జనం నుంచి పెద్ద ఎత్తున ముక్క చీవాట్లు ఎదురు కావడంతో ఇక దిల్ రాజుకు ఊరూరా ప్రదర్శనలకు వోకే అనక తప్పలేదు… ఏదో పెద్ద శుద్ధపూసలాగా డైలాగులు వల్లిస్తున్నాడు గానీ… దిల్ రాజు పోలీసు రిపోర్టు ఇచ్చినా సరే ఏ ఊళ్లోనూ ఏ ప్రదర్శన కూడా ఆగలేదు, ఆగే సీన్ లేదు… దాంతో పెద్ద త్యాగయ్యలాగా డైలాగులు వదులుతున్నాడు ఇప్పుడు…
అబ్బే, సినిమా ఆపాలని నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అనే ఓ దరిద్రపు డైలాగ్ వదిలాడు… జస్ట్, అమెజాన్ సూచనల మేరకు మా లీగల్ టీం ముందుకెళ్లింది, నాకు డబ్బు ముఖ్యం కాదు, ఎలాగైనా చూడండి, నాకు అభ్యంతరం లేదు, అవసరమైతే మేమే ఉచిత ప్రదర్శనలిస్తాం అంటున్నాడు…
అమెజాన్ వాళ్లకు అమ్మారు కాబట్టి, వాళ్లు అడిగితే లీగల్ టీం స్పందించక తప్పలేదని అంటున్నాడు కదా… ఒకసారి ఓటీటీకి అమ్మాక, దానికి ఏమైనా ఇబ్బందులు వస్తే నిర్మాతకు ఏం బాధ్యత ఉంటుంది..? కథలూకాకరకాయలూ చెబుతున్నాడు… అవసరమైతే అమెజాన్ వాడే పోలీసు ఫిర్యాదు ఇస్తాడు కదా, దిల్ రాజుకు వచ్చిన నష్టమేముంది..? సరే, తనకు నష్టమే అనుకుందాం, పోలీసు ఫిర్యాదులు ఇచ్చీ వెనక్కి వెళ్లి, అవసరమైతే నేనే ఉచిత ప్రదర్శనలు ఇస్తాననే స్టేట్‌మెంట్ దేనికి..?
Ads
ఉచిత ప్రదర్శనలు ఇచ్చేవాడే అయితే పోలీసులతో కేసులు పెట్టిస్తాను అని బెదిరిస్తాడా..? ఎక్కడో ఓ ఎస్సయి గారి స్టేట్‌మెంట్ చదివాను… ‘‘ఆ ప్రదర్శనలకు సహకరించే వాళ్ళ మీద మీద కూడా క్రిమినల్ కేసులు పెడతాం’’ అట… ఏ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు పెడతావో కాస్త దిల్ రాజు మీద ఒట్టేసి చెప్పవయ్యా ఖాకీ భాయ్…
చాలాచోట్ల బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులే ముందుకొచ్చి ఈ బలగం సినిమా ఉచిత ప్రదర్శనల్ని వేస్తున్నారు… ముందుగానే ప్లెక్సీలు అతికిస్తున్నారు… టాంటాం చేయిస్తున్నారు… ఎవరొచ్చి అడ్డుకుంటారో, ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోనీ అని తెగించి చెప్పేస్తున్నారు… ఇదే దిల్ రాజు కంప్లయింట్ మీద ‘‘వెంటనే సరైన చర్యలు తీసుకోవాలి’’ అని ఎండార్స్ చేసిన ఎస్పీలు ఇప్పుడేమంటారో… ఐనాసరే కేసులు పెడతాం అంటారా..? ఎందరి మీద ఏ సెక్షన్ల కింద ఎన్ని కేసులు పెడతారు మహాశయా..? ఎంతమందిని కోర్టులకు లాగుతారు..?
దిల్ రాజు అంతటి త్యాగపురుషుడే అయితే… ఈ ప్రదర్శనల్ని చౌర్యం అనీ, కాపీ చేసి అక్రమంగా షేర్ చేస్తున్నారనీ, పైరసీ అని ముద్రలు వేసే ప్రయత్నం ఎందుకు చేసినట్టు..? చిన్న సాకు దొరికినా తమ మీద నింద వేయడానికి ఓ టీం రెడీ ఉందంటున్నాడు… ఓహో, ఎవరిది ఆ టీం..? మొత్తం థియేటర్ల సిండికేటే తమ గుప్పిట్లో ఉండగా, తమరి జోలికి వచ్చేంత దుస్సాహసి ఎవరయ్యా దిల్ రాజయ్యా..?! అన్నట్టు దిల్ రాజు ఊళ్లోనే ఉచిత ప్రదర్శన వేశారట కదా…!!
ఇవన్నీ సరే, బలగం సినిమాను ఆస్కార్ అవార్డుల కోసం పంపిస్తానంటున్నాడు… 80 కోట్లు తనకు పెద్ద సమస్యేమీ కాదు… కాకపోతే పాటల రచయిత కాసర్ల శ్యాం, సంగీత దర్శకుడు భీమ్స్ కూడా కీరవాణి, చంద్రబోస్‌లాగా కాలర్లు ఎగరేసేలా లాబీయింగ్ చేయాలి… కేవలం ఉత్తమ చిత్రం కేటగిరీ మాత్రమే కాదు సుమా…!!
Share this Article