ఒకతను ఇంటర్వ్యూ రూం తలుపును సున్నితంగా తట్టాడు… ‘‘సర్, నేను లోపలికి రావచ్చా..?’’ అడిగాడు…
లోపల నుంచి ప్యానెల్ సభ్యుల్లో ఎవరో అన్నారు… ‘‘కమిన్’’…
లోనకు వచ్చిన మనిషి ఏదో అడగబోయాడు… నో, నో, ఫస్ట్ సీట్లో కూర్చో అన్నాడు ఓ సభ్యుడు…
Ads
సరేనంటూ తలూపి, వాళ్లకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు తను…
ఒకతను అడిగాడు… ‘‘ఈ రూం చూస్తే నీకేమనిపిస్తుంది…?
‘‘వెల్ ఫర్నిష్డ్ సర్… మెత్తటి కార్పెట్, మంచి కలర్స్‌తో విండో స్క్రీన్లు, ఓ బోర్డు, ప్రొజెక్టర్, వైట్ స్క్రీన్… గ్రేట్ సర్..’’
‘నువ్వు గమనించలేదా..? ఓ చిత్తు కాగితపు ఉండ ఫ్లోర్ మూలకు విసిరేయబడి ఉంది… అది మొత్తం రూమ్ ఆంబియెన్స్‌ను, లుక్కును చెడగొట్టడం లేదా..?’’
‘సర్, నేను లోపలకు రాగానే గమనించాను… కానీ దాని గురించి ప్రస్తావిస్తే దాన్ని విసిరేసిన వ్యక్తికి ఇరకాటంగా, ఇబ్బందిగా ఉంటుంది… అందుకే మాట్లాడలేదు, ఎలాగూ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెబుతున్నాను… లెఫ్ట్ నుంచి రెండో కుర్చీలో కూర్చున్న పెద్దమనిషి దాన్ని విసిరేశాడు… తన ముందున్న స్క్రిబ్లింగ్ ప్యాడ్ నుంచి తను ఆ కాగితాన్ని సరిగ్గా చింపలేదు, ఆ ప్యాడ్ మీద ఓ పేపర్ ముక్క అలాగే ఉంది… జాగ్రత్తగా చించలేదు…’’
‘‘వావ్, గుడ్ అబ్జర్వేషన్ మ్యాన్… ఒకసారి స్వీపర్ లేడీని పిలిచి దాన్ని తీసేయాలని చెప్పగలవా..?’’
‘‘అలాగే సర్, ఆమె పేరేమిటి సర్..?’’
అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు… వాళ్లకు ఆమె పేరు తెలియదా..? చెప్పదలుచుకోలేదా..? ఎలా కనుక్కుని పిలుస్తాడో పరీక్షిద్దామనా..?
‘‘వోకే సర్, ఇక్కడ ఎవరికీ ఆమె పేరు తెలియదేమో… నేను పిలుచుకొస్తాను…’’
అతను బయటికి వెళ్లాడు… బయట కూర్చున్న ప్యూన్‌ను లేడీ స్వీపర్ పేరేమిటని అడిగాడు… పిలిచాడు… ‘‘భవానీ, ఓసారి లోపలకొచ్చి, ఫ్లోర్ క్లీన్ చేసి వెళ్లమ్మా…’’
తరువాత ఇంకేదో చెప్పబోయాడు, ఓ సభ్యుడు చెప్పాడు… ‘‘ఇంటర్వ్యూ అయిపోలేదు,.,’’
ఇంటర్వ్యూ కొనసాగింది…
‘‘నీ ధోరణి బాగుంది… నువ్వు ఏ స్థాయి వ్యక్తులనైనా గౌరవిస్తావు, ఇప్పుడు చెప్పు, మాలో బాస్ ఎవరు..?’’
‘‘అలాగే సర్… మీలో ఇద్దరు జస్ట్, జరిగేది చూస్తున్నారు, జోక్యం చేసుకోవడం లేదు… వారిలో ఒకరు బహుశా ఫైనాన్స్ మ్యాన్ అయి ఉంటారు… శాలరీ సంప్రదింపుల సమయంలో తను ఎంటర్ అవుతారేమో… మరొకతను బహుశా హెచ్ఆర్ డైరెక్టర్ కావచ్చు… తనే ఎక్కువగా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు… హెచ్ఆర్ అంటే అంతే…’’
‘గుడ్, ఇంకా..?’
‘‘ఆ చివరలో కూర్చుని, చిరునవ్వులు చిందిస్తూ, ఎప్పుడో ఓసారి మీతో మాట్లాడుతున్నాడు కదా… ఆయనే బాస్… మధ్యలో కూర్చున్న వ్యక్తి మీద మీ ఫోకస్ కేంద్రీకృతమై ఉండటంతో మొదట తనే బాస్ అనుకున్నాను, కానీ కాదు…’’
‘ఎక్సలెంట్… మా పరీక్షలో నెగ్గావు… జస్ట్, కాసేపు బయట వెయిట్ చేయి, తరువాత నీ అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకో…’’
‘‘ఇంకేం ప్రశ్నలు లేవా సర్, సర్దార్ పటేల్ విగ్రహం ఎత్తు ఎంత..? ద్రౌపది ముర్ము ఎమ్మెల్యేగా ఎన్నికైన సీటు పేరేమిటి..? వంటి ప్రశ్నలు లేవా..?’’
‘‘హహహ… అవేమీ లేవులే… ఓసారి నీ పేరు కన్‌ఫరమ్ చేసుకోవడమే మిగిలింది… నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చిన గిరిధర్‌వే కదా…’’
‘‘కాదు సార్, సారీ, అతను బయట వెయిట్ చేస్తున్నాడు, లోపలకు ఎప్పుడు పిలుస్తారోనని నిరీక్షిస్తున్నాడు…’’
‘‘వాట్..? మరి నువ్వు ఎవరు..?’’
‘‘సర్, నా పేరు ప్రకాష్… ఈ ఆఫీసు క్యాంటీన్ నుంచి వచ్చాను… ఎన్ని టీలు, ఎన్ని కాఫీలు కావాలో మా బాస్ కనుక్కుని రమ్మన్నాడు… అలాగే స్నాక్స్ ఏమైనా కావాలా అడగమన్నాడు… అదే అడగాలని వచ్చాను, కానీ మీరు కుర్చీ చూపించారు, కూర్చోమన్నారు, భలే ఉంది సార్… ఇకనైనా చెప్పండి సార్, ఎన్ని టీలు కావాలి..? ఎన్ని కాఫీలు కావాలి..?’’
(ఫేస్‌బుక్‌లోనే కనిపించిన ఓ ఇంగ్లిషు పోస్టుకు స్వేచ్ఛానువాదం…)
Share this Article