సోషల్ మీడియా విజృంభణ పెరిగాక ప్రతి ఒక్కరూ జర్నలిస్టే… గతంలో ఏదేని మీడియా హౌజులో పనిచేయాలంటే ముందుగా భాషాజ్ఞానం కొంతైనా అవసరం ఉండేది… మరీ రచనలు, కవిత్వాలు, బాష్యాలు, ప్రవచనాలు రాసేంత అవసరం లేదు గానీ… వాక్యనిర్మాణం, పదాలకు సరైన అర్థాలు, సరైన సందర్భానికి సరైన పదాల ఎంపిక, క్రమపద్ధతిలో వాక్యాల పేర్పు, పేరాల విభజన, అనవసర పదాల పరిహరించడం, సంక్షిప్తంగా విషయం చెప్పడం వంటివి అవసరమయ్యేది…
మీడియా హౌజులు ఈ అంశాల్లో శిక్షణనిచ్చేవి కూడా… ఐనాసరే ఎలాంటి శిక్షణలేని కంట్రిబ్యూటర్లు రాసి పంపించే వార్తలను డెస్కుల్లో తప్పులు దిద్ది, పేజీల్లో పెట్టేవాళ్లు… సరే, వాళ్లు చేయాల్సిన విధులు ఇంకా చాలా ఉంటాయి… అయితే వార్తను పాఠకులకు చేరవేసే క్రమంలో భాషాజ్ఞానానిదే ప్రధానపాత్ర… మరీ యూట్యూబ్ థంబ్ నెయిల్ జర్నలిజం, సైట్ జర్నలిజం పెచ్చుపెరిగిపోయాక వాక్యనిర్మాణం, పదాలకు అర్థాలు కూడా తెలియనివాళ్లు జర్నలిస్టులు అయిపోయి, జర్నలిజాన్ని దున్నేస్తున్నారు…
కొన్ని థంబ్ నెయిళ్లు, వాటిల్లో తప్పులు, లోపాలు చదువుతుంటే ఏకంగా భాషపైన, ప్రత్యేకించి జర్నలిజంపైనే ఏవగింపు వచ్చేస్తుంది… సరే, కాలంతో పాటు ప్రమాణాల పతనం అన్నిరంగాల్లో ఉన్నదే అనుకుందాం ఓసారి… అయితే కొన్ని పదాల్ని రాసే తీరు కూడా కొత్తదనం సంతరించుకుంటోంది… అర్థరహితంగా… సవరించేవాళ్లు, ఒప్పులు చెప్పేవాళ్లు లేకపోవడం ఓ కారణం… అనుకోకుండా ఓ వార్త చదవబడ్డాను… పత్రికలో వేస్తే సింగిల్ కాలమ్ వార్త…
Ads
అందులో…. దూసుకుపోతోన్నారు, చాటుతోన్నాడు, ముందుకెళ్తోన్న, చేస్తోన్నాడు, వస్తోన్నాయి, చూపిస్తోన్న, గడుపుతోన్నాడు, కాబోతోన్న,… ఇలాంటి పదాలు బోలెడు కనిపించాయి… మళ్లీ చెబుతున్నా, రాసిన వ్యక్తిది తప్పు కాదు… ఈ పదాలు తప్పు, ఇవి ఒప్పు అని చెప్పేవాళ్లు లేరు పెద్ద పెద్ద మీడియా సంస్థలో సైతం… సరే, ఈ పదాల విషయానికొద్దాం… సపోజ్ ఓ ఉదాహరణ తీసుకుంటే…, వస్తోంది, వస్తుంది అనే పదాల్లో తేడా ఒకసారి చూడండి… ఇక్కడ వస్తుంది అనే పదం భవిష్యత్ కాలాన్ని, వర్తమాన కాలాన్ని కూడా సూచిస్తుంది… అంటే ఎప్పుడో వస్తుంది అనే అర్థం కూడా వస్తుంది… సో, వస్తోంది అని రాస్తే అది ఒప్పే… కాదనాల్సిన పనిలేదు, అభ్యంతరకరం కూడా కాదు…
కానీ చాటుతోన్నాడు అనే పదానికి వస్తే ఇక్కడ తోన్నాడు అనవసరం… చాటుతున్నాడు అని రాయడమే కరెక్టు… చాటుతున్నాడు అంటే భవిష్యత్ కాలమో, భూతకాలమో వర్తించదు… కేవలం వర్తమానకాలమే… అందుకని చాటుతున్నాడు అనే పదమే సరైంది, చాటుతోన్నాడు అనే పదం అర్థరహితం, అసలు అది తెలుగే కాదు… సేమ్, దూసుకుపోతున్నారు, ముందుకెళ్తున్నారు, చేస్తున్నాడు, వస్తున్నాయి, చూపిస్తున్న, గడుపుతున్న, కాబోతున్న… ఈ పదాలు కూడా అంతే… వీటిల్లో తోన్నా, ళ్తోన్న, స్తోన్న వంటి ఇరికింపులు అక్కర్లేదు… అసలు అవి తెలుగే కాదు…! ఐనా సైట్లు, చానెళ్లలో పెద్ద తలకాయలకు తప్పొప్పులు ఏమిటో తెలిసి ఏడిస్తే కదా, సరైన పదాలేమిటో చెప్పడానికి…!!
Share this Article