మన మహేశ్ బాబు వినడు… మనుషుల ఆరోగ్యాన్ని పాడుచేసే గుట్కా బ్రాండ్ల సరోగేట్ యాడ్స్ నిక్షేపంగా చేస్తుంటాడు… తాజాగా దేవరకొండ విజయ్ కూడా థమ్సప్ యాడ్స్ స్టార్ట్ చేశాడు… గుట్కా బ్రాండ్ల సరోగేట్ యాడ్స్ చేసి, తప్పు తెలుసుకుని, లెంపలేసుకుని అమితాబ్ తాను అడ్వాన్సుగా తీసుకున్న డబ్బుల్ని కూడా వాపస్ చేశాడు… ఆహా, మన హీరోలకు సామాజిక బాధ్యత లేకపోయినా సరే, అంతటి అమితాబ్ ఆదర్శంగా నిలిచాడు అనుకున్నాం కదా…
కేంద్రం కూడా ఈమధ్య వాణిజ్య ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలను కూడా జవాబుదారీలుగా చేస్తూ కొత్త మార్గదర్శకాల్ని, ఆంక్షల్ని, కట్టుబాట్లను రూపొందించింది… కానీ ఆచరణలో అవేమీ సెలబ్రిటీలకు భయాన్ని, బాధ్యతను నేర్పినట్టు లేదు… ఎవరో ఎందుకు ఆ ఆదర్శ అమితాబే ఆమ్వే విషయంలో తప్పుటడుగు వేశాడు… తనకు వినిపించిన సలహాలను, సూచనలను కూడా పెడచెవిన పెట్టాడు… బొచ్చెడు సినిమా వార్తలతో మనం సెలబ్రిటీలను పెంచుతుంటాం, వ్యక్తిపూజకూ కారణమవుతుంటాం… కానీ వాళ్ల అవలక్షణాల్ని, సామాజిక బాధ్యతారాహిత్యాన్ని మాత్రం ఎక్స్‌పోజ్ చేయడం లేదు పెద్దగా… సో, మనమూ ఈ నష్టాలకు పరోక్ష కారకులమే…
విషయం ఏమిటంటే… తెలంగాణ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ మొన్నామధ్య అమితాబ్‌కు ఓ సూచన చేశాడు… ఆయనే కాదు, అమితాబ్‌లాగే తప్పుడు ప్రకటనల్లో నటిస్తున్న సెలబ్రిటీలందరికీ అది వర్తిస్తుంది… మోసపూరిత సంస్థలకు, మోసగాళ్లకు వత్తాసు పలకకండీ అనేది ఆ సూచన… ఎందుకంటే..? ఆమ్వేకు అమితాబ్ వాణిజ్య ప్రకటనలు చేస్తున్నాడు… అయితే, అలాంటి మోసపూరిత కంపెనీలకు ప్రచారం చేయవద్దు అనేది సజ్జనార్ సలహా సారాంశం… ట్వీట్ ద్వారా ఆ విజ్ఞప్తి చేశాడు… ఇలాంటి కంపెనీలు ఆర్థిక వ్యవస్థల్ని, కుటుంబాలను ధ్వంసం చేస్తున్నాయి కాబట్టి సెలబ్రిటీలు సామాజిక బాధ్యతగా అలాంటి ప్రకటనల్లో నటించవద్దనీ, మద్దతుగా నిల్వవద్దనీ కోరాడు…
Ads
గుడ్, మంచి సూచన… మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలు అమాయకులకు వల వేస్తాయి… ఉచిత భోజన సమావేశాలు పెట్టి, ఏదో విధంగా మోటివేట్ చేసి, అబద్ధాలు చెబుతాయి… జీతం సరిపోక, అదనపు ఆదాయం కోసం దారులు వెతుక్కుంటున్నవారిని ఏజెంట్లుగా చేర్చుకుంటున్నాయి… కొంత అమౌంట్ డిపాజిట్ చేసి, దానికి సమాన విలువైన వస్తువులు తీసుకొని మీరు మా సంస్థలో చేరండి,.. మీతోపాటు మరో ముగ్గురిని చేర్పించండి… తద్వారా మీకు కమిషన్ వస్తుందని చెబుతాయి…
ఆ ముగ్గురు తలా ముగ్గురిని అంటే తొమ్మిది మందిని చేర్పించాలి. తద్వారా మీకు మరికొంత కమిషన్ అంటారు. ఆ తొమ్మిది మంది తలా ముగ్గురిని అంటే ఇరవై ఏడు మందిని చేర్పిస్తారు. తద్వారా మరికొంత కమిషన్ అని వూరిస్తారు. అలా చేరేవాళ్లందరూ డిపాజిట్ చేసే డబ్బులు, తద్వారా వచ్చే కమిషన్లతో ఆదాయమే ఆదాయమంటారు.. ఫలానావాడు సంవత్సరంలోనే కారు కొన్నాడు, ప్లాట్ కొన్నాడు, నెలకు రెండు లక్షల సంపాదన.. ఇలా చెవిలో జోరీగలాగా చెబుతుంటారు. ఇదొక పెద్ద వల. లింకులు తెగితే గొలుసు పనికిరానట్టు ఇందులో కూడా అంతే. ఎవరో తప్ప బాగుపడ్డవాళ్లు లేరు.
మోసపూరిత కంపెనీల్లో చేరి, వాటిలో ఇరుక్కుపోయి నష్టపోయినవాళ్లు ఎంతో మంది… అప్పులు చేసి మరీ ఎంఎల్ఎం (మల్టీ లెవెల్ మార్కెటింగ్) సంస్థల్లో చేరి, ఆ తర్వాత ఆస్తులు అమ్ముకొని రోడ్డుపాలయినవారు ఎంతో మంది… ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా వున్నారు… అలాంటి కంపెనీల్లో ఒకదాని తరఫున ప్రకటనల్లో నటిస్తున్నాడు అమితాబ్ బచ్చన్… నటుడిగా ఇప్పటికీ కోట్లాది రూపాయల సంపాదన స్వంతం… కొడుకు, కోడలు కూడా రెండు చేతులా సంపాదిస్తున్నారు… అయినా సరే పనికిమాలిన కంపెనీలను, ప్రజల ఆరోగ్యాలతో, ఆర్ధిక వ్యవస్థలతో ఆటలాడుకుంటున్న కంపెనీలను ప్రమోట్ చేయడం అబ్సర్డ్…
మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా జరుగుతున్న చెడు అమితాబ్ కు తెలియకుండా వుంటుందా? అయినా అలాంటి మోసపూరిత కంపెనీల తరఫున ప్రచారం చేయడమంటే క్షమించరాని నేరం… అది చూసి… అలాగే చూస్తూ వుండిపోలేక, ఇది నాకు సంబంధించిన వ్యవహారం కాదు కదా… తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నా బస్సులేవో నేను నడుపుకుంటే సరిపోతుంది కదా అని అనుకోకుండా సజ్జనార్ ఆలిండియా పెద్దమనిషి అమితాబ్ కు ట్వీట్ చేశాడు… అమితాబ్ ఆ ట్వీట్ చదివావా..? గుట్కా సరోగేట్ యాడ్స్ డబ్బు వాపస్ చేసిన ఆదర్శం ఆమ్వే ప్రకటనల మీద ఎందుకు లేదు..?!
Share this Article