‘చిన్నమ్మ పథకం’… అంటే జగన్ చిన్నమ్మ పథకం… జగన్ చిన్నమ్మ అంటే స్వర్ణలతారెడ్డి… టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య… జగన్ తల్లి విజయమ్మ సొంత చెల్లె… ఆమె పథకం ఏమిటీ, జగన్‌ను ఆదుకోవడం ఏమిటీ అంటారా..? పథకం అంటే అది రాజకీయ పథకం కాదు… ఆధ్యాత్మిక పథకమే… నిజానికి వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా నియమించినప్పుడు బీజేపీ, టీడీపీ సెక్షన్లు సోషల్ మీడియాలో తనను క్రిస్టియన్‌గా ప్రచారం చేశాయి… కానీ తప్పు… మొన్న ఉండవల్లి చెప్పాడు కదా, సుబ్బారెడ్డి భార్య పొద్దున గోమాతను పూజించనిదే ఏ పనీ ప్రారంభించదు అని… అదే నిజం… ఆమె పరమ భక్తురాలు… ఆమె సూచనలు, ఆలోచనల మేరకు రూపొందినదే ‘గుడికో గోమాత’ కార్యక్రమం… టీటీడీ ఆధ్వర్యంలో స్టార్టయిన ఈ కార్యక్రమాన్ని దక్షిణ భారతంలో అవకాశమున్న ప్రతి గుడిలోనూ అమలు చేయాలని సంకల్పం…
చాలా రోజుల క్రితమే దీన్ని ప్రారంభించారు… పైన కనిపిస్తున్న ఫోటో గత డిసెంబరులో హైదరాబాద్, జుబ్లీ హిల్స్, వెంకటేశ్వరుడి గుడిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలోనిది… ప్రతి గుడిలో ఓ గోవు ఉండాలనేది కార్యక్రమ ఉద్దేశం… దాతల్ని కూడా స్వదేశీ గోవుల్ని విరాళం ఇవ్వాల్సిందిగా కూడా టీటీడీ అప్పీల్ చేసింది… అదుగో, ఆ కార్యక్రమం ఇప్పుడు జగన్‌కు బాగా ఉపయోగపడుతోంది… ఎలాగంటే..? వరుసగా హిందూ దేవుళ్ల విగ్రహాలపై దాడులు సాగుతున్నయ్ ఏపీలో… వాటి వెనుక టీడీపీ ఉంది, బీజేపీ ఉంది అనే సోషల్ ప్రచారాలు, మీడియా ప్రచారాలు తప్ప… పైపైన ఆధారాల్లేని వైసీపీ ఆరోపణలు తప్ప… ఈరోజుకు వాటి వెనుక ఏం కుట్ర ఉందో ఆధారసహితంగా బయటపెట్టలేకపోయింది… మరోవైపు జగన్‌ను హిందూ ద్రోహిగా, క్రిస్టియానిటీ దూకుడుగా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తిగా చంద్రబాబు అండ్ కో చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది… స్టేబుల్‌గా ఉన్న తన ప్రభుత్వాన్ని తానే ఎందుకు డిస్టర్బ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు జగన్..? దానికి చంద్రబాబు దగ్గర జవాబు లేదు…
Ads
ఈ స్థితిలో… నేను హిందూ విశ్వాసాన్ని ప్రేమిస్తానహో అని గట్టిగా చాటి చెప్పుకోవడానికి అర్జెంటుగా ఓ కార్యక్రమం అవసరపడింది జగన్‌కు… ఒకవైపు హిందూ వోట్లన్నీ బీజేపీ వైపు పోలరైజ్ అవుతాయేమో అనే సందేహంతో చంద్రబాబు హిందుత్వను యమర్జెంటుగా తల మీద పెట్టుకుంటున్నాడు… బీజేపీ కూడా దూకుడు పెంచింది… బైబిల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలా అని కొత్త రాజకీయాల్ని ఏపీ ప్రజలకు పరిచయం చేస్తోంది… నాకు మతం రంగు పూయకండిరోయ్ అని జగన్ చెప్పుకోవల్సిన అవసరం… గతంలో పుష్కరస్నానాలు, శ్రాద్ధకర్మలు, పంచాంగశ్రవణాలు, రుషికేష్‌లో యాగాలు గట్రా చాలా చేశాడు… కానీ ఇప్పుడేం చేయాలి..? అదుగో ఆ ఆలోచనల్లో ఈ గుడికోగోమాత పథకం కనిపించింది… వెంటనే రాష్ట్రంలోని దేవాలయాన్నింటినీ భాగస్వాములను చేసి, టీటీడీ గోమాత పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేశాడు… మాంచి పంచెకట్టు, నొసటన బొట్టు, గోప్రదక్షిణ, కర్పూరహారతితో నీరాజనం… పోలా, అదిరిపోలా… ఏం..? గోవులతో రాజకీయం చేయడం బీజేపీ వాళ్లకే తెలుసా ఏం..?!
Share this Article