“రాజమౌళి మగధీర తీసిన వెంటనే నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఈర్ష్య, అసూయ.. ఇలా అన్ని ఫీలింగ్స్ వచ్చేశాయి. కొన్ని రోజులకు అతను చేసే క్యాల్కులేటెడ్ రిస్క్‌లు మనం కూడా చేయాలనే నిర్ణయానికి వచ్చాను. అలా నేను కూడా రిస్క్ చేస్తున్నాను” అని ఈమధ్య శాకుంతలం ప్రమోషన్ ఇంటర్వ్యూలలో ఎక్కడో అన్నాడు దర్శకుడు గుణశేఖర్… వాతలు పెట్టుకున్నాను అని తనే చెబుతున్నాడు… అది నిజంగానే తనను కాల్చేసింది శాకుంతలం అట్టర్ ఫ్లాప్ అనుభవంతో…
నిజానికి గుణశేఖర్ పాజిటివ్ నోట్‌లోనే ఈ మాట చెప్పి ఉండవచ్చుగాక… కానీ శాకుంతలం డిజాస్టర్‌తో ఆ మాటలు ఇప్పుడు ప్రముఖంగా తెరపైకి వచ్చి ఓ చర్చను రేపుతున్నాయి… అసలు ఒకరిని చూసి మరొకరు వాతలు పెట్టుకోవడం ఏమిటి..? ఫిలిమ్ మేకింగులో ఎవరి స్టయిల్ వాళ్లది… ఎవరి ప్రతిభ వాళ్లది… ఉదాహరణకు రాజమౌళిది విశేష ప్రతిభ…
తను సీన్లను కాపీ కొడతాడు… చాలా ఉదాహరణల్ని సోషల్ మీడియా బయటపెట్టింది… దాన్నెప్పుడూ తను సిగ్గుమాలిన పనిగా భావించడు… భావిస్తే ఇక్కడిదాకా ఎదిగేవాడు కాదు… కాకపోతే ఏం కాపీ కొట్టినా సరే, అంతిమంగా ప్రేక్షకులను నచ్చే ఓ ఎంటర్‌టెయిన్‌మెంట్ ప్యాకేజీని అందిస్తాడు… నిర్మాణంలో కొంత భాగస్వామ్యం… మార్కెటింగు మీద వేసుకుంటాడు… అవసరమైతే నిర్మాతను పూర్తిగా దూరం పెట్టేస్తాడు… ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత దానయ్య దుర్గతి చూశాం కదా… ఆస్కార్ కాదు కదా, ఏ చిన్న అవార్డు దగ్గరికీ దానయ్యను రానివ్వలేదు… ఆస్కారమే లేదు…
Ads
పలు దేశాల్లో డబ్ చేసి తన సినిమాల్ని రిలీజ్ చేస్తాడు… ఆ దేశాల్లో మనల్ని దేకేవాడెవడు..? ఏదో ఉంది..? ఆ దందాను ఈరోజుకూ ఈడీయో, ఐటీయో ఛేదించలేకపోయాయి… తెలుగులో రాజమౌళే కాదు, హిందీలో కూడా ఈ వ్యాపారం ఉంది… తన సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ చేసుకోగలడు… కోట్లకుకోట్లు ఖర్చు పెట్టి మరీ ఆస్కార్ దాకా వెళ్లగలడు… ఖర్చుకు వెనుకాడడు… తను ఆశించే ప్రయోజనాలే డిఫరెంట్… పైగా ఒక సినిమా దర్శకత్వం చేపడితే తన కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది… లబ్ధి పొందుతుంది…
ఇంత ఘనత ఉంది రాజమౌళిలో… గ్రాఫిక్స్ మాయా, మార్కెటింగ్ దందా, కాపీ బాగోతమా ఎవరికి కావాలి..? ఫైనల్ ప్రొడక్ట్ ఎలా ఉన్నదనేదే ప్రేక్షకుడికి కావాలి… అలా నెగ్గుకొస్తున్నాడు రాజమౌళి… చివరకు టైమ్ వాడి టాప్100 ప్రభావశీలుర జాబితాలోకి కూడా ఎక్కాడు… గుణశేఖరా..? రాజమౌళిని చూసి ఏయే వాతలు పెట్టుకోగలవో ఓసారి చెప్పగలవా..?
మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్… రాజమౌళి ఎదుగుతున్నాడే తప్ప ఎక్కడా డౌన్ కావడం లేదు… తను అదృష్టాన్ని, గ్రహచారాన్ని నమ్మడు… కానీ గ్రహాలు తనకు అద్భుతంగా అనుకూలిస్తున్నాయి… ఇప్పట్లో నేల మీదకు దిగడు… రాజమౌళిని చూసి గుణశేఖర్ మాత్రమే కాదు… చాలామంది ఆ ధోరణిలో సినిమాలు తీయబోయారు… తమిళంలో సంఘమిత్ర తరహాలో… కానీ ముందుకు వెళ్లలేకపోయారు… అంతెందుకు, జగమెరిగిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ తీస్తే, తమిళులకు తప్ప వేరేవాళ్లెవరికీ నచ్చలేదు…
మోహన్‌లాల్ ఏదో సముద్ర కథ తీశాడు… కొంతలోకొంత రాజమౌళి మార్క్ మ్యాజిక్ అందుకోగలిగింది కేజీఎఫ్… కాంతారా, చార్లి డిఫరెంట్… అవి అనూహ్య విజయాలు… ఇదే గుణశేఖర్ రాజమౌళిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని, రుద్రమదేవి తీశాడు… అప్పట్లో అది భారీ ప్రాజెక్టు… ఖర్చుకు వెనకాడలేదు… తన సొంత సినిమా… కానీ అది కోట్లకుకోట్లు ఏమీ పండించలేకపోయింది…
ఇక శాకుంతలం మొదలుపెట్టాడు… అది రాజమౌళి మార్క్ సినిమా కాదు, కానీ గుణశేఖర్ శకుంతల- దుష్యంతుల ప్రేమ కథకు అదనంగా ఏవో యుద్ధాలు గట్రా పెట్టాడు… నటనలో బేసిక్స్ తెలియని హీరోను పెట్టుకున్నాడు… బోరింగ్ ప్రజెంటేషన్ స్టోరీ… గ్రాఫిక్స్ కూడా రాజమౌళి తరహాలో కాపీ కొట్టాలనుకున్నాడు… కానీ రాజమౌళి పర్‌ఫెక్షనిస్టు అనే సంగతి గుణశేఖర్ మరిచిపోయినట్టున్నాడు… కథను పూర్తిగా వక్రీకరించైనా సరే తన సినిమాల్లో నవరసాల్ని గుమ్మరిస్తాడు రాజమౌళి… కానీ శాకుంతలం అవేమీ పండలేదు… ఫలితంగా చతికిలపడిపోయింది… బడ్జెట్ అంచనాలు మధ్యలోనే బోల్తాకొట్టి, దిల్ రాజు ఎంట్రీ ఇచ్చినా బండి పట్టాలు ఎక్కలేకపోయింది చాన్నాళ్లు… సో, గుణశేఖరా… అసూయ పడితే పడొచ్చుగానీ… మనం గాలిలో మేడలు కట్టి, వాతలు పెట్టుకోవద్దు అనేది ఈ కథలో నీతి బ్రదర్…
Share this Article