస్టే వేకెట్ చేసింది… దాంతో సూరత్ జిల్లా కోర్టు విచారణ ప్రారంభించింది ! రాహుల్ తరుపు న్యాయవాది తన క్లయింట్ కి దుర్మార్గపు ఉద్దేశ్యం [malafied intension ] ఏమీ లేదన్నాడు… కానీ వీడియో సాక్ష్యాలు పక్కాగా ఉండడంతో సూరత్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది… ఇక విషయంలోకి వద్దాం…
1) గతంలో పరువు నష్టం కేసులు ఉత్త సివిల్ నేచర్… కానీ ఇప్పుడు క్రిమినల్ పరువు నష్టం కేసులు కూడా వేసేలా చట్టసవరణ ఆల్‌రెడీ జరిగిపోయింది… సో, గతంలోలా ఎలాపడితే అలా విమర్శలు చేస్తే అడ్డగోలుగా బుక్ కావల్సి ఉంటుంది… రాజకీయ నాయకుల నోళ్లకు ఇది తాళం వేస్తుంది… ఇది ఒక పాఠం…
2) ఏమవుతుందిలే… జిల్లా కోర్టు తీర్పు మీద హైకోర్టుకు, ఆ కోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చులే అనే ధీమా ఉంటుంది రాజకీయ నాయకులకు… కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు… హైకోర్టే పాత స్టే తొలగించింది కాబట్టి తీర్పు అమలు మీద హైకోర్టు స్పందించకపోవచ్చు… సుప్రీం కోర్టుకు వెళ్లాలిక… అదీ పెద్దగా రియాక్ట్ కాకపోతే… ఈలోపు ఎన్నికల సంఘం సత్వరం స్పందిస్తే రాహుల్ ఎంపీ సీటుకు ఎసరొచ్చే ప్రమాదం ఉంది… (Section 8(3) of the Representation of the People Act, 1951)…
3) రెండేళ్లు, ఆపై శిక్ష పడితే ఏ ప్రజాప్రతినిధి అయినా తన హోదా కోల్పోతాడు… సో, రాహుల్ సేఫ్ సీటు అని ఎన్నుకున్న వాయనాడు లోకసభ స్థానం ఖాళీ అవుతుంది… నిజానికి ఇవన్నీ ఎలా ఉన్నా… రాహుల్ గాంధీని కాంగ్రెస్ లీగల్ టీం ఎలా గట్టెక్కించినా సరే… రాబోయే కాలంలో విచక్షణరహితంగా విమర్శించే అలవాటున్న నేతలు జాగ్రత్తగా ఉండటం మంచిది… (ఇంగ్లిష్ మెయిన్ స్ట్రీమ్ కథనాల ఆధారంగా…)
Share this Article