Bharadwaja Rangavajhala……….. రవి నగాయిచ్…. దర్శకుడి ఊహల్లో పురుడు పోసుకున్న సన్నివేశాలను తెర మీద ప్రభావవంతంగా ఆవిష్కరించడం చాయాగ్రాహకుడి ప్రధాన కార్యక్రమం. ఒక్కోసారి దర్శకుడు చాలా క్లిష్టమైన సన్నివేశాలను ఊహిస్తాడు. ఛాయాగ్రాహకుడు కూడా ఆ స్ధాయిని అందుకుంటే తెర మీద జరిగేవి అద్భుతాలే. తెలుగు తెర మీద అద్భుతాలు చేసిన కెమేరామెన్స్ లో రవి నగాయిచ్ ఒకడు … కెమేరా ఇంద్రజాలికుడు ఆయన.
పాటల్లో కూడా తాంత్రిక చాయాగ్రహణం చేసిన చరిత్ర రవి నగాయిచ్ కు ఉంది. వీరాభిమన్యులో రంభా ఊర్వశి తలతన్నే… పాటను రవి నగాయిచ్ సూపర్ ఇంపోజ్ పద్దతిలో షూట్ చేసి ఆడియన్స్‌ను ఆశ్చర్య చకితులను చేశాడు. రవి నగాయిచ్ ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలకే పనిచేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో జానపద బ్రహ్మ విఠలాచార్య తెరకెక్కించిన సినిమాల్లో రవి చెలరేగిపోయేవాడు. తెలుగు తెర మీద మొదటిసారి మాస్క్ షాట్స్ తీసిన ఘనత కూడా రవిదే.
Ads
అగ్గిపిడుగు సినిమాలో ఇద్దరు రామారావులు తలపడి కత్తి యుద్దం చేసే సీన్ ఒకటి రవి అద్భుతంగా చిత్రీకరించాడు. ఫిల్మ్‌లో సగం మాత్రమే ఎక్స్పోజ్ చేస్తూ తీసిన ఆ ఫైట్‌కు మంచి పేరొచ్చింది. వీరాభిమన్యులో అభిమన్యుడి మరణానికి శ్రీకృష్ణుడే కారణమని అర్జునుడు నిందించే సన్నివేశం ఒకటి ఉంది. అప్పుడు శ్రీ కృష్ణుడు మరోసారి అర్జునునికి తన విశ్వరూపం చూపించి సందేహ నివృత్తి చేస్తాడు.
ఆ సీన్ కలర్లో చిత్రీకరించారు నిర్మాత డూండీ. దాంతో రవి నగాయిచ్కు అవకాశం చిక్కింది. ఈ సన్నివేశ చిత్రీకరణకు ఏకంగా ఒకే ఫిలింను 45 సార్లు ఎక్స్పోజ్ చేసి రికార్టు కొట్టాడు. ఎన్టీఆర్ తర్వాత రవి నగాయిచ్ ను ఎక్కువగా ఆదరించింది నిర్మాత డూండీనే. సుందర్ లాల్ నహతా, డూండీ కలిసి ఉన్న బ్యానర్ రాజ్యలక్ష్మీ పిక్చర్స్‌లో కెమేరా యూనిట్ ప్రారంభించారు. ఆ యూనిట్ కు రవినగాయిచ్ను చీఫ్ గా నియమించారు.
రాజ్యలక్ష్మీ యూనిట్లో రవి దగ్గర పనినేర్చుకున్న వాళ్లలో వి.ఎస్.ఆర్ స్వామి, ఎస్.వెంకటరత్నం ఉన్నారు. నందమూరి బ్రదర్స్ తర్వాత రవికాంత్ నగాయిచ్తో సాన్నిహిత్యం ఉన్నది నిర్మాత డూండీ దర్శకుడు బాపులకే. డూండీ తో బందిపోటు సినిమా నుంచి రవి నగాయిచ్ ప్రయాణం ప్రారంభమైంది. బందిపోటులో మాయలూ మంత్రాలూ గారడీలు లేకపోయినా… కథకు తగ్గ మూడ్ క్రియేట్ చేస్తూ కెమేరా సాగుతుంది.
అలా ట్రిక్ షాట్స్ లేకుండా కథకు తగిన పద్దతిలో కెమెరా దర్శకత్వం వహించడం రవి లాంటి వాళ్లకు కష్టమే. వేరే కెమేరామెన్ పనిచేస్తున్న సినిమాల్లో కూడా ట్రిక్ షాట్స్ వరకు రవి వెళ్లి తీసిన సందర్భాలున్నాయి.
ఆయన పూర్తి గా ఓ సాంఘిక చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం చేయడం అనేది తెలుగుకు సంబంధించినంత వరకు వరకట్నం చిత్రంతోనే ముగిసింది. బాపుకి రవినగాయిచ్తో చాలా అనుబంధం ఉంది. బాపు రమణల సీతాకళ్యాణం సినిమా రవి నగాయిచ్కు అంతర్జాతీయంగా గొప్ప పేరు తెచ్చింది. ముఖ్యంగా గంగావతరణం సన్నివేశాన్ని చాలా గొప్పగా చిత్రీకరించారు రవి నగాయిచ్. బాపు వేసిన బొమ్మల ఆధారంగా సన్నివేశ కల్పన చేసి గొప్ప ఎఫెక్ట్ తీసుకువచ్చారు. చాక్ పీస్ పొడిని వాడి తీసిన గంగావతరణం సీన్ ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.
బాపు దర్శకత్వంలోనే వచ్చిన రాజాధిరాజు సినిమాలో కూడా రవి నగాయిచ్ కెమేరా పనితనం కనిపిస్తుంది. ఆ సినిమా ఆపరేటివ్ కెమేరామెన్ లోక్ సింగ్ రవి దగ్గర ట్రిక్ షాట్స్ తీసే విధానం తెల్సుకోవడం విశేషం. ముఖ్యంగా రాజాధిరాజులో సైతాను పాత్రధారి నూతన్ ప్రసాద్ ఎంట్రన్స్ సన్నివేశాలు… చాలా గొప్పగా చిత్రీకరించారు రవి నగాయిచ్.
రవినగాయిచ్ కూడా కెమేరాతో పాటు మెగాఫోన్ కూడా పట్టుకున్నారు. గూఢచారి 116 సినిమాను డూండీ హిందీలోకి రీమేక్ చేసినప్పుడు దాని దర్శకత్వ బాధ్యతలు రవికే అప్పగించారు. దీంతో పాటు ఒకటి రెండు తెలుగు సినిమాలు మరికొన్ని బాలీవుడ్ మూవీస్ కు ఆయన దర్శకత్వం వహించారు. ప్రతిభకు ఎక్కడైనా గు్ర్తింపు దక్కక తప్పదనేది రవి నిశ్చితాభిప్రాయం.
ది ట్రెయిన్, హిమ్మత్, మోర్చా, సౌగంధీ, గోల్డ్ మెడల్, డ్యూటీ లాంటి సినిమాలు రవి నగాయిచ్ దర్శకత్వంలో దూపుదిద్దుకున్నవే. తెలుగులో కృష్ణ హీరోగా తెరకెక్కిన జానపదం మహాబలుడుకి రవి నగాయిచ్ దర్శకత్వం వహించారు. ఆ మూవీ నిర్మాత డూండీ ప్రేరణతో పి.మల్లికార్జునరావు తీసినదే. కోదండపాణి సంగీతం అందించిన మహాబలుడు మ్యూజికల్ గా కూడా మంచి విజయాన్ని సాధించింది.
సినిమానే ప్రేమించి సినిమానే శ్వాసించిన రవినగాయిచ్ 1991 జనవరి ఆరున చెన్నైలోనే కన్నుమూశారు. తను పుట్టింది పెరిగింది ఉత్తర భారతదేశంలోనే అయినా.. తనను సినిమాటోగ్రాఫర్‌ని చేసిన దక్షిణ భారత సినీ రాజధాని చెన్నైలోనే కన్నుమూశారు. ఆయన లేకపోయినా… ఆయన చేసిన అద్భుతాలు మాత్రం ఇప్పటికీ మనని ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉంటాయి…. (పాత పోస్టే పునఃప్రసారం)
Share this Article