ప్రభాస్‌కు సోయి లేదు… ఈ మాట అనడానికి సాహసం అక్కర్లేదు… ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు… అంతెందుకు..? ఆదుపురుష్ సినిమా పోస్టర్లు, ట్రెయిలర్లు చూస్తే ఎవరైనా చెబుతారు… హనుమాన్ జన్మదినం సందర్భంగా ఆదిపురుష్ సినిమా నుంచి హనుమంతుడి పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా టీం… అసలే రావణాసురుడి గ్రాఫిక్ ముస్లిం వేషం చూసి జడుసుకున్న రామభక్తులకు ఇప్పుడు హనుమంతుడూ అలాగే ఉండేసరికి మరింత దడుపు జ్వరం పట్టుకుంది…
ఈ పోస్టర్ రిలీజ్… సారీ ఫస్ట్ లుక్ అనాలట… మరీ ఇంత భీకరంగా ఉందేమిటీ అని ఆలోచిస్తే ఆ సినిమా భవిష్యత్తు కూడా కళ్లకుకడుతోంది… 5, 600 కోట్ల రూపాయల పెట్టుబడితో తీస్తున్న ఈ సినిమా మొత్తం రామాయణాన్నే భ్రష్టుపట్టించే దిశలో కదులుతున్నట్టుంది… మొన్నామధ్య శ్రీరామనవమికి సీతారామలక్ష్మణహనుమంతుల పోస్టర్ రిలీజ్ చేశారు కదా… అందులో కూడా సీతకు ఓ హిజాబ్ కప్పారు… రాముడికి క్లీన్ షేవ్ ఉంటే, లక్ష్మణుడికి గడ్డం పెట్టారు…
అందులోనే హనుమంతుడిని చూస్తే ఏదో తేడా కనిపించింది… సరే, ఆ పోస్టర్ దరిద్రపు క్రియేటివిటీ గురించి మనం ఆల్‌రెడీ చెప్పుకున్నాం… ఆ ట్రెయిలర్ భారీ దరిద్రం గురించి అంతకుముందే చెప్పుకున్నాం… ఇప్పుడిక హనుమంతుడి రూపం… సాధారణంగా దేశంలో ప్రతి ఊళ్లో ఏ గుడి ఉన్నా లేకపోయినా హనుమంతుడి గుడి ఉంటుంది… తన భక్తులుంటారు… ఆంజనేయుడి గుడి ఉన్న ఊరికి భూతప్రేతపిశాచాల నుంచి హనుమంతుడి రక్షణ ఉంటుందనే నమ్మకం ఊళ్లలో ఉంటుంది… గుడి ముందు నుంచి వెళ్తున్న ప్రతిసారీ మౌనంగా దండం పెట్టడం కూడా అలవాటు…
Ads
కానీ ఓం రౌత్ అనే దర్శకరత్నం సృష్టించిన ఈ హనుమంతుడిని చూస్తే అసలు ఏ భావమూ కలగడం లేదు… ఇంతకీ అది నర మొహమా, వానర మొహమా కూడా అర్థం కావడం లేదు… అసలు కోతి మొహంలా లేదు, అచ్చంగా మనిషి మొహంలాగే ఉంది… ఓ రుషి తపస్సు చేసుకుంటున్నట్టు ఉంది… హేమిటో ఈ దర్శకుడి క్రియేటివిటీ వెర్రితలలు వేస్తున్నట్టుంది… మహా రామాయణ కథను అపహాస్యం చేయాలనే సంకల్పంతో సినిమా తీసినట్టున్నాడు… అసలు సీతమ్మ కిడ్నాప్‌నే సమర్థించే ధోరణి తీసుకున్నాడట కథలో… ఇక చూసుకొండి తమాషా… ప్రభాస్, ఇదా నువ్వు తీసే రామాయణం… సిగ్గుపడతావో, ఇంకేం చేస్తావో…
ఇందులో హనుమంతుడి వేషం వేసింది దేవదత్త నాగె… మరాఠీ టీవీ షోలలో కనిపించేవాడు… మరాఠీ సీరియల్ జై మల్హర్‌లో లార్డ్ ఖండోబా పాత్ర ఒక్కటే తనకు కాస్త గుర్తింపు తెచ్చి పెట్టింది… అప్పుడెప్పుడో ఒకటీరెండు హిందీ సినిమాల్లో కూడా పాత్రలు దొరికినట్టున్నయ్… ఇదే ఓం రౌత్ తీసిన తన్హాజీ సినిమాలో ఈ దేవదత్త సూర్యాజీ మాల్సురే వేషం వేశాడు…
విజువల్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మన తెలుగులో చాలామంది దర్శకులు రామాయణాన్ని అద్భుతంగా తీశారు… పాత్రల్ని చూస్తుంటే భక్తిభావం పొంగేలా వాటి చిత్రీకరణ, వేషాలు కుదిరేవి… కానీ 600 కోట్ల ఆదిపురుష్ అన్నంటికీ చెడిపోయినట్టుంది… తెలుగులో ఏ చిన్న దర్శకుడికి ఇచ్చినా సరే ఓ పదీపన్నెండు మంచి సినిమాలు తీసేవాళ్లు ఈ ఖర్చుతో… మొదట్లో ఆగస్టు 11, 2002న రిలీజ్ అన్నారు… ట్రెయిలర్‌లోనే దర్శకుడి పైత్యం అర్థమై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, గ్రాఫిక్ రిపేర్ల పేరిట మరో 100 కోట్ల బడ్జెట్ పెట్టుకుని, జనవరి 12, 2023న రిలీజ్ చేస్తాం అన్నారు… ఇప్పుడు జూన్ 16కు వాయిదా పడింది…
మొత్తానికి నిర్మాణ సమయంలోనే ఇంత గందరగోళానికి తావిచ్చిన భారీ సినిమా మరొకటి లేదేమో ఇండియన్ సినిమాకు సంబంధించి… ‘‘అందరూ తప్పులు వెతుకుతున్నారు గానీ నేను ఈ సినిమాకు సంబంధించి ఏ తప్పూ చేయలేదు… ప్రపంచానికి రామాయణ కథను పరిచయం చేయడమే మా ఉద్దేశం… రాముడి బోధనలను యువతలోకి తీసుకుపోవడమే మా సంకల్పం… ప్రస్తుత తరానికి ఎలా చెబితే మంచిదో అలాగే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం… రామాయణ పవిత్రత విషయంలో మేం ఎక్కడా రాజీపడటం లేదు’’ అంటున్నాడు ఓం రౌత్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో… తను చేసే పనికీ, చెప్పే మాటకూ అసలు పొంతనే లేదు… ప్రభాసూ, ఇతనా నీ దర్శకుడు..? గర్వపడుతున్నావా..?!
Share this Article