నగరానికి ఊళ్లో పండుగ!
అప్పుడే దొంగలకు నగరంలో పండుగ!!
————————
హైదరాబాద్ విశ్వనగర పోలీస్ కమీషనర్ బాధ్యతాయుతంగా ఒక జాగ్రత్త చెప్పారు. పండగలకు పొలోమని ఊరెళ్లేవారు- ఈగ ఇల్లలుకుతూ ఇంటిపేరు మరచిపోయినట్లు ఇళ్లను మరచి ఊళ్లకు పోవద్దన్నది ఆయన చెప్పిన జాగ్రత్త సారాంశం. లేకపోతే పండగకు నగరం వదిలి వెళ్లిన ఇళ్లల్లో దొంగలు పండగ చేసుకుంటారన్నది ఆయన హెచ్చరిక.
హైదరాబాద్ జనాభా కోటి. ఈ కోటిలో అరవై లక్షల మంది ఇతర ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడ్డవారే అయి ఉంటారు. సంఖ్య కాస్త అటు ఇటుగా ఉండవచ్చు. ఢిల్లీ, కలకత్తా, బాంబే, మద్రాస్ మహా నగరాలయినా ఇంతే. దసరా, సంక్రాంతి పెద్ద పండుగలు లేదా వారం, పది రోజులు సెలవులు రాగానే నగరం సగం ఖాళీ అవుతుంది. ఇళ్లు దోచుకోవడానికి ఇదే అదను అవుతుంది.
Ads
కొన్ని వృత్తులకు కొన్ని రుతువులు, కాలాలు అనుకూలం. కొన్ని వస్తువులకు కొన్ని కాలాలు అనుకూలం. వేసవిలో ఏ సీ లు అమ్మాలి. శీతాకాలంలో హీటర్లు అమ్మాలి. తొలకరిలో దుక్కి దున్నాలి. మొలకలు రాగానే ఎరువులు వేయాలి. కాయలు కాయగానే కాపుకాయాలి.
అలాగే దొంగలకు కూడా కొన్ని మేలిమి దొంగసమయాలు ఉంటాయి. ఇవి కవిసమయాల కంటే గొప్పవి. అమావాస్య చీకటి. అర్ధరాత్రి. నక్కలు చుక్కలు చూసే వేళ. దయ్యాలు నిద్రలేచి ఉన్మత్త నాట్యం చేసే వేళలు సహజంగా దొంగలకు వారి వృత్తిపరంగా మంచి ముహుర్తాలు. ఇవి కాక వృద్ధ దంపతులు మాత్రమే ఉండే ఇళ్లు. ఒంటరి మనిషి మాత్రమే ఉండే ఇళ్లు. ఊరికి దూరంగా విసిరేసినట్లు ఉండే ఇళ్లు దొంగలకు అనుకూలం.
వీటన్నిటికంటే పగలు-రాత్రి కాక, అపార్ట్ మెంట్- విల్లా కాక… హిరణ్యకశిపుడు వరమడిగినట్లు అన్నివేళలా అత్యంత చోరానుకూల సమయం- పండగలకు నగరాలు పల్లెలకు వెళ్లినప్పుడు!
ఈ టైమ్ లో దొంగలకు హాయి. పగలంతా నిద్రపోయి రాత్రి మేల్కొని దోచుకోవడానికి వెళ్లాల్సిన రిస్క్ తగ్గుతుంది. హాయిగా అందరిలా పొద్దున్నే లేచి; స్నానం చేసి; భక్తి ఉన్నవారు పూజ చేసి; బ్రేక్ ఫాస్ట్ చేసి; ఉద్యోగాలకు వెళ్లినట్లు ఉదయం పది గంటలకు టక్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని; లంచ్ బాక్స్ తీసుకుని; మారు తాళాలు తీసుకుని; సుత్తి, కటింగ్ ప్లేయర్, ఆటోమేటిక్ ఆక్సా బ్లేడ్, బ్యాటరీ ఆపరేటెడ్ రంపం సర్దుకుని పూర్తి ప్రొఫెషనల్ గా వృత్తి విద్యా ప్రదర్శనకు వెళ్లవచ్చు. పని ముగించుకుని అందరిలా సాయంత్రం ఇంటికొచ్చి పిల్లలతో బయటికెళ్లి లుంబినీ పార్క్ గేట్లో పానీ పూరీ తినవచ్చు. రాత్రి ఇంటికెళుతూ బావర్చి నుండి ఫ్యామిలీ ప్యాక్ చికెన్ బిర్యానీ తీసుకెళ్లి కడుపారా తిని, ఆఫ్ బాటిల్ ద్రవం నోరారా గొంతులో పోసుకుని అందరిలా ఆదమరచి నిద్రపోవచ్చు.
ఎటొచ్చి- సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చినట్లు- పండగలకు నగరం ఊళ్లకెళితే పోలీసులకు నరకం కనిపిస్తుంది. జనం లేని ఇళ్లను కాపాడలేక పోలీసుల తల ప్రాణం తోకకు వస్తుంది. అందుకే హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ఎన్నెన్నో జాగ్రత్తలు చెబుతున్నారు. అందులో ముఖ్యమయినది- సోషల్ మీడియాలో మన సెలవుల ప్రయాణాల పోస్టింగ్స్.
నిజమే-
నేను ఫలానా జనవరి పదకొండో తేదీన ప్యాసెంజర్ రైలెక్కి పలాస పోతున్నాను. జనవరి పంతొమ్మిదో తేదీ వరకు రానుగాక రాను. నాతో పాటు మా ఫ్యామిలీ అంతా పలాసలోనే పచ్చిపులుసు వండుకుంటూ ఉంటాం. ఇదే హైదరాబాద్ లో లాక్ చేసి ఉన్న మా ఇంటి మెయిన్ డోర్ ఫోటో. తాళం చెవి ఆ గుమ్మం పక్కన గూట్లోనే పెడతాం- అని ఫేస్ బుక్కులో పోస్టింగ్ పెడితే- ఏ దొంగకయినా టెంప్టింగ్ గా ఉండదా? ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు ఉండదా? అసలే ఈ మధ్య దొంగలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అడ్రెస్, జి పి ఎస్, షెల్ఫ్ లో దాచుకున్న కష్టార్జితం వివరాలకన్నా దొంగలు పండుగ చేసుకోవడానికి ఇంకేమి కావాలి?
“ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే?
చాల్లే! ఇది చాల్లే!
మీకై మీరే తాళాలిచ్చారే!
ఇకపై తిరునాళ్లే !
దోపిడిలోన వేగం పెంచామే!
మా దొంగల్లోన హోళీ వచ్చిందే!
ఒక్కో ఇల్లు ఒక్కో బ్యాంకై చస్తున్నామే!
తలవని తలపుగ
తెరిచిన తలుపులు దొరకగ…
మొదలిక మొదలిక చోరప్రావీణ్యం!”………. By………. పమిడికాల్వ మధుసూదన్
Share this Article