కొన్ని వార్తల్లోని విశిష్టత దాన్ని రాసి, ప్రజెంట్ పద్ధతిలోనే బయటపడుతుంది… ప్రత్యేకించి మానవాసక్తి కథనాలు (హ్యూమన్ ఇంటరెస్టింగ్) పాఠకులతో బాగా చదివిస్తాయి… కనెక్టవుతారు రీడర్లు… కాకపోతే రాసే పద్ధతి స్ట్రెయిట్‌గా, చదువుతుంటే బుర్రకు ఎక్కేలా ఉండాలి… సాధారణ క్రైం న్యూస్ రాసినట్టుగా రాస్తే కుదరదు… ఈనాడు ఎప్పుడూ ఇలాంటి హ్యూమన్ ఇంటరెస్టింగ్ స్టోరీలకు మంచి ట్రీట్‌మెంట్ ఇస్తుంటుంది… గతంతో పోలిస్తే ఆ లక్షణం బాగా దెబ్బతిన్నా సరే, ఈరోజుకూ ఈనాడే కాస్త బెటర్… వేరే పెద్ద పత్రికల్లో ఇలాంటి వార్తలను గుర్తించే నాథుడే కనిపించడు… సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కనిపించలేదు వార్త… లేదా కనిపించనంత జాగ్రత్తగా వేశారేమో తెలియదు… పత్రికలు అని చెప్పుకునే మిగతా వాటిల్లో కూడా లేదు…
ఇంతకీ స్టోరీ ఏమిటంటే… ఖమ్మం నగరానికి చెందిన ఏపూరి రామారావు స్థిరాస్తి వ్యాపారి, ఆయన భార్య ప్రమీల హెడ్ మాస్టర్‌గా పనిచేసి రిటైరయింది… ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు హర్షవర్ధన్… రెండో కొడుకు అఖిల్… హర్షవర్ధన్ బీఫార్మసీ చేసి, ఆస్ట్రేలియా వెళ్లి హెల్త్ మేనేజ్‌మెంట్, జనరల్ మెడిసిన్ చేశాడు… క్వీన్స్‌ల్యాండ్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో డాక్టర్… 2020లో పెళ్లి కూడా చేసుకున్నాడు… అంతా సుఖంగా సాగిపోతుందని అనుకుంటున్న దశలో విధి వక్రించింది…
Ads
పెళ్లయ్యాక వీసా రాగానే భార్యను తీసుకెళ్తానని చెప్పాడు… ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు… గత అక్టోబరులో వ్యాయామం చేస్తుంటే అసాధారణంగా దమ్మొచ్చింది… దగ్గొచ్చింది… తను డాక్టర్ కదా, వెంటనే డౌటొచ్చింది… పరీక్షలు చేయించుకుంటే ఊపిరితిత్తుల్లో కేన్సర్ ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది… అన్ని కలలూ భగ్నమవుతున్నట్టు అర్థమైంది హర్షకు… ఆందోళనను బయటికి రానివ్వకుండానే అద్భుతమైన సయంమనాన్ని ప్రదర్శించాడు… రియాలిటీ అర్థం చేసుకున్నాడు…
తల్లిదండ్రులకు తన వ్యాధిని చెప్పాడు… వ్యాధి తీవ్రతను బట్టి తన మరణాన్ని అంచనా వేసుకున్నాడు… ముందుగా తన భార్యకు విడాకులు ఇచ్చాడు… ఆమె జీవితంలో సెటిలైందుకు ఏర్పాట్లు చేశాడు… బంధుగణానికి, స్నేహితులకు కూడా చెప్పాడు… ఏమీ దాచిపెట్టలేదు… ఖమ్మం వచ్చేయాలని కోరితే తనకు ఆస్ట్రేలియాలోనే సరైన వైద్యం లభిస్తుందని చెప్పాడు… తొలుత చికిత్స పనిచేసింది… నయమైనట్టే కనిపించింది… ఆ దశలో ఖమ్మం వచ్చాడు, 15 రోజులు గడిపాడు…
మరణం రాసిపెట్టి ఉన్నాక తప్పదు కదా… వ్యాధి తిరగబెట్టింది… తన సర్కిల్‌లో ప్రతి ఒక్కరికీ చెప్పుకున్నాడు… తేదీ చెప్పలేను గానీ చావు తప్పదని స్పష్టం చేశాడు… తన మరణించాక తన శవాన్ని ఖమ్మం చేర్చే ఏర్పాట్లు స్వయంగా చేసుకున్నాడు… ఈ అవసరాల కోసం ఓ లాయర్‌ను మాట్లాడుకున్నాడు… ఆరోగ్యం క్షీణిస్తోంది… వీడియో కాల్స్‌లో చుట్టాలతో, పేరెంట్స్‌తో, ఫ్రెండ్స్‌తో మాట్లాడేవాడు… మార్చి 24న కన్నుమూశాడు…
నిజానికి ఏకాస్త పరిస్థితి సహకరించినా సరే మే 21న ఇండియాకు రావల్సి ఉంది… తమ్ముడు అఖిల్ పెళ్లి… కానీ పెళ్లికి రావల్సిన హర్ష ఓ భౌతికదేహంగా ఖమ్మం చేరాడు… అందరి కన్నీళ్ల నడుమ బుధవారం అంతిమ సంస్కారాలు జరిగి, హర్ష ఈలోకం విడిచిపెట్టి వెళ్లిపోయాడు…!! తరుముకొస్తున్న మృత్యువు పట్ల ఆందోళన పడలేదు తను, ఒకవైపు వైద్యంతో ఎదురుకుంటూనే, రియాలిటీ అర్థం చేసుకుని, రేప్పొద్దున ఏమిటో ఆలోచించి, ఏర్పాట్లన్నీ చేసుకుని, మృత్యువును ఆలింగనం చేసుకున్నాడు… అందరికీ ఇంత గుండె ధైర్యం ఉండదు… సద్గతిప్రాప్తిరస్తు…!!
Share this Article