పిట్టముట్టుడు… బలగం సినిమాలో ఇదే కీలకం… దీనిపైనే తెలుగు సోషల్ మీడియా అంగీలు చింపుకుంటోంది… మన సమాజంలోని ఒక సెక్షన్ దీన్ని మూఢనమ్మకాన్ని ఎంకరేజ్ చేసే తిరోగమనవాదంగా చిత్రీకరించడానికి నానాపాట్లు పడుతోంది… ఆ సెక్షన్ పెద్ద పెద్ద హీరోల చెత్తా అవలక్షణాలపై మాత్రం కిమ్మనదు… అదే పెద్ద తిరోెగమనం… ఆ చర్చ పక్కనపెడితే… అది ఒక కథ… తన కుటుంబంలో ఓ కర్మకాండ స్వయంగా గమనించిన దర్శకుడు వేణు ఆ అంశం చుట్టూ ఓ కథ రాసుకున్నాడు…
జస్ట్, ఒక కథ… అన్ని ప్రాంతాల్లోనూ ఉన్న నమ్మకమే ఇది… తెలంగాణ ప్రాంతంలోనే కాదు… ఇతర భాషల్లో ఇలాగే సినిమాలు వచ్చాయి… బలగం కథలోనూ కీలకం ఆ పాయింటే అయినా, దాని చుట్టూ కుటుంబబంధాలు, భావోద్వేగాలు అనే ఓ సున్నితమైన సమస్యను తిప్పాడు వేణు… అది బలంగా కనెక్టయింది ప్రేక్షకులకు… హార్డ్ కోర్ నాస్తికురాలు ఒకామె బలగం సినిమా చూసి, ఫేస్‌బుక్‌లో తన ఫీలింగును పోస్ట్ చేసుకుంది, సినిమా చూసి అందరమూ ఏడ్చేశామని రాసుకుంది… అంటే ఇక్కడ వేణు చూపించిన బంధాల అంశమే కనెక్టవుతోంది తప్ప, ఆ పిట్టముట్టుడు అంశం కాదు…
అసలు పిట్టముట్టుడు కథకొద్దాం… మరణించిన వ్యక్తికి ఇష్టమైన తిండి పెడితే, ఆ ఆత్మ తృప్తిగా పరలోకాలకు వెళ్లిపోతుందనేది ఈ నమ్మకం… రాత్రికిరాత్రి అబ్రకదబ్ర అనగానే ఇలాంటి నమ్మకాలు పోవు… జనంలో శాస్త్రీయ చైతన్యం, స్పృహ పెరిగేకొద్దీ ఇలాంటి నమ్మకాలు వాటంతటవే మన అలవాట్లు, ఆచారాల నుంచి వెళ్లిపోతాయి… కాలమే దాన్ని దూరం చేయగలిగేది… ఏదో సినిమాల్లో, సాహిత్యంలో ఆ నమ్మకాల గురించి రాసినంత మాత్రాన అదేమీ ప్రోత్సహించినట్టు కాదు… అలా భావించేవాళ్లనూ కాలానికి వదిలేయడమే…
Ads
కాలంతోపాటు ఆచారాలూ మారతాయి… ఉదాహరణకు ఈ పిట్టముట్టుడు అంశాన్నే తీసుకుందాం… చాలా చోట్ల అసలు కాకులు పిండాల్ని తినడానికి రావట్లేదు… అసలు కాకుల సంఖ్యే గణనీయంగా పడిపోతోంది… దానికీ కారణాలు బోలెడు… గంటల తరబడీ ఎదురుచూసినా సరే ఒక్క కాకీ రాకపోతే ఏం చేయాలి..? మరీ బలగం సినిమాలో చూపించినట్టు, కుటుంబాన్ని వెలివేయడం కాదు పరిష్కారం… చాలాచోట్ల ఇప్పటికే ఓ ప్రత్యామ్నాయం ఆచరణలోకి వచ్చేసింది కూడా…
అదేమిటీ అంటే… విస్తరి నిండా పలు వంటకాలు పెట్టి, కాసేపు చూసినా సరే కాకి గనుక రాకపోతే, వచ్చినా ముట్టకపోతే, అంటే తినకపోతే… దాన్ని యథాతథంగా తీసుకెళ్లి ఆవుకు తినిపిస్తున్నారు… చాలాచోట్ల కర్మకాండ చేయించే పంతుళ్లు ‘గోవుకు తినిపించడం మరింత పుణ్యం’ అంటూ విజయవంతంగా ఈ పిట్టముట్టకపోవడం అనే సమస్యను బయటపడేస్తున్నారు… అదే సరైన రెమెడీ… నిజంగానే కాకుల్లోకి ఆత్మ దూరి, ఆ పిండాలు తింటాయా అనే ప్రశ్న ఇక్కడ వేస్ట్… అదొక నమ్మకం… అలాంటి చాలా నమ్మకాల్లోనే మనం బతుకుతున్నాం…
తిండితోపాటు కాసింత మందు, కల్లు గ్లాసుల్లో పోసి అక్కడ పెడతారు… కాకులు వచ్చి వాటిని తాగవు కదా… కాకపోతే మరణించిన వ్యక్తిని ఉద్దేశించి… ‘‘ఇదుగో నీ ఇష్టాన్ని మేం గుర్తించాం, తృప్తిగా ఇక పైలోకాలకు వెళ్లిపో’’ అని చెప్పడం..! కొందరు ఆ విస్తట్లోనే సిగరెట్లు పెడతారు, గుట్కా పాకెట్ విప్పి పోస్తారు… కానీ ఏమాటకామాట బలగం సినిమా కథలోని ఇలాంటి కొన్ని అంశాలతో దర్శకుడు వేణు ఓ బలమైన, విస్తృతమైన సోషల్ చర్చకు తెరలేపాడు…!! ప్రపంచంలోని ఏ అంశంపైనైనా సరే డిబేట్లు పెట్టి మరింత కంపు చేయగల మన టీవీ చానెళ్లు మాత్రం ఎందుకో సంయమనాన్ని, నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి…!!
Share this Article