యండమూరి రాసిన ఒక నవలలో ఓ ఉగ్రవాది మన దేశానికి ఏకంగా ప్రధాని అయిపోతాడు… అప్పట్లో అది చదివి నవ్వుకున్నవాళ్లు ఓసారి అతీఖ్ నేర రాజకీయ చరిత్ర చదివితే బెటర్… యండమూరి కల్పన నిజానికి దగ్గరగానే ఉంది అని అంగీకరిస్తారు… ఎవరు ఈ అతీఖ్ అని నెత్తి గోక్కుంటున్నారా..? అవసరం లేదు… మొన్న యోగీ సర్కారు అసద్ అనేవాణ్ని ఎన్‌కౌంటర్ చేసింది కదా… సదరు అసద్ తండ్రి… అతీఖ్ మొదట గ్యాంగ్‌స్టర్, తరువాత పొలిటిషియన్‌గా మారాడు…
యూపీ మాత్రమే కాదు, బీహార్ కూడా ఇలాంటి క్రిమినల్ పొలిటిషియన్స్‌ను ఎందరినో చూసింది… వీళ్లను పెంచి పోషించేది కూడా ఆర్జేడీ, ఎస్పీ పార్టీలే ప్రధానంగా…! ఈ అతీఖ్ వరుసగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు… ఒక టరమ్ ఎంపీ… కేంద్రంలోని ప్రభుత్వంలో గనుక ఎస్పీ చేరితే, అతీఖ్ ఒత్తిడి మేరకు ఎస్పీ తనను కేంద్ర మంత్రిని గనుక చేస్తే… ఏ మౌనమునో తనను రక్షణ శాఖకు మంత్రిని చేస్తే..? ఇప్పుడు చెప్పండి యండమూరి సరిగ్గానే రాశాడు కదా…
అతీఖ్ ఎందుకు బలపడ్డాడు..? మన న్యాయవ్యవస్థ, మన పోలీస్ వ్యవస్థ, మన సర్కార్లు ఇలాంటివాళ్లను శిక్షించలేవు గనుక… ఒక దశలో హైకోర్టులో తన బెయిల్ పిటిషన్ వినడానికి ఏకంగా 10 మంది జడ్జిలు నిరాకరించారు… మరొకాయన బెయిల్ ఇచ్చేశాడు… 40 ఏళ్లలో కనీసం 100 కేసులు నమోదయ్యాయి… భయపడి కనీసం కంప్లయింట్ చేయలేనివాళ్లు బోలెడుమంది… పోలీస్ విచారణలో తను అంగీకరించిన నిజాలు కొన్ని పోలీసులు కోర్టుకు వివరించారు…
Ads
‘‘మాకు ఆయుధాలకు కొరతేమీ లేదు… ఐఎస్ఐ పంపిస్తుంది… లష్కరే తొయిబాతో సంబంధాలున్నయ్… పాకిస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా వెపన్స్ పడేస్తారు.,. కొందరు భద్రంగా కాశ్మీర్ చేరుస్తారు… తరువాత మాకు వస్తాయి…’’ ఇదీ తన వివరణ… అంటే అర్థమైంది కదా… ఐఎస్ఐ, లష్కరే తొయిబా సానుభూతిపరులు, సంబంధాలున్నవాళ్లు మన అధికార వ్యవస్థలో ఏ రేంజుకు చేరుకోగలరో… ఇవన్నీ తెలిసినా మన వ్యవస్థ ఎన్నికల్లో పోటీచేయకుండా ఆపగలిగిందా..? కఠినంగా శిక్షించగలిగిందా..? ఆ అతీఖ్‌కు నేర వారసుడే అసద్…
ఎన్‌కౌంటర్ అనగానే హక్కుల సంఘాలు, మేధావులు ఉలిక్కిపడతారు… దేశంలో చట్టం, న్యాయం ఏమైపోయాయంటూ మొత్తుకుంటారు… కానీ చట్టాలు, మన న్యాయవ్యవస్థ విఫలమైనప్పుడే కదా పోలీసుల తుపాకీ చట్టాన్ని, న్యాయాన్ని తన చేతుల్లోకి తీసుకుంటోంది… అర్జెంటుగా మన దేశం ఏ వ్యవస్థను సంస్కరించుకోవాలో ఇలాంటి అతీఖ్‌ల చరిత్రలే చెబుతుంటాయి… నేరానికి మతం ఉండదు, కులం ఉండదు… యూపీలో ఇలాంటి ప్రభావవంతమైన క్రిమినల్స్‌లో ముస్లింలున్నారు, యాదవులున్నారు… ఇతరులూ ఉన్నారు… ఐనా నేరాన్ని కులం, ప్రాంతం, మతం, వర్గం కోణాల్లో చూస్తే ఎలా..?
కానీ ఐఎస్ఐ, లష్కరే తొయిబా కేవలం ముస్లింలనే ఎంచుకుంటుంది… మతం పేరిట వాళ్లను లోబరుచుకుని, తను అనుకున్న అశాంతిని, అరాచకాన్ని ప్రేరేపిస్తుంది దేశంలో… మన న్యాయవ్యవస్థ రక్షిస్తూ ఉంటుంది… ఈ స్థితిలో ఓ సగటు యూపీవాసి ‘‘యోగి చేసిందే కరెక్టు’’ అనుకుంటే అందులో అసహజత్వం ఏమీ లేదు… మజ్లిస్ వంటి పార్టీలకు ఇందులో మతకోణం కనిపించవచ్చుగాక… కానీ యోగి ఎన్‌కౌంటర్లలో ఇతరులూ మరణించారు…
తన ఫస్ట్ టరమ్‌లో వేల ఎన్‌కౌంటర్లు జరిగాయి… ఒక్క దిశ ఎన్‌కౌంటరే సమర్థించుకోలేక తెలంగాణ పోలీసులు నానా అవస్థలూ పడుతున్నారు… అలాంటిది వేల ఎన్‌కౌంటర్లను ఈరోజుకూ కొనసాగిస్తున్న యోగి ప్రభుత్వం వాటిని ఎలా సమర్థించుకుంటోంది..? అది విస్మయాన్ని కలిగించేదే…!! ఎస్పీ, బీఎస్పీల పాలనలో చెలరేగిపోయిన నేరస్థులకు ఏ పోలీసులైతే మద్దతుగా నిలిచారో, ఆ పోలీసులనే వినియోగించి యోగి యుద్ధం చేస్తున్నాడు… సో, పోలీసు తుపాకీని తప్పుపట్టాల్సిన పనిలేదు… దాన్ని వాడుకునేవాడు సమర్థుడై ఉండాలి, సత్సంకల్పంతో వాడుకుంటూ ఉండాలి…
చివరగా :: ఇప్పటికైనా అతీఖ్ బయటికి రాకపోవడమే తనకు భద్రత… యోగి తుపాకీ రాసుకున్న హిట్ లిస్టులో తన పేరూ ఉంది… ఇలాంటి ‘‘టెర్రరిస్టు’’లు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారు… యోగి ఒక్కడే బుల్లెట్లతో, బుల్‌డోజర్లతో వెంటపడుతున్నాడు…! ఎంతోమంది ఉసురుపోసుకున్నవాడే ఇప్పుడు ‘‘దయచేసి నా కుటుంబం జోలికి వెళ్లకండి’’ అని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు… ఇప్పుడు ‘‘పెయిన్’’ అంటే ఏమిటో అర్థమవుతోందా..?!
Share this Article