పార్ధసారధి పోట్లూరి ……….. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ మరియు పెద్ద వాళ్ళు వాడే ఫేస్ పౌడర్ వల్ల కాన్సర్ వస్తున్నది అంటూ 5 ఏళ్ల క్రితమే తెలిసినా ఎవరూ కూడా జాన్సన్ అండ్ జాన్సన్ కాస్మెటిక్ ఉత్పత్తులని వాడడం ఆపలేదు ! ఏప్రిల్ 4 మంగళవారం రోజున జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మా సంస్థ తమ మీద కోర్టులలో ఉన్న కేసుల విషయంలో రాజీకి వచ్చి మొత్తం 8.9 బిలియన్ డాలర్లు నష్ట పరిహారంగా ఇవ్వడానికి సిద్ధపడ్డది !
అమెరికా తో పాటు యూరోపు దేశాలలో జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వాడడం వలన కేన్సర్ వచ్చి చనిపోయినవాళ్ళ తాలూకు బంధువులు మరియు కాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళు వేల సంఖ్యలో కోర్టులలో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ మీద కేసులు వేశారు నష్టపరిహారం ఇప్పించమని ! మొదట్లో అందరికీ కలిపి 2 బిలియన్ డాలర్లు ఇచ్చి కోర్టు బయట పరిష్కారం చేసుకోవాలని చూసినా ఎవరూ ముందుకు రాకపోవడంతో కేసులు అన్నీ పెండింగ్ లో ఉండిపోయాయి ! మంగళవారం ఏప్రిల్ 2023 న మళ్ళీ కొత్త ప్రతిపాదనతో, అంటే 8.9 బిలియన్ డాలర్లు ఇవ్వడానికి ప్రతిపాదన పెట్టింది కోర్టులో ! అయితే ఈ ప్రతిపాదనని కోర్టు ఇంకా అంగీకరించలేదు !
అసలు ముఖానికి వాడే పౌడర్ ఏమీ బ్రహ్మ పదార్ధం కాదు ! జస్ట్ ‘సుద్ద ‘ను[Talcum – దీనిని వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లతో పిలుస్తారు ] బాగా గ్రైండ్ చేసి, దానిలో సుగంధ ద్రవ్యాలు కలుపుతారు మంచి వాసన రావడం కోసం ! మనం వేడి నీళ్ళ కోసం ఏదన్నా పాత్రలో రోజూ వేడి చేస్తూ పోతూ ఉంటే నీటిలో ఉండే సుద్ధ ఆ పాత్ర అడుగుభాగంలో గట్టిగా పేరుకుపోతుంది చూశారూ, అదే సుద్ధని భూమిలో నుండి తవ్వి తీసి, దానిని మెత్తని పొడిగా చేసి, వాసన కోసం కృత్రిమ కెమికల్స్ కలిపి, వాటిని అందమయిన డబ్బాలలో పోసి మనకి అమ్ముతారు. మనమేమో దానిని అదేదో మనల్ని తెల్లగా చేస్తుందని భక్తి తో పూసుకొని ఆనంద పడిపోతూ ఉంటాము.
Ads
నిజానికి సుద్ద తో పాటు ఆస్బెస్టాస్ కూడా దానిలో కలిసిపోయి ఉంటుంది కానీ తయారీ దారులు ఆస్బెస్టాస్ ని సుద్ద నుండి వేరు చేసి అమ్మాలంటే వాళ్ళకి ధర గిట్టుబాటు కాదు. ప్రపంచంలో ఎక్కువగా టాల్కం పౌడర్ ని ఉత్తత్తి చేసేది ఫ్రాన్స్, కానీ ఎక్కువ నిల్వలు ఉన్నవి చైనా మరియు భారత దేశంలో ! అతి తక్కువ ధరకి టాల్కం పౌడర్ ని అమ్మేది ఆఫ్ఘనిస్తాన్ దేశం ! మన దేశంలోని రాజస్తాన్ రాష్ట్రం టాల్కం పౌడర్ కి ఒక పెద్ద కేంద్రంగా ఉంది !
మళ్ళీ కాన్సర్ కారక జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ విషయానికి వస్తే తన ఫార్ములా ఏమిటో పూర్తిగా బయటికి చెప్పదు, మా పౌడర్ వాడడం వలనే కాన్సర్ వస్తున్నది అని ఒప్పుకోవట్లేదు. షరా మామూలుగానే శాస్త్రీయ ఆధారాలు లేవని బొంకుతున్నది ! కానీ జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ లో ఆస్బెస్టాస్ [Asbestos] ఉండడం వలనే కాన్సర్ వస్తున్నది అంటూ కోర్టుకెక్కారు బాధితులు !
అసలు సుద్ద లేదా టాల్కం అనేది ఒక ఖనిజం ! టాల్కం దొరికేది ఆస్బెస్టాస్ ఉన్న చోటనే దొరుకుతుంది. కాబట్టి ఎవరూ కూడా తమ టాల్కం పౌడర్ లో ఆస్బెస్టాస్ లేదు అని ఖచ్చితంగా చెప్పలేరు ! జాన్సన్ అండ్ జాన్సన్ మీద కోర్టులలో కేసులు నమోదు అయ్యేసరికి ఏ దేశంలో చట్టాలు కఠినంగా ఉన్నాయో అక్కడ మొక్క జొన్న స్టార్చ్ నుండి పౌడర్ తయారు చేసి, వాటిలో సుగంధ ద్రవ్యాలు కలిపి అమ్ముతున్నది. అఫ్కోర్స్ మన దేశంలో టాల్కం పౌడరే అమ్ముతున్నది అనుకోండి ! ఎందుకంటే మన వాళ్ళ కి యూరోపియన్ దేశాలలో నిషేధించబడిన లైఫ్ బాయ్ సబ్బుని ప్రేమగా అనుమతి ఇచ్చేశారు కదా ? కుక్కలని శుభ్రపరచడానికి వాడే లైఫ్ బాయ్ సబ్బుని మన దేశంలో ఎందుకు అనుమతిస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి !
అసలు ముఖానికి పౌడర్ కొట్టడం అవసరమా? పౌడర్ కొడితే ఏమవుతుంది ? ఒ అరగంట సేపు మంచి వాసన వస్తుంది ! ఆ తరువాత ? పౌడర్ శరీరంలోకి కలిసిపోయి వీలుంటే చెమట బయటికి రాకుండా అడ్డుకుంటుంది లేదా కణ జాలంలో కలిసిపోయి చిత్ర విచిత్రమయిన రోగాలని వరంగా ఇస్తుంది !
సినీ తారలు అందరికీ ఎందుకు కాన్సర్ వస్తున్నది ? ఎప్పడయినా ఆలోచించారా ? పోనీ వాళ్ళ దగ్గర అంత డబ్బు లేదా కాన్సర్ రాకుండా జాగ్రత్త పడడానికి ? సినీ తారలు వాడే కాస్మోటిక్స్ వారాలు, నెలలు సంవత్సరాల తరబడి శరీరంలో కలిసిపోయి చివరకి అది ఎక్కడో ఒక చోట కాన్సర్ రూపంలో బయటపడి చివరకి చావుని కానుకగా ఇస్తుంది !
సరే, కాన్సర్ చికిత్సలో భాగంగా ఆపరేషన్ చేయించుకున్నా, తరువాత రేడియషన్ థెరపీ పేరుతో ఒక హింస ఉంటుంది చూశారూ, అప్పుడు అనుకుంటారు ఈ సినీ జీవితం కోసం ఇంత హింస భరించాలా అని ! ఇలాంటి హింస కోసం డబ్బులు ఇచ్చి మరీ పర్సనల్ మేకప్ మాన్ లేదా విమెన్ ని పెట్టుకుంటారు రోజుకి రెండు సార్లు మేకప్ వేయించుకోవడానికి ! చాలా ఖరీదు అయిన కాస్మెటిక్స్ వాడుతారు సినీ తారలు ! బయటికి చెప్పేవి హెర్బల్ అంటారు కానీ అవి కెమికల్స్ లేకుండా ఉండవు ! అంతెందుకు ! మనం ఇంట్లో కుంకుడు కాయ రసాన్ని ఈ రోజు వాడి అలానే అదే పాత్రలో వదిలేస్తే మూడో రోజుకి వాసన వస్తుంది అలాంటిది హెర్బల్ [మూలికలు ] అని చెప్పే సో కాల్డ్ కాస్మోటిక్స్ 6 నెలల దాకా నిల్వ ఎలా ఉంటాయి ?
ఇంతా చేసి ఇక ముందు ఎవరన్నా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ని వాడకుండా ఉంటారా ? అబ్బే, కాన్సర్ వచ్చినప్పుడు చూసుకుందాం లే ! మనం బ్రాండ్ అనే సాలె గూడులో చిక్కుకున్నాం ! అసలు కోకో కోలా మొదట్లో గంజాయిని కలిపి అమ్మేవాళ్ళు అంటే నమ్ముతారా ? కొకెయిన్ ని కలిపి అమ్ముతున్నారు కాబట్టి కోకో కోలా అనే పేరునే పెట్టారు మొదట్లో ! మరే ! మార్కెటింగ్ అంటే ఏమిటీ ? తినేది బిర్యానీ దానితో పాటు కోక్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ! అసలు ఆ బిర్యానీ ఎప్పటిదో తెలీకుండా ఉండడానికి కోక్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ! తినండి అలాగే తాగండి !
Share this Article