రాస్తే నిండా పది వాక్యాలు రావు… అంత చిన్నగా ఉంటుంది వార్త… కానీ పెద్ద సంకల్పం… చదువుతుంటేనే ఆనందం కలిగే వార్త… మన రాష్ట్రాలు, కాదు, కాదు, మన సమాజాలు కులం, మతం, క్షుద్ర రాజకీయాలతో తన్నుకుచస్తున్నాయి కదా… విద్యావేత్తలు, జర్నలిస్టులు, అధికారులు గట్రా అందరినీ ఆ కంపు కమ్మేస్తోంది కదా… కేరళకు సంబంధించిన ఈ వార్త చదువుతుంటే మన చైతన్య స్థాయిని చూసి మనమే ఏడవాలి అనిపిస్తుంది… సరే, రాజకీయాలు ఎక్కడైనా ఉన్నవే… కేరళలోనూ సహజమే… కానీ చాలా సామాజిక అంశాల్లో వారి చైతన్య స్థాయి చాలా ఎక్కువ… భారతీయ సమాజంలో కనిపించే బోలెడన్ని మైనస్ పాయింట్లు అక్కడా ఉన్నా సరే, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా విషయాల్లో చాలా బెటర్… ఈ వార్తను ఓసారి చెప్పుకుందాం…
ప్రతిభకు కులం లేదు… ప్రాంతం లేదు… మతం లేదు… గ్రామీణ, పట్టణ… పేద, ధనిక… స్త్రీ, పురుష తేడాలు కూడా ఏమీ లేవు… అణగారిన పేద వర్గాల పిల్లలు కూడా పదే పదే నిరూపిస్తున్న నిజమది… ఐనా సరే, ఐఏఎస్, ఐపీఎస్ వంటి సర్వీసులు బాగా డబ్బున్న, పట్టణ వర్గాలకే దక్కుతున్నాయనే ఓ అపోహ ఉంది… వాళ్లకుండే అవకాశాలు అలాంటివి… ఇంగ్లిషు, లైబ్రరీ, కోచింగు ఎట్సెట్రా వారికి అడ్వాంటేజ్ అనేది నిజమే… ఈ స్థితిలో ‘అవకాశాలు అందరికీ’ అంటూ వేదిక్ ఐఏఎస్ అకాడమీ ఓ కొత్త కార్యక్రమంలో ముందుకొస్తోంది… దాని పేరు… వన్ స్కూల్- వన్ ఐఏఎస్… అంటే ప్రతి స్కూల్ నుంచీ ఒక ఐఏఎస్ అనే భారీ లక్ష్యం…
Ads
ఐఏఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర, రాష్ట్ర సర్వీసుల రిటైర్డ్ అధికారులు, విద్యావేత్తలు, సెలబ్రిటీలతో కూడిన ఆర్గనైజేషన్ అది… సివిల్ సర్వీస్ అనేది కొన్ని వర్గాల వాళ్లకే అనే అపోహల్ని, భయాల్ని, సందేహాల్ని, జంకును బద్దలు కొట్టాలని సంకల్పం… The Vedhik Erudite Foundations Scholarship Programme… ఇందులో భాగంగా కేరళ వ్యాప్తంగా 10 వేల మందిని ఎంపిక చేస్తారు… బాలురు, బాలికలు… దాదాపు ప్రతి స్కూల్ కవర్ కావాలి… బ్రైట్ స్టూడెంట్స్ను తీసుకుని, స్కూల్ స్థాయి నుంచే వాళ్లకు ఫ్రీగా పోటీపరీక్షల కోచింగు సమకూరుస్తారు… విరాళాలు సేకరించి, దీనికి తగిన ఆర్థిక వనరులను సమీకరిస్తారు… రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల నుంచి యూపీఎస్సీ పరీక్షల దాకా ఈ కోచింగు ఉంటుంది…
జనవరి 16… అంటే ఈరోజే దీన్ని గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నాడు… ఈ విరాళాల తీరు దాతల ఇష్టం… ఉదాహరణకు… సినిమానటి మంజు వారియర్ పది మంది విద్యార్థుల భారాన్ని తాను తీసుకోనున్నట్టు చెప్పింది… భిన్నమైన జిల్లాల నుంచి ఎంపిక చేయబడిన బాలికలకు సాయం చేస్తాను అని చెప్పింది… బాగుంది… సామాజిక చైతన్య స్థాయి అధికంగా ఉన్న మళయాళీ సమాజం తప్పకుండా ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయగలదు… సంకల్పానికి తగినట్టు ప్రతి స్కూల్ నుంచి ఓ కలెక్టరే రావాలని ఏమీ లేదు… పోటీపరీక్షల భయాన్ని పోగొట్టుకుని, ధీమాగా ఓ పెద్ద సర్కారీ కొలువును సంపాదించే సామర్థ్యాన్ని ఇవ్వడంకన్నా ఓ విద్యార్థికి ఇంకేం కావాలి..? మన తెలుగు సమాజం ఈ వార్తలు చదివి ఏం నేర్చుకోవాలి..?!
Share this Article