Artificial Destruction:
1. స్వయం చోదిత (డ్రయివర్ అవసరం లేని సెల్ఫ్ డ్రయివింగ్) వాహనంలో లండన్ వీధుల్లో తిరిగిన మైక్రోసాఫ్ట్ సంస్థాపకుడు బిల్ గేట్స్. (వాహనంలో అమర్చిన కృత్రిమ మేధ సాఫ్ట్ వేర్ జి పి ఎస్ ఆధారంగా దానంతట అదే తిరుగుతుంది)
2. కృత్రిమ మేధ ముందు కూర్చుని మనకు కావాల్సిన వీడియో వివరాలను స్పష్టంగా చెబితే అది వెను వెంటనే గ్రాఫిక్స్, యానిమేషన్ వీడియోలను ఇస్తుంది. (చాట్ బోట్ ను అడిగితే కవిత్వం చెప్పినట్లు)
3. చాట్ బోట్ తో మాట్లాడుతూ…చివరికి ఆత్మహత్య చేసుకున్న బెల్జియం పౌరుడు.
4. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) వల్ల అనర్థాలు పెరుగుతుండడంతో…ఈ రంగంలో చేస్తున్న ప్రయోగాలను కొంత కాలం పాటు నిలిపేయాలని ఈ రంగానికి చెందిన దిగ్గజ కంపెనీలను అంతర్జాతీయ సమాజం కోరుతోంది.
ఈ నాలుగు వార్తలను విడి విడిగా కాకుండా కలిపి చదువుకుంటే ఎన్నెన్నో సమాధానం లేని ప్రశ్నలు మిగులుతాయి.
క్రమాలంకారంలో వరుసగా వెళదాం.
Ads
ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?
లండన్ వీధుల్లో సెల్ఫ్ డ్రయివింగ్ కార్లో తిరిగిన తరువాత బిల్ గేట్స్ అన్న మాట- “అంతా బాగానే ఉంది కానీ…ఈ కారుకు ప్రమాదం జరిగితే…లేదా ఈ కారు వల్ల ఇతరులకు ప్రమాదం జరిగితే ఎవరిని బాధ్యులను చేయాలి అన్నది పెద్ద న్యాయపరమయిన చిక్కు ముడి”
అని.
ఇంతకు ముందే గూగుల్ సెల్ఫ్ డ్రయివింగ్ కార్ ను అమెరికాలో ప్రయోగాత్మకంగా పరీక్షించింది. ఫలితం దాదాపుగా బాగానే ఉన్నా…అమెరికాలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న రవాణా రహదారి చట్టాలను సమూలంగా మార్చాల్సి ఉంది. అదంత సులభం కాదు. ఇప్పుడంటే బండి నడిపే వ్యక్తికి డ్రయివింగ్ పరీక్షల తరువాత లైసెన్స్ ఇస్తున్నారు. సెల్ఫ్ డ్రయివింగ్ కార్ అయితే డ్రయివింగ్ లైసెన్స్ ఎవరికివ్వాలి? ఎవరికీ ఇవ్వలేనప్పుడు ప్రమాదం జరిగితే బండి ఎవరు నడుపుతున్నట్లు? లీగల్ కేసుల్లో ఎవరిని బాధ్యులుగా చేయాలి? ఇలాంటి అనేక చిక్కు ముళ్లతో సెల్ఫ్ డ్రయివింగ్ కార్ తయారై సిద్ధంగా ఉన్నా టెస్లా మార్కెట్లోకి విడుదల చేయలేకపోతోంది. ఆ టెస్లా కంపెనీ అధినేతకే కృత్రిమ మేధ మీద అనేక భయాలున్నాయి. పోను పోను సమాజానికి కృత్రిమ మేధ పెద్ద ప్రమాదమని ఈ రంగంలో నిపుణులే ఉదాహారణలతో పాటు హెచ్చరిస్తున్నారు.
మెదడు ఉందా?
రకరకాల యంత్రాలు వచ్చాక క్రమంగా శరీరాన్ని కదిలించడం ఎలా మానేశామో మనకే తెలుసు. క్యాలిక్యులేటర్, కంప్యూటర్, సెల్ ఫోన్…ఇలా ఒక్కొక్కటి వచ్చే కొద్దీ పనుల వేగం పెరిగింది. పని సులభం అయ్యింది. కానీ…మెదడు సహజంగా పనిచేయడం మానేస్తోంది. తనంతట తనే కవిత్వం రాసే చాట్ బోట్ గురించి విని అబ్బో అనేలోపే…వివరాలు చెప్తే వీడియోలు చేసిచ్చే కృత్రిమ మేధ కూడా తయారయ్యింది. కొన్నాళ్లకు మనకు మెదడు అవసరమే ఉండదు. ఉన్నా దానితో పని ఉండదు. డార్విన్ జీవ పరిణామ క్రమ సిద్ధాంతం ప్రకారం- దేన్ని వాడమో ఆ అవయవం శరీరంలో నెమ్మదిగా అదృశ్యం అవుతుంది. ఈ సూత్రం ప్రకారం- కృత్రిమ మేధ పుణ్యమా అని ఒకనాటికి మెదడు లేని మనుషులు పుట్టవచ్చు. అంటే ఇప్పుడు పుట్టలేదని కాదు. ఆ చర్చ ఇక్కడ అప్రస్తుతం!
చాట్ బోట్ కు కూడా లోకువేనా?
ఒక బెల్జియం వ్యక్తి చాట్ బోట్ తో నిరంతరం మాట్లాడుతూ…మాట్లాడుతూ…స్వర్గంలో “కలుసుకుందాం రా!” అని చాట్ బోట్ చెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. చాట్ బోట్ ను చేరుకున్నాడో? లేడో? మనకిప్పుడు ఏ స్వర్గం చెప్పాలి? కృత్రిమ మేధ నరకం చూపుతుంటే దాన్నే స్వర్గం అనుకుంటున్నాం.
కృత్రిమ మేధకు పరిమితులు అవసరం లేదా?
లోకం ఎప్పుడయినా చేతులు కాలిన తరువాతే ఆకులు పట్టుకుంటుంది. కృత్రిమ మేధ దారి తప్పుతోందని ఆలస్యంగా అయినా ప్రపంచం గుర్తించింది. మనిషి వినాశనానికి కృత్రిమ మేధ ఎలా కారణం కాగలదో వివరిస్తూ నిపుణులు ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నారు.
ఎక్కడ కృత్రిమ మేధ తప్పనిసరి? ఎక్కడ అవసరం లేదో? గీత గీయకపోతే భవిష్యత్తులో యంత్రం చేతిలో మనిషి మెదడు చిట్లిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తాత్కాలికంగా కృత్రిమ మేధ పరిశోధనలను ఆపేయాలన్న డిమాండు ఊపందుకుంది.
మనలో మన మాట…
మన మెదడును కృత్రిమ మేధ ఇప్పటికే చిదిమేయలేదా?
దిమాక్ లో చటాకంత అయినా దమాక్ మిగిలి ఉందా?
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article