ఏమాటకామాట… ఒక్క నిజాన్ని అంగీకరించాలి… ఏపీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా సరే మార్గదర్శి మీద జనంలో కోపం, అసహనం ఏమీ రావడం లేదు… రామోజీరావు మీద ప్రజల్లో ఉన్న విశ్వాసం అది… ఆ క్రెడిబులిటీ గట్టిగా ఉంది కాబట్టే… గతంలో మార్గదర్శి ఫైనాన్స్ మీద వైఎస్ పన్నాగాలను కూడా చూశారు కాబట్టే జగన్ చిట్‌ఫండ్స్ మీద పడితే… అదంతా రాజకీయమే అని నమ్ముతున్నారు అందరూ… వై ఓన్లీ మార్గదర్శి..? ఈ ప్రశ్నకు జగన్ ప్రభుత్వం వద్ద ఫెయిర్, స్ట్రెయిట్ జవాబు లేదు…
అయితే వర్తమాన రాజకీయాల్లో ఈ మథనం ఉండదు… ప్రత్యేకించి ఏపీ రాజకీయాలు ఎప్పుడో కలుషితమై, పాతాళ స్థాయిలో కొట్టుకుంటున్నాయి… జగన్‌ను జైలుకు పంపి ఈనాడు, చంద్రబాబు, కాంగ్రెస్ ఎట్సెట్రా పండుగ చేసుకోగా… ఆ నాలుగు గోడల నడుమ రాటుదేలి, తనకు టైమ్ వచ్చింది కదా, ఇక తన ఆట మొదలుపెట్టాడు జగన్… మొదట్లో ఈనాడు పట్ల కాస్త మర్యాద కనబరిచినా సరే, ఈనాడు మారదు, మారలేదు… జగన్‌కు ఇక వేరే మార్గం లేదు… కొరడా తీశాడు…
ఆడిటర్లు, లాయర్లు, టీడీపీ చిన్న స్థాయి లీడర్లు గట్రా మార్గదర్శికి మద్దతుగా ఏం చెప్పినా సరే, రిపోర్టర్లు చెప్పించి రాసిన వార్తలను కాలాల కొద్దీ పబ్లిష్ చేసుకున్న ఈనాడు నిన్న, మొన్న తగ్గింది… సంతోషం… తన సొంత పత్రిక కాబట్టి రామోజీరావు పేజీల కొద్దీ నింపుతున్నాడు… తనకు మద్దతుగా నిలిచిన వాళ్ల స్థాయి కూడా చూడటం లేదు… నిజానికి అది అవసరం లేదు… మార్గదర్శి మీద దాడులు రాజకీయ ప్రేరేపితాలని మామూలు జనం కూడా భావిస్తున్నారు…
Ads
వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసు గట్రా జగన్ ఇప్పుడు అవి కడుక్కునే పనిలోనే తలమునకలై ఉన్నాడు కాబట్టి, మార్గదర్శి మీద దృష్టి కాస్త సడలినట్టుంది… లేకపోతే ఇంకాస్త నట్లు బిగించేవాడు… ఈనాడు మీద, ఐమీన్ మార్గదర్శి మీద సీఐడీ కేసులతో వైసీపీ శ్రేణులు ఆనందపడితే… కోడి కత్తి కేసులో ఎన్ఐఏ, వివేకా హత్య కేసులో సీబీఐ జగన్‌కు ఊపిరాడనివ్వడం లేదు… ఇది పచ్చ శిబిరానికి ఆనందంగా ఉంది… అందరికీ అర్థం కానిది ఏమిటంటే… జగన్ సర్వవిధాలా మోడీషాలకు దాసోహం అంటున్నా సరే, జగన్ పట్ల అంత పెద్ద సానుకూలత వాళ్ల నుంచి ఎందుకు కనిపించడం లేదు..?
సరే, ఈ చర్చను కాసేపు పక్కన పెడితే… నిజంగా రామోజీరావు ఎప్పుడూ కోర్టు బోనులో నిలబడలేదా..? మార్గదర్శి కేసు నేపథ్యంలో పలువురు సోషల్ మీడియాలో కొన్ని పాత విషయాలు షేర్ చేసుకుంటున్నారు… ఒకటి ఆసక్తికరంగా అనిపించింది… Yamana Gopalakrishna చెబుతున్నది ఏమిటంటే…
వట్టి వసంత కుమార్ గారి నాన్నగారు, వట్టి వెంకట పార్థసారథి గారు డీసీసీబీ ప్రెసిడెంట్ గా చేసే టైంలో భారీ అవినీతి జరిగిందని ఈనాడులో ఫుల్ పేజీ ఆర్టికల్స్ రాసేశారు… నిజాయితీగా ఉండే ఆ పార్థసారథి గారికి ఒళ్ళు మండి అప్పటికప్పుడు గవర్నమెంట్ ఆడిట్ చేయించుకుని, అందులో ఏం అవకతవకలు జరగలేదని సర్టిఫై చేయించుకుని, తాడేపల్లి గూడెం కోర్టులో పరువు నష్టం దావా వేశారు…
అప్పట్లో తాడేపల్లిగూడెంలో ఒక పవర్ పుల్ జడ్జి గారు, వార్త రాసిన విలేఖరి నుంచి ఎడిటర్ ఇన్ చీఫ్ రామోజీరావు గారి దాకా అందరూ హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు… ఆ వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకోవాలని రకరకాలుగా ప్రయత్నించారు కానీ కుదర్లేదు.. చివరికి ఒక రోజు గన్నవరం విమానాశ్రయం దాకా స్పెషల్ ప్లైట్లో వచ్చి అక్కడ నుంచి బెంజ్ కారులో తాడేపల్లిగూడెం కోర్టుకి వచ్చి, జడ్జి గారి ముందు చేతులు కట్టుకుని నుంచుని, నమస్కారం చేశారు…
రామోజీరావు గారికి తాడేపల్లిగూడెం AJFCM court లో 2 సం. లు jail శిక్ష మరియు fine వేశారు. తదుపరి జిల్లా కోర్టులో case కొట్టి వేసినారు. పార్థసారథి గారు చాలా పట్టుదలతో కేసు వేసి 7 సం. లు కోర్టుకు తిరిగి శిక్ష పడే వరకు పోరాడినారు…
ఇదే వార్తకు మరో మిత్రుడు (పేరు దొరకలేదు…) ఇంకాస్త యాడ్ చేశాడు ఇలా… ‘‘ఆరోజు రిపోర్టింగ్ కు వెళ్ళి విజిటర్స్ కోసం వేసిన బెంచిపై కూచుని మొత్తం వ్యవహారాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షిని… కోర్టుకు హాజరవుతున్న రామోజీ రావు గారిని ఫోటో తీయనీయకుండా ఈనాడు సిబ్బంది గొడుగుతో ఆయన ముఖాన్ని కవర్ చేశారు. ఆయన చుట్టూ వాళ్ళే పెద్దసంఖ్యలో చుట్టుముట్టి ఎవర్నీ ఎదురు రానీయకుండా తోసేశారు.
కోర్టు హాలులో ఆయన నేరుగా బెంచి ముందుకు వెళ్ళి నిలబడితే మేజస్ట్రేట్ గారు రామోజీ గారి న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ నిలబడాలో మీ క్లయింట్ కి చెప్పండి అని మేజిస్ట్రేట్ న్యాయవాదితో గట్టిగా చెప్పారు. అప్పుడు ముద్దాయిలు నిలబడే చోటులో రామోజీ నిలబడ్డారు.
ఆ మేజిస్ట్రేట్ గారి పేరు జనమంచి సాంబశివ్. ఆయన కాలినడకన కోర్టుకు వచ్చేవారు. ఫైళ్ళున్న రేకు బాక్స్ ను అటెండర్ సైకిల్ వెనుక క్యారేజీపై పెట్టుకుని ఆయన వెనుక నడిచి వెళ్ళేవాడు. ఆ రోజుల్లో తాడేపల్లిగూడెంలో నిత్యం కనిపించే ఒక సాధారణ దృశ్యం అది…
Share this Article