రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడంలో మోడీ రాజకీయ హుందాతనాన్ని ప్రదర్శించలేకపోయాడనీ, రాజకీయ పరిణతి లేకుండా పోయిందనీ, రాహుల్ గాంధీని చూసి భయపడుతున్నాడనీ రకరకాల విమర్శలు వస్తున్నాయి… దొరికింది కదా చాన్స్ అనుకుని మోడీని తిట్టడానికి దీన్ని వాడుకుంటున్నారు యాంటీ-బీజేపీ పార్టీల నాయకులు… కేసీయార్ అయితే ప్రజాస్వామ్యానికి దుర్దినం అంటున్నాడు… కేసీయార్ కూడా ప్రజాస్వామ్య విలువలు, ప్రమాణాల గురించి మాట్లాడుతున్నాడూ అంటే రాహుల్ గాంధీ అనర్హత అంశానికి తప్పకుండా చాలా ప్రాధాన్యమే ఉందన్నమాట…
ఈ పరిణామంపై ఖచ్చితంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తాయి కదా, చేస్తున్నాయి… యాంటీ-బీజేపీ దిశలో ఓ అవకాశం కాబట్టి మోడీ వ్యతిరేక నాయకులంతా కొన్నిరోజులు దీన్ని గాయిగత్తర చేయడానికి ప్రయత్నిస్తారు… అక్కడివరకే… వీళ్లంతా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి మద్దతుదారులేమీ కాదు… ఇది రాహుల్ గాంధీ ఆదరణ పెరగడానికి ఉపయోగపడుతుందనే భావనకూ పెద్ద బలం లేదు… నిజానికి రాహుల్ పార్లమెంటులో ఉంటే బీజేపీకి వచ్చిన నష్టమేమీ లేదు… కాకపోతే మోడీ ఇంత వేగంగా స్పందించి, స్పీకర్ కార్యాలయం ద్వారా రాహుల్‌పై వేటు వేయించడానికి కారణాలున్నయ్…
Ads
- మోడీ ఆశిస్తున్న తక్షణ ప్రయోజనం… ఆదానీ ఇష్యూ అర్జెంటుగా పక్కకు పోవాలి… ఎందుకంటే, తనకూ ఆదానీకి నడుమ ఉన్న సాన్నిహిత్యం, ఆదానీని తాను వెనకేసుకొస్తున్న వైనం ప్రజల్లో చర్చకు దారితీస్తోంది కాబట్టి తక్షణం ప్రజల దృష్టిని మళ్లించాలి… తను అనుకున్నట్టే ఆదానీ ఇష్యూ పక్కకు వెళ్లిపోయింది… మోడీ కూడా రాజకీయ నాయకుడే కదా… బీజేపీ కూడా రాజకీయ పార్టీయే కదా… కేసీయార్ అప్పుడప్పుడూ చెప్పే అహోబిలం మఠం కాదు కదా…
- రేప్పొద్దున యూపీయే కూటమి మంచి స్థానాలు సంపాదిస్తే… ఖచ్చితంగా రాహుల్ గాంధీయే ప్రధాని… మమత, అఖిలేష్, కేసీయార్ తదితరులు కాంగ్రెసేతర, బీజేయేతర కూటమి కడతామని ఉరుకుతున్నారు గానీ… ఊదు కాలేది లేదు, పీరు లేచేది లేదు… ఎవరి రాష్ట్రాల్లో వాళ్లకు సమస్యలున్నయ్… వాటితోనే సరిపోతుంది… ఒకవేళ యూపీయేకు మంచి సంఖ్యలో సీట్లు వస్తే… ఈ సోకాల్డ్ థర్డ్ ఫ్రంట్ నుంచి మద్దతు తీసుకోవడమో, ఆ పార్టీలను ఆ కూటమి నుంచి విడదీయడమో లేదా పలుపార్టీలే కూటమి నుంచి బయటపడటమో తప్పనిసరి… సో, అసలు రాహుల్‌ను ఎంపీ సీటుకే అనర్హుడిని చేస్తే సరి… అదే జరిగింది…
- మోడీ తొందరపాటులోనూ ఓ రీజన్ ఉంది… స్పీకర్ కార్యాలయం వెంటనే స్పందించకపోతే, కాంగ్రెస్ లీగల్ టీం హైకోర్టును ఆశ్రయించి సూరత్ కోర్టు తీర్పు అమలు మీద స్టే తీసుకొస్తే… స్పీకర్ కార్యాలయం చేతులు కట్టేసినట్టవుతుంది… అందుకని వెంటనే స్పీకర్ ఆఫీసు స్పందించింది… రాహుల్‌ను చూసి మోడీ భయపడ్డాడు అనే విమర్శ హాస్యాస్పదం… నిజానికి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ నేతృత్వమే బీజేపీకి శ్రీరామరక్ష…
మరిప్పుడేమిటి మార్గం..? ఈ ప్రశ్నకు జవాబు కష్టం… ఎందుకంటే..? ఒకవేళ హైకోర్టు గనుక సూరత్ కోర్టు తీర్పును రద్దు చేస్తే లేదా సుప్రీంకోర్టు గనుక ఆ తీర్పును కొట్టిపారేస్తే… ఈ అనర్హత వేటు అప్రజాస్వామికం అని పేర్కొంటే… మోడీ మళ్లీ దాన్ని కూడా ఓ చాన్స్‌గా తీసుకునే అవకాశం ఉంది… ఎలాగంటే…
ప్రస్తుతం సుప్రీం కొలీజియం సిస్టమ్‌ను మోడీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది… జడ్జిల నియామకంపై నేషనల్ జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చట్టాన్ని కూడా సుప్రీం పక్కకు పెట్టింది… ఒక పార్లమెంటు చేసిన చట్టాన్ని మీరెలా పక్కనపెడతారు అనే వ్యాజ్యం వైపు మోడీ ప్రభుత్వం వెళ్లడం లేదు, వెళ్లినా లాభం లేదని తెలుసు… ఉపరాష్ట్రపతి, న్యాయమంత్రి తరచూ సుప్రీం వైఖరిపై విసుర్లకు దిగుతున్నారు కూడా… ఈ స్థితిలో ఒకవేళ రాహుల్‌పై అనర్హత వేటును గనుక సుప్రీం లేదా హైకోర్టు తప్పుపడితే… లోకసభ మరింత గట్టిగా నిలబడే సూచనలున్నయ్… నిజానికి తీర్పు రాగానే వేటు పడాలని చెప్పింది సుప్రీమే ఏదో పాత కేసులో…
ఎన్ని వ్యాజ్యాలు నడిచినా, కోర్టుల్లో లక్షద్వీప్ మాజీ ఎంపీకి మద్దతు లభించినా… ఒకసారి అనర్హత వేటు వేసిన లోకసభ స్పీకరాఫీసు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు… తన విచక్షణ పరిధిలోకి న్యాయవ్యవస్థను జొరపడనివ్వలేదు… అసలే సుప్రీం వైఖరులపై కినుకగా ఉన్న మోడీ ప్రభుత్వం న్యాయవ్యవస్థ పరిధులను గుర్తుచేయడానికి ఈ కేసును వినియోగించుకునే అవకాశముంది… ఇప్పటికే ఎన్నికల సంఘం విషయంలో సుప్రీం ‘ఎక్కువ జోక్యం’ చేసుకుందనేది మోడీ సర్కారు ఆగ్రహ కారణం…
కోర్టులు చెబితే స్పీకరాఫీసు వింటుందా, మా విచక్షణపరిధిలోకి రావద్దు అని మొండిగా వ్యవహరిస్తుందా అనేది వేరే చర్చ… ప్రస్తుతం 3 లోకసభ సీట్లు ఖాళీ ఉన్నాయి… ఎన్నికల సంఘం కూడా స్పీకరాఫీసు స్పందించినంత వేగంగా వెంటనే వాయనాడు సీటును కూడా ఖాళీగా ప్రకటించి, ఆ 3 సీట్లకూ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే… కథ రసకందాయంలో పడుతుంది… దాన్ని కూడా సుప్రీం వ్యతిరేకిస్తే, ఇక ఎన్నికల సంఘం వర్సెస్ సుప్రీం, లోకసభ స్పీకరాఫీసు వర్సెసు సుప్రీం అన్నట్టుగా మారుతుంది… కథ అలా కొనసాగుతూ ఉంటుంది… లక్షద్వీప్ ఎంపీ కేసులో జరిగిందీ ఇదేగా… ఐనా మోడీని తిట్టబోయి మొత్తం ఆ ఇంటిపేరున్న అందరినీ దొంగలు అని వ్యాఖ్యానించిన రాహుల్ చేసింది తప్పే… రాజకీయ విమర్శలకైనా ఓ హద్దూ అదుపూ లేకపోతే ఎలా..? సో, గుజరాత్ హైకోర్టు ఏమంటుందో చూద్దాం…! రాహుల్ తప్పుచేయలేదు అంటుందా..?
ఒకవేళ అప్పీల్‌కు గడువు ఉంది కాబట్టి ఇప్పుడు అనర్హత వేటు వేయడం తప్పు అంటుందా..? అలాగైతే నేను చట్టాన్నే అమలు చేశాను కదా అంటుంది స్పీకరాఫీసు… గతంలో ఇదే రాహుల్ గాంధీ చింపేసిన ఆర్డినెన్స్ చట్టంగా మారి ఉంటే ఇప్పుడు రాహుల్‌కు ఈ భంగపాటు వచ్చేది కాదు… ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చండి అని హైకోర్టో, సుప్రీమో చెబుతాయా..? చెప్పినా దాన్ని మోడీ సర్కారు పాటించాలని ఏముంది..?
పార్లమెంట్ చేసే చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే సుప్రీం వ్యతిరేకిస్తే తప్పు లేదు… కానీ ఫలానా చట్టం చేయండి అని నిర్దేశించే స్థితి రావొద్దు… CEC విషయంలో జరుగుతున్నది అదే… అందుకే వ్యవస్థల అధికార పరిధుల చర్చ వస్తే మంచిదే…
సో, ఇన్నిరకాల సంక్లిష్టతలు మన ఎదుటకు రాబోతున్నాయి…!! ష్… గుర్తుంచుకొండి, రాహుల్‌పై, సోనియాపై, కాంగ్రెస్ ముఖ్యులపై ఆల్‌రెడీ నేషనల్ హెరాల్డ్ కేసు వేలాడుతోంది… అంతెందుకు రాబర్ట్ వాద్రా మీద కేసులూ పెండింగులో ఉన్నాయి..!!
Share this Article