ఎన్నికలు రాబోతున్నయ్… ఈసారి ప్రచారవ్యయం, ఎన్నికల వ్యయం తడిసి మోపెడు కాబోతున్నయ్… కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పలు స్థానాాల్లో హోరాహోరీ పోరాడబోతున్నయ్… తద్వారా ఖర్చు ఆకాశాన్నంటబోతోంది… హుజూరాబాద్ ఉపఎన్నికలో కేసీయార్, ఈటల పోటీలుపడి మరీ ఈ ఖర్చును విపరీతంగా పెంచేశారు… వోట్ల కోసం ఇచ్చే డబ్బు మాట అటుంచితే… ప్రచారానికే బోలెడంత ఖర్చు మీదపడబోతోంది…
అనేకచోట్ల బీఆర్ఎస్ సిట్టింగులపై తీవ్ర వ్యతిరేకత ఉంది, మళ్లీ వాళ్లకే గనుక టికెట్లు ఇచ్చినా ఆ వ్యతిరేకత దాటడానికి మస్తు ఖర్చు పెట్టాలి… ఈసారి మంచి సంఖ్యలో గనుక సీట్లు రాకపోతే ఇక తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగే… మరోవైపు బీజేపీకి మస్తు ఆశలున్నయ్… డబ్బుకు కొదువ లేదు… మరి ప్రచారం ఎలా..?
కార్యకర్తలను మెయింటెయిన్ చేయడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని…. మీటిింగులు పెడితే, డబ్బులు ఇవ్వనిదే ఎవరూ రావడం లేదు… బీర్లు, బిర్యానీ పొట్లాలు లేకుండా ఓ పార్టీ మీటింగ్ కష్టం… సోషల్ మీడియా టీమ్స్ మెయింటెయిన్ చేయాల్సి వస్తోంది… కానీ దాంతో ఫలితం అంతంతమాత్రమే… పోనీ, పాదాల మీద నడిచే పాదయాత్రలు చేయాలంటే చాలామంది లీడర్లకు అసలు ఒళ్లు వొంగితే కదా… టైమ్‌కు డబ్బులు పారేసి వోట్లు కొనుక్కుందాం అనుకుంటే, ప్రత్యర్థులు కూడా దానికి రెడీ కదా… మరెలా..?
Ads
ఇప్పుడు కాస్త చౌకలో దొరికిన మార్గం గ్రామాల్లో, వార్డుల్లో ఉచిత సినిమా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం… వర్తమానంలో బలగం సినిమా ప్రదర్శనలు జరుగుతున్నాయి… మంచి మౌత్ టాక్ పుణ్యమాని ఈ ఉచిత ప్రదర్శనలకు జనం కూడా బాగా వస్తున్నారు… కనెక్ట్ అవుతున్నారు… పనిలోపనిగా సినిమా ప్రదర్శనకు ముందు పార్టీలు, నాయకుల ప్రచార వీడియోలను కూడా వేసేస్తున్నారు… జస్ట్, 13, 15 వేల ఖర్చుతో జనంలో మంచి పేరు ప్లస్ ప్రచారం… ఇంకేం కావాలి..?
సో, ఈ ఉచిత ప్రదర్శనలు కేవలం బలగం సినిమాతో ఆగవు… రంగమార్తాండ, రాబోయే శాకుంతలం సినిమాలకు అంత సీన్ లేదు… కాకపోతే ఈలోపు ఏదైనా కాస్త చూడబుల్ సినిమా వస్తే మాత్రం ఊళ్లల్లో రాజకీయ నాయకులు వాటిని ప్రదర్శించడం గ్యారంటీ… ఇదొక ప్రచారమార్గం కాబోతోంది… వోటర్లకు చెప్పాలనుకున్నది లీడర్ తన వీడియోలో సూటిగా చెప్పేస్తాడు, మద్దతు ఇవ్వమంటాడు… తరువాత సినిమా వేస్తారు… ఇలా ప్రతి ఊళ్లో చేయగలిగితే తక్కువ ఖర్చులో అనేక మీటింగులు ఆర్గనైజ్ చేయడంతో సమానం…
ఒక హీరో సినిమా వేస్తే మరో హీరో ఫ్యాన్లతో ఇబ్బంది అనుకుంటే… హీరోయిజం జాడలేనివి, సంసారపక్షంగా ఉన్నవి సినిమాలు వెతికి, ఓటీటీలో ఆ లింక్‌కు ఈ డిజిటల్ స్క్రీన్ అనుసంధానిస్తే సరి… మంచి నీళ్లు, కార్పెట్లు గట్రా అన్ని ఖర్చులూ లెక్కేసుకున్నా 20 వేల ఖర్చుతో ఒక ప్రదర్శన… బాగుంది కదా… కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమా… దీన్ని ఎక్కువగా సద్వినియోగం చేసుకునేది అధికార పార్టీయే కాబట్టి పెద్దగా పోలీసుల నుంచి ఆంక్షలు ఎదురుకావు… ఐనా ఎవరు ఆపగలరు..? !
Share this Article