సినిమా అంటే ఓ సృజన… నేను వందల కోట్లు ఖర్చు పెడుతున్నానని విర్రవీగితే సరైన ఔట్ పుట్ రాకపోవచ్చు… జనం థూత్కరించవచ్చు కూడా… ప్రభాస్ నటిస్తున్న ఓంరౌత్ సినిమా ఆదిపురుష్ గతి అదే… ఎందుకు జనం కాండ్రిస్తున్నారో మనం పలుసార్లు చెప్పుకున్నాం… మొత్తంగా రామకథనే భ్రష్టుపట్టిస్తున్నాడు సదరు దర్శకుడు… సరే, దాని గతేమిటో పక్కన పెడితే… ఓ మామూలు బడ్జెట్‌తో నిర్మితమవుతున్న హనుమాన్ అనే తెలుగు సినిమా ప్రతిసారీ ఆదిపురుష్ సినిమాను బలంగా వెక్కిరిస్తూనే ఉంది…
మన చిన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ చూపిస్తున్న క్రియేటివిటీలో పదోవంతు కూడా సరుకు లేదు ఓం రౌత్‌లో… గతంలోనే హనుమాన్ పోస్టర్లు, ట్రెయిలర్‌తో అందరి మన్ననలూ పొందాడు… అసలు గ్రాఫిక్స్‌ను వాడుకునే విధానం ఇదిరా అని చెబుతున్నాడు తను… గుడ్… ఇప్పుడు తాజాగా ఆదిపురుష్ హనుమంతుడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఓం రౌత్ మరిన్ని తిట్లు తిన్నాడు తెలుసు కదా… ఇదే హనుమాన్ జన్మదినం సందర్భంగా హనుమాన్ చిత్రదర్శకుడు ప్రశాంత్ ఏకంగా హనుమాన్ చాలీసానే రిలీజ్ చేశాడు…
Ads
తరతరాలుగా జనం పాడుకుంటున్న హనుమాన్ చాలీసాలో ప్రశాంత్ వర్మ గొప్పతనం ఏముందని అంటారా..? మంచి ప్రశ్న… మరి వేల సంవత్సరాలుగా పారాయణం చేసుకుంటున్న రాముడి కథలో కొత్తదనం ఏముందని..? చెప్పుకునే రీతిలో, పాడుకునే తీరులో తేడా ఉంటుంది… హనుమాన్ సినిమా దర్శకుడు చేసిందీ అదే… సాధారణ యానిమేషన్‌తో కొత్త గాయకులతో హనుమాన్ చాలీసాను ప్రజెంట్ చేశాడు… అది సినిమాలో ఉంటుందా లేదానేది వేరే సంగతి…
హనుమాన్ జన్మదినాన్ని సమర్థంగా వాడుకుని, తన సినిమాకు ప్రమోషన్ చేసుకున్నాడు సరే… ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదిపురుష్ ఫస్ట్ లుక్కులు, పోస్టర్లతో పోల్చుకుంటారు కదా… అదుగో అక్కడ ఓం రౌత్ పరువు మరింత దిగజారిపోయింది… హనుమాన్ సినిమా కథ రామాయణ కథతో సంబంధం లేదు… ఇదొక కల్పనాత్మక కంటెంట్… కానీ కథ హనుమంతుడి చుట్టూరా తిరుగుతుంది… అందుకే జనం ఆసక్తి… ఇప్పుడు రిలీజైన హనుమాన్ చాలీసా పాడిన తీరు కూడా బాగుంది… అన్నట్టు ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాయే… ఓ బుల్లి నటుడు తేజ సజ్జ క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్‌లో పదోవంతు కూడా అంత పెద్ద హీరో ప్రభాస్ చూపించలేకపోతున్నాడు… ఐరనీ…!!
Share this Article