ఓ మిత్రుడి వ్యాఖ్య… ‘‘మంచి పనైంది… ఎందుకీ దిక్కుమాలిన పార్టీలన్నీ… అసలు జాతీయ పార్టీలుగా గుర్తింపు ఇచ్చే నిబంధనలే అడ్డదిడ్డం… ఈశాన్య రాష్ట్రాల్లో తప్ప ఇంకెక్కడా కనిపించని నేషనల్ పీపుల్స్ పార్టీ (సంగ్మా) ఓ జాతీయ పార్టీ… కానీ బీజేడీ, బీఆర్ఎస్, ఆర్జేడీ, వైసీపీ, డీఎంకే, టీఎంసీలు వంటి పెద్ద పార్టీలు అసలు జాతీయ పార్టీలే కాదు…
సీపీఐ దుర్గతి ఊహించిందే… సీపీఎం పేరు కూడా తీసేస్తే పోయేది… ఐనా తప్పదు… త్రిపుర, బెంగాల్‌లో కనుమరుగైంది… ఇంకా అవుతుంది… డీఎంకే దయ లేకపోతే తమిళనాడులో సీట్లు లేవు… ఉన్న ఒక్క కేరళ సరిపోదు, రాహుల్ నాయకత్వం సరిగ్గా ఉండి ఉంటే అది అక్కడా మొన్నటి ఎన్నికల్లో ఖతం అయిపోయేది… ఇక బీఎస్పీ… నానాటికీ దిగదుడుపు… రాబోయే కాలంలో 6 శాతం రాష్ట్రాల ఎన్నికల్లో వోట్లు, 2 శాతం లోకసభ సీట్లు వంటి రూల్స్‌లో అది ఫిట్ కావడం కష్టం…
ఆప్, ఇప్పుడు పంజాబ్, ఢిల్లీ, గోవా రాష్ట్రాల్లో తగినన్ని వోట్లు సాధించి జాతీయ పార్టీ హోదా దక్కించుకుంది… నిజానికి ఢిల్లీ, గోవా చెప్పుకోదగిన ప్రాధాన్య రాష్ట్రాలు కావు… పంజాబ్‌లో వాపు తప్ప బలుపు కాదు… సో, ఆప్ చాన్నాళ్లు జాతీయ పార్టీ హోదాలో ఉండటం కష్టం… మొన్న గుజరాత్‌తో చేతులు, మూతులు కాల్చుకుంది కూడా… సో, ఇంకొన్నాళ్లకు కాంగ్రెస్, బీజేపీ మాత్రమే జాతీయ పార్టీలుగా మిగులుతాయి… గుడ్, అమెరికాలోలాగా రెండే పార్టీల సిస్టం వచ్చినా బాగుండు…’’ ఇదీ తన విశ్లేషణ… నిజమేనేమో, రాహుల్ లేని బలమైన కాంగ్రెస్, పోటీగా బీజేపీ… ఒకదానికి మరొకటి చెక్ అన్నట్గుగా ఉంటే చాలదా..?!
Ads
లెఫ్ట్ పార్టీల శకం ముగిసినట్టే అనిపిస్తోంది… కొత్త తరం వాళ్ల మాటల్ని పట్టించుకునే స్థితి లేదు… వాళ్లు మారరు, పైగా విదేశీ సిద్ధాంతాల దరిద్రం మనకెందుకు అనే విమర్శ చాన్నాళ్లుగా వినిపిస్తోంది… ప్రత్యేకించి చైనాకు బానిస పార్టీగా ఉన్న సీపీఎం మీద మరీ ఎక్కువ… శత్రువుకు దాస్యం చేసే పార్టీగా విద్యావంతులు ఆ పార్టీని పెద్దగా సహించడం లేదు… సీపీఐ పరిస్థితి చూస్తూనే ఉన్నాం ఫాఫం…
సో.., బీజేపీ, కాంగ్రెస్‌లకు దీటుగా జాతీయ స్థాయికి ఎదిగే పార్టీలు ఏవీ కనుచూపు మేరలో కనిపించడం లేదు… ఏదో ఒక రాష్ట్రంలో బలంగా ఉండే ప్రాంతీయ శక్తులే తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ ఉనికి, బలం ఉన్న పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ఇప్పుడు… మన ఎన్నికల సిస్టం అనుమతిస్తోంది కాబట్టి వేల పార్టీలు రిజిష్టరయ్యాయి… వాటి ప్రక్షాళన కూడా జరిగితే బాగుండు…
ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు, ప్రభుత్వాలను పడేయడాలు, పార్టీలనే విలీనం చేసుకోవడం వంటి అనైతిక చర్యలు పోవాలంటే… రెండే పార్టీలు ఉంటే మేలనే భావన చాలామందిలో ఉంది… రాజ్యాంగాన్ని మార్చి మనం రెండు పార్టీల సిస్టంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే.,. ప్రజలే అటువైపు దేశాన్ని లాక్కుపోతున్నట్టుంది చూడబోతే..! కుటుంబ పాలన, వారసత్వ పార్టీలు, భారీ అవినీతి, జాతీయ దృక్పథ రాహిత్యం వంటివి ప్రాంతీయ రాజకీయ పార్టీలకు, వాటిని మోస్తున్న ప్రజలకు అరిష్టం… అలాగని బీజేపీ, కాంగ్రెస్ శుద్ధపూసలని కాదు… కాకపోతే ఇన్ని రాళ్లు వేస్ట్ కదా, పళ్లు రాలగొట్టుకోవడానికి… రెండు పెద్ద రాళ్లు చాలు…!! (multi party system, strength of regional parties వంటి పెద్ద చర్చలోకి ఇక్కడ వెళ్లడం లేదు…)
Share this Article