అప్పుడెప్పుడో పుష్కరం క్రితం తెలుగులో నువ్విలా సినిమా చేసింది… తరువాత గౌరవం, కొరియర్ బాయ్ కల్యాణ్… అంతే… అసలు 13 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటే మొత్తం తను చేసిన సినిమాల సంఖ్యే 11 దాటలేదు… బాలీవుడ్‌లో తన్లాడుతోంది ఈ ఫెయిర్ అండ్ లవ్‌లీ ముద్దబంతి అవకాశాల కోసం… అప్పుడెప్పుడో చేసిన విక్కీ డోనర్ తప్ప వేరే సినిమాలేవీ యామి గౌతమ్ కెరీర్‌కు ప్లస్ అయినవి ఏమీ లేవు…
ఇప్పుడు ఆమె కాస్త తలెత్తుకుని చెప్పగలిగే సినిమా… దాని పేరు చోర్ నికల్ కే భాగా… ఓటీటీ సినిమా… నిజానికి థియేటర్‌లో రిలీజ్ చేసినా సరే సినిమా నడిచేదేమో… దర్శకుడు అజయ్ సింగ్ ఈ హైజాక్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను భలే తీశాడు… సినిమాలో ప్రధానంగా ఎవరెవరో నటీనటులు ఉన్నా సరే ఈ యామి గౌతమ్‌కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కింది… పాత్ర బాగుంది… ఆమె కూడా బాగా నటించింది… 13 ఏళ్ల తరువాత కాస్త చెప్పుకోదగిన పాత్ర…
Ads
అంటే అదీ పెద్ద గొప్ప పాత్రేమీ కాదు… కాకపోతే సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడి దృష్టిని బలంగా ఆకర్షించేది ఆమే… సినిమా కూడా బిగి సడలకుండా నడిపించాడు దర్శకుడు… నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతోంది ఈ సినిమా… ఓ లుక్కేయవచ్చు… ఈమె పాత్ర ఓ ఎయిర్ హోస్టెస్… ఆమెకు వజ్రాల ఇన్స్యూరెన్స్ వృత్తిలో ఉన్న అంకిత్ పరిచయం అవుతాడు… లవ్వు… డేటింగు… గర్భం కూడా… పెళ్లిచేసుకుందాం అనుకునేవేళ అంకిత్‌ను ఒకరు విమానంలో వస్తున్న వంద కోట్ల వజ్రాలను చోరీ చేయాలని బెదిరిస్తుంటారు…
ఈ జంట మొత్తానికి ఆ వజ్రాలను కొట్టేయాలని ప్లాన్ చేస్తారు… ఇక ఆచరణలోకి దిగే టైమ్‌కు ఎవరో విమానాన్ని హైజాక్ చేస్తారు… సరే, ఉగ్రవాదులు ప్రభుత్వానికి ఏవో డిమాండ్లు పెడతారు… కమెండోలు వారిని ఎలాగోలా చంపేసి ప్రయాణికులను కాపాడతారు… ఇందులో పెద్ద కథేముందీ అని అప్పుడే పెదవి విరవకండి… గాయాలపాలైన హీరో ఈ అంకిత్‌ను ‘రా’ అధికారులు ప్రశ్నించడం మొదలుపెడతారు… ఇక కథలో ట్విస్టులు స్టార్ట్…
మామూలుగా ఓటీటీ సినిమాయే కదా అనుకున్న మరీ రానానాయుడు టైపులో బూతులు, వల్గారిటీని ఆశ్రయించలేదు దర్శకుడు… ప్లెయిన్, స్ట్రెయిట్… మొదట మామూలుగా ఏవో లవ్వాయణంతో స్టార్ట్ చేసి, తరువాత హైజాక్‌తో కథ వేగం అందుకుని, సెకండాఫ్‌లో ఒక్కో సస్పెన్స్ పాయింటునూ విడదీస్తూ వెళ్తాడు దర్శకుడు… దీంతో ప్రేక్షకుడు పూర్తిగా కథలో లీనమవుతాడు… అంతేతప్ప చెత్తా కమర్షియల్ వాల్యూస్ పేరిట అడ్డమైన మసాలా జోలికి పోలేదు… ఇది ఓటీటీ సినిమా కాబట్టి వసూళ్ల లెక్కలు, హిట్టా ఫ్లాపా అనే చర్చలూ లేవు… సెంటర్ ఆఫ్ అట్రాక్షన‌్‌గా కనిపించిన యామి తనకు దక్కిన ఈ డిఫెరెంట్ షేడ్స్ పాత్రను పూర్తిగా సద్వినియోగం చేసుకుంది…
Share this Article