వచ్చిన టీకాయే దిక్కు మొక్కు!
———————-
డిస్క్లెయిమర్ :: ఇది కరోనా వ్యాక్సిన్ శాస్త్రీయత, పనితీరులో కచ్చితత్వం మీద విశ్లేషణ కాదు. భక్తి- విశ్వాసాలకు సంబంధించిన అంశం…… ఇక పదండి…. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వ్యాక్సిన్ వచ్చింది. దేశమంతా ఒక ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన మంచి ముహూర్తంలో వ్యాక్సిన్ వేయడం ప్రారంభమయ్యింది. టీకాలు వేయడాన్ని హిందీలో చక్కగా “టీకాకరణ్” అని నామ్నీకరణ మాట టీకాలు పుట్టినప్పటినుండి వాడుతున్నారు. పోలియో చుక్కలు కాబట్టి తెలుగులో చక్కగా, చిక్కగా- “పోలియో చుక్కలు వేయడం” అయ్యింది. కరోనా సూది కావడంతో “వ్యాక్సినేషన్” అంటున్నారు. ఇందులో నేషన్ సగం పదానికి జాతీయ జెండా మూడు రంగులు వేయడంతో తెలుగు- ఇంగ్లిష్ కలిసిన తెంగ్లీష్ అయినా- అందులో జాతీయత తొంగి చూస్తోంది.
Ads
“టీకా వేయడం” అని సరళంగా, నేరుగా చెప్పడం కంటే వ్యాక్సినేషన్ అన్న ఇంగ్లీషు పారిభాషిక పదమే మనకు సహజంగా గొప్పదిగా తోస్తుంది.
“Injecting hope” అని టీకాలు మొదలు పెట్టడం మీద టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక బ్యానర్ ఐటెంకు గొప్ప హెడ్డింగ్ పెట్టింది. ఒక్కో భాషకు ఒక్కో సొంతమయిన, అందమయిన వ్యక్తీకరణ ఉంటుంది. తెలుగుకు కూడా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు తెలుగును ఇంగ్లీషులో అన్వేషించి పట్టుకుంటే కచ్చితంగా దొరుకుతుంది. అయినా- మన చర్చ భాష గురించి కాదు. భక్తి భావం గురించి. హిందూ సంప్రదాయంలో ఏ మంచి పనైనా ఒకసారి దేవుడిని తలచుకుని మొదలుపెట్టడం ఆచారం. శుభం పలకరా పెళ్లి కొడకా! అంటే….అన్నట్లు అశుభం మాట వినపడకూడదు. మంచి జరగాలని కోరుకుంటూ, అలా మంచి జరగడానికి దైవం అనుకూలించాలని ప్రార్థించడం మంచిదే.
కరోనా వాక్సిన్ అతిశీతల కంటైనర్ కార్గోలు విమానాశ్రయాలకు బయలుదేరే ముందు లారీల ముందు కొబ్బరికాయలు కొట్టారు. పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టారు. పూల హారాలు కట్టారు. మామిడి రెమ్మలు కుడి ఎడమల గుచ్చారు. పూలు చల్లారు. గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి మూడుసార్లు సవ్యదిశలో, మూడుసార్లు అపసవ్యదిశలో హారతి తిప్పి నేలకేసి కొట్టి దిష్టి తీశారు. విమానాల్లో నుండి దించుకున్న థెర్మో కూల్ పెట్టెలను తెరిచే ముందు వ్యాక్సిన్ పెట్టెలకు భయ భక్తులతో మళ్లీ నమస్కారం చేశారు. శాస్త్రీయంగా ముందు ముత్తైదువులు పూజ చేశాకే వ్యాక్సిన్ బాటిళ్లు బయటికి తీశారు.
శ్రీహరికోటలో అత్యాధునిక మానవనిర్మిత ఉపగ్రహాన్ని గ్రహాల మధ్య అంతరిక్షంలోకి పంపే ముందు- విధిగా సూళ్లూరుపేట చెంగాళమ్మ తల్లికి, ఏడుకొండల వెంకన్నకు పూజలు చేయడాన్ని కూడా తప్పుపట్టాల్సిన పనిలేదు. ఉన్న బలానికి ఏదో ఒక నమ్మకం తోడయితేనే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ అవసరం. అన్ని ప్రయివేట్ పెద్దాసుపత్రుల గేటు పక్కన లేదా రిసెప్షన్లో దేవుడి విగ్రహం, వీలయితే చిన్న గుడి గోపురం ఉంటాయి. ఇందులో భక్తి, వేదాంతం, దేవుడే దిక్కు అన్న నిత్య సత్య స్ఫూర్తి ఇంకా ఎన్నెన్నో అంతరార్థాలు దాగి ఉన్నాయి. డిస్ ఛార్జ్ అయి వెళ్లే రోగులు కొబ్బరికాయ కొట్టి వెనక్కుతిరిగి చూడకుండా వెళుతుంటారు. లోపలికి వెళ్లేవారు- త్వరగా బయటికి వెళ్లేలా ఆశీర్వదించు స్వామీ! అని ప్రార్థిస్తుంటారు. అందుకే సినిమాల్లో డాక్టర్ల రొటీన్ డైలాగ్- ……. “మా ప్రయత్నం మేము చేశాం- ఇక దేవుడే దిక్కు”. నిజమే. సాధారణంగా దిక్కులేనివారికి దేవుడే దిక్కు. దిక్కులు పిక్కటిల్లేలా కరోనా ప్రపంచాన్ని దెబ్బకొట్టినవేళ జనానికి దిక్కు తోచడం లేదు. దిగ్భ్రమలో ఉన్నారు. అన్ని దిక్కులూ మూతపడి దిక్కులు చూడకుండా ఇళ్లల్లోనే పడి ఉన్నారు. మందూమాకూ ఏ దిక్కూ లేనివారై ఉన్నారు. ఇలాంటి వేళ అక్షరాలా దేవుడే దిక్కు… వచ్చిన వ్యాక్సిన్ ఒక్కటే దిక్కుమొక్కు………….. By…… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article