ఈమధ్య కల్వకుంట్ల కవిత ధరించే 20 లక్షల రూపాయల ఖరీదైన వాచి వార్తల్లోకి ఎక్కింది కదా… అయిదేళ్ల క్రితం ఇల్లే లేదన్న కవితకు ఏకంగా 20 లక్షల వాచి ధరించడం ఏమిటనే పొలిటికల్ విమర్శలు వచ్చాయి… అదేదో టీవీ ఇంటర్వ్యూలో ఆమె సమర్థించుకుంటూ… చెమటోడ్చి సంపాదిస్తే కొనుక్కోవచ్చు అని చెప్పిన తీరు మరిన్ని విమర్శలకు కారణమైంది… ఆమె అత్యంత నిరాడంబర జీవనశైలిని కాస్త పక్కన పెట్టేస్తే…
సేమ్, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నా మలై పెట్టుకునే వాచిపైనా ఇలాంటి విమర్శలే… ఈమధ్య డీఎంకే టాప్ నేతల సంపద ఏకంగా 1.32 లక్షల కోట్లు అంటూ డీఎంకే ఫైల్స్ పేరిట డాక్యుమెంట్స్ రిలీజ్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు కదా… ఎఐడీఎంకే నేతల్ని కూడా వదలడం లేదు… తమిళనాడు రాజకీయాల్ని కాస్త షేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు… తనపై డీఎంకే 500 కోట్ల పరువునష్టం పరిహారం కోరుతూ లీగల్ నోటీసు ఇచ్చిన విషయమూ చదివాం కదా…
తన వాచిపై విమర్శలు ఏమిటంటే… తనకు వేరే సంపాదన లేదని చెప్పుకుంటుంటాడు కదా… మరి అత్యంత ఖరీదైన వాచి ఎక్కడి నుంచి వచ్చిందనే విమర్శలు తనపై వచ్చాయి… అంతేకాదు, ముగ్గురు పీఏలు, కారు, ఆఫీసు ఎలా మెయింటెయిన్ చేస్తున్నావు అనడిగారు ప్రత్యర్థి పార్టీ నాయకులు… దానికి అన్నామలై చెన్నైలో జర్నలిస్టులకు ఇచ్చిన వివరణ కూడా ఇంట్రస్టింగుగా ఉంది… నమ్మీనమ్మనట్టుగా…
Ads
‘‘అవును, చెన్నైలోని తన పెద్ద ఆఫీసు నిర్వహణ, ముగ్గురు పీఏల జీతాలు సహా మొత్తం నెలకు 7 నుంచి 8 లక్షల ఖర్చు తప్పదు… ఒక పార్టీ అధ్యక్షుడిగా భరించకా తప్పదు… ఓ సాదాసీదా నేపథ్యం నుంచి వచ్చిన నేను అడ్డగోలు సంపదతో మూలుగుతున్న వాళ్లతో పోటీపడాలంటే సాధ్యమేనా..? నా మిత్రులు కొందరు నా ఖర్చుల్ని భరిస్తుంటారు… పార్టీ కొంత భరిస్తుంది… నెట్టుకొస్తున్నాను… నాకు ఓ ఫ్రెండ్ కారు ఇచ్చాడు… దానికి ఇంధనం ఖర్చు పార్టీ భరిస్తుంది…’’
ఇక వాచి గురించి అంటారా..? ఇది రాఫెల్ లిమిటెడ్ ఎడిషన్… కోయంబత్తూరు బేస్డ్ పరిచయస్తుడు సీహెచ్ రామకృష్ణన్ నుంచి 2021 మే నెలలో 3 లక్షలకు కొన్నాను… దీన్ని నిజానికి ఆ రామకృష్ణన్ కూడా కోయంబత్తూరులోని ప్రైవేటు రిటెయిల్ వ్యాపారి నుంచి 4.5 లక్షలకు అదే సంవత్సరం మార్చిలో కొన్నాడు… నేను 3 లక్షలు ఇచ్చినట్టు, తనకు ఆ డబ్బు ముట్టినట్టు సదరు రామకృష్ణన్ ఇచ్చిన రశీదు ఇదులో’’ అంటూ విలేకరులకు ప్రదర్శించాడు…
గత డిసెంబరులో విద్యుత్తు మంత్రి సెంథిల్ బాలాజీ ఆరోపించాడు… ‘‘సాదాసీదా కుటుంబ నేపథ్యం అంటావు, మరి ఈ ఖరీదైన వాచి ఏమిటో, ఎక్కడ కొన్నావో, రశీదులేమిటో చూపించగలవా…’’ దానికి అన్నామలై సమాధానం ఇచ్చిన తీరు చదివాం కదా… దేశంలో ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇంత ఖరీదైన, ఈ రాఫెల్ మోడల్ వాచీలు ధరిస్తున్నారుట…
‘‘రాఫెల్ ఫైటర్లు తయారు చేసే డసాల్ట్ ఏవియేషన్కంపెనీ బెల్ అండ్ రాస్ కంపెనీతో కలిసి కేవలం ఇలాంటివి 500 వాచీలు మాత్రమే తయారు చేసింది… వాచీ రాఫెల్‌ను గుర్తు చేస్తూ ఉంటుంది… దాన్ని తప్పక ధరిస్తాను… మన యుద్ధసామర్థ్యాన్ని గణనీయంగా పెంచిన ఈ రాఫెల్ వాచీ ధరిస్తే అదొక సంతోషం… పబ్లిక్ పరిశీలన కోసం నా బ్యాంకు ఖాతాల లావాదేవీలు, క్రెడిట్ కార్డుల వివరాల్ని 90 పేజీల్లో రిలీజ్ చేస్తున్నాను’’ అన్నాడు… ఆ 500 వాచీల్లో ఇతను ధరించేది 149వ వాచీ అని గతంలో చెప్పాడు, ఇప్పుడేమో 147 వది అంటున్నాడు, రామకృష్ణన్ కొన్న ఒరిజినల్ బిల్లుకూ, అన్నామలై చూపిస్తున్న రశీదులో వివరాలకూ తేడా ఉంది అంటూ డీఎంకే దీనిపై సోషల్ మీడియాలో మళ్లీ ఆరోపణలకు దిగింది…!!
రాబోయే కాలంలో జగన్ ప్యాంటు ఖరీదు, కేటీయార్ చొక్కా ఖరీదు, రేవంత్ చెప్పుల ఖరీదు, షర్మీల చీర ఖరీదు వంటివి కూడా వార్తాంశాలు అవుతాయేమో… రాజకీయ విమర్శలకు కొత్త పాయింట్లు అవుతాయేమో… ఆల్‌రెడీ మోడీ ధరించే బ్రాండ్లు, దుస్తుల ఖరీదు ఇప్పటికే వార్తల్లో అంశమే కదా…!!
Share this Article