Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శాకుంతలం ఎందుకు బాలేదు..? గుణశేఖర్ కూడా చదవాల్సిన పర్‌ఫెక్ట్ రివ్యూ..!!

April 18, 2023 by M S R

Priyadarshini Krishna………..  రాద్దాం రాద్దాం అనుకుంటూనే పనులతో తీరికలేక టైం గడిచిపోయింది…. ఇప్పటికైనా రాద్దామావద్దా అని అనుకుంటుండగా కొందరు మిత్రుల సలహా మేరకు రాయడం మొదలెట్టాను…. ఇంతకీ దేని గురించి అనేది మీకు ఈపాటికే అర్థమైయుంటుంది….

మనలో చాలామందికి ఈ కథ ఇదివరకే తెలుసు సాహిత్యాభిరుచులున్న వారికి మహాకవి కాళిదాసు రాసినది ఇంకా గుర్తుండే వుంటుంది….
ఇతిహాసాలు గానీ పురాణాలు గానీ చరిత్ర గాని తెరకెక్కించాలంటే పూర్తి రిసర్చ్ అవసరం…. లేకుంటే ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతినే అవకాశాలు మెండు.

ఇప్పటి న్యూ ఏజ్‌ డైరెక్టర్స్ కి ఇవేమీ పట్టవనుకుంటాను. ఎందుకంటే వారి టార్గెట్‌ ఆడియన్స్ ఇరవై పాతికేళ్ళలోపు వుండే ప్రేక్షకులే….! కాబట్టి వారికి ఈ ఇతిహాస పురాణ చరిత్రలు తెలిసే అవకాశం లేదు, కాబట్టి మనం ఆడిందే ఆట అనే కంక్లూజన్‌కి వచ్చి ఆవిధంగా ముందుకు పోతున్నారు.

Ads

లేకపోయుంటే, ప్రతిప్రేక్షకునికి ఎంతోకొంత నాలెడ్జ్ వుంటుంది కాబట్టి జాగ్రత్తగా తెరకెక్కించాలి అనుకుని మన పాతతరం దర్శకుల్లాగా హృద్యంగా తీసేవారు…. నలభై ఏళ్ళ క్రితం తీసిన టీవీ సీరీస్‌ రామాయణ్, మహాభారత్‌, విక్రమ్‌ఔర్‌బేతాళ్, చంద్రగుప్త వంటివి ఇప్పటికీ అంత జనాధారణ పొందడాన్ని ఎలా చూడాలి… ? ఇప్పటికీ పిల్లలు పెద్దలు వీటిని వీక్షిస్తున్నారంటే ఇంక వేరే సాక్ష్యాలు అనవసరం….

ఎన్టీఆర్‌ దాసరి పోటాపోటీగా తీసిన ‌ విశ్వామిత్ర కథ (రెండూ ఫ్లాపయ్యాయనుకోండి) లో చాలా బ్రీఫ్ గా వచ్చే శకుంతల దుష్యంతుల కథ సైతం ఎంతో హృద్యంగా వుంటుంది…. సరే, ఉపోద్ఘాతం ఆపి అసలు టాపిక్‌లోకి వస్తాను…

గుణశేఖర్‌ ఏంతో శ్రమకోర్చి దర్శకత్వం చేసి నిర్మించిన ‘శాకుంతలం’ కూడా ఓవర్‌హైప్‌కి బలైన సినిమా అని చెప్పవచ్చు… ఇంత హైప్‌ ఉండకపోతే ఈమాత్రమైనా చూడరు అనే వాదన కరెక్టు కాదు…

ఈ సినిమా మొత్తంలో ముచ్చటగా మూడేమూడు అంశాలు బాగున్నాయి….
మొదటిది – డైలాగ్స్
రెండు – దుష్యంతుడు భరతుడు
మూడు- ఆర్ట్ వర్క్

కథాకథనం:

కథ మనకు తెలిసినదే ఐనా కూడా కల్పిత సీన్లు, సగటు కమర్షియల్‌ హీరోని ఎలివేట్‌ చేసే సీన్ల వల్ల ఈ కథాకథనం రొడ్డకొట్టుడై పోయింది…. శకుంతల కథలో శకుంతలే హీరో…. దుష్యంతుణ్ణి ఎలివేట్‌ చెయ్యడం వల్ల అద్భుతమైన ప్రేమకథ/ స్త్రీ ఆత్మగౌరవానికి ప్రతీకైన కథ చచ్చుబడిపోయింది…

మనకు తెలిసిన శకుంతలతోనే మనం ఎక్కడ కూడా సహానుభూతి కాదుకదా కనీసం సానుభూతికూడా పొందము… దుర్వాసుడు ఒకానొక శపించే సీనులో ‘అప్సరకు ఋషికీ కలిగిన సంతానానికి సంస్కారం ఎలా అబ్బుతుంది’ అన్నట్లుగానే మనకు కూడా చిరాకు కలుగుతుంది తప్ప అయ్యో అనిపించదు.

ఇలాంటి సీన్లు కోకొల్లలు… ఐతే, మహాకవి కాళిదాసుని ‘అభిజ్ఞాన శాకుంతలం’లో కణ్వమహర్షి తను ఎంతో ముద్దుగా పెంచి పెద్దచేసిన కుమార్తెను మెట్టినింటికి పంపేటప్పటి ఒక సగటు తండ్రి పడే వేదన ఎంత హత్తుకునేలాగ వుండి చాలా కాలం వరకు మన మనసు నుండి పోదు… అలాగే శకుంతల తన సఖులు, స్నేహితులైన పశుపక్ష్యాదుల నుండి వీడ్కోలు తీసుకునే సన్నివేశం కూడా చాలాకాలం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది… కానీ, ఈ సినిమాలో మాత్రం ఆ సీన్లను గురించి ఎంత తక్కవ మాట్లాడుకుంటే అంత మంచిది.

డైలాగ్స్ :

ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్‌ ఏదైనా వుంది అంటే అది డైలాగ్సే…. సాయిమాధవ్‌ బుర్రా డైలాగ్స్ సముచితంగా సందర్బోచితంగా హత్తుకునేలా ఉన్నాయి… పాత్రల స్థాయిని బట్టి భాషను యాసను ప్రయోగించారు…శకుంతల సఖుల ద్వారా ప్రేక్షకులకు తెలియజేయాల్సిన వివరాలను చెప్పించేటప్పటి సంభాషణలు, భరతుని తన తండ్రి తోటి సంవాదము కూడా చక్కగా వున్నాయి.

శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకున్న విషయాన్ని కణ్వమహర్షికి తెలపాల్సిన సందర్బం మాత్రం ఈ సినిమాలో చాలా నీచంగా చిత్రీకరించారు. ఒక ఆడపిల్ల అందునా ప్రపంచమే తెలియకుండా అపురూపంగా పెరిగిన ముగ్ధ తన తండ్రితో (పెంపుడు తండ్రైనా కానీ) తాను మనసుపడిన విషయం ముఖాముఖిగా చెప్పడమే పెద్ద సాహసం, అందునా గాంధర్వవివాహమాడిన సంగతి చెప్పడమంటే ఆ అమ్మాయికో అగ్నిపరీక్ష….

ఈ సినిమాలో ఏకంగా ‘మేము శారీరకంగా కూడా కలిసాము’ అనే విషయం నిస్సిగ్గుగా ఎటువంటి బెరుకు లేకుండా చెబుతుంది… దానికి మన ‘గుణ’కణ్వుడు చాలా ఈజీగా ఎలాంటి ఉద్వేగం లేకుండా (రీడ్‌ నటశూన్యంగా) నాకన్నీతెలుసు, స్క్రిప్టులో కూడా అదే వుంది అన్నట్లుగా ఫ్యూచర్‌ ప్రెడిక్ట్ చేస్తాడు.

ఈ సీనులోని డైలాగ్స్ కూడా పేలవంగా వున్నాయి. కొన్నిచోట్ల కొన్నికొన్ని మెరుపులున్నాయి గానీ అవి మనకు ఆనవు…!

కాస్టింగ్‌:

ఈ సినిమాలో wrong casting మాత్రమేకాదు very bad casting కూడా…. కణ్వ మహర్షి అనగానే మన మనసుల్లో ఒక రూపం మెదులుతుంది… శాంతస్వభావానికి నిలువెత్తు రూపం, హూందాతనానికి జ్ఞానానికి రూపం ప్రతీ పలుకులో తేనెలూరుతూ లాలనగా, అనురాగంగా మాట్లాడేటువంటి రూపం మెదులుతుంది. కొండొకచో ఒక నాగయ్య గారు ఒక గుమ్మడి గారు మన మైండ్‌లో మెదులుతారు. అలాంటి పాత్రకు సాంఘిక పాత్రలను దీటుగా చేస్తాడని సచిన్‌ కేడెకార్‌ ని తీసుకోవడంతో మొదలైన తప్పిదం శకుంతల పాత్రకి సమంతని తీసుకోడం దగ్గర ఆగింది… మొత్తం సినిమాలో చాలా ఆప్ట్ సెలెక్షన్‌ ఏదైనా వుందంటే అది దుర్వాసునిగా మోహనబాబు, దుష్యంతునిగా దేవ్‌ భరతునిగా అర్హ !

మేనకగా మధుబాలను తీసుకోడం సాహసం అనుకున్నాడు డైరెక్టర్‌… కానీ అది కామెడీగా వుంది. దేవనర్తకి జరామరణాలు లేని మేనక పాత్రకి సరిగ్గా ఆపోజిట్‌ లక్షణాల ఆర్టిస్ట్ ని ఎంచుకున్నారు…. అతితోక సుందరికి బదులు వయసుడిగిన, ఏమాత్రం డాన్స్ రాని మధుబాలను ఎందుకు తీసుకున్నారో డైరెక్టరుకే ఎరుక. ఇక సమంత గురించి మాట్లాడుకోకపోడం అత్యంత ఉత్తమం.

సినిమాటోగ్రఫీ:

తియ్యడానికేముందిగనక సీజీ కీయింగ్‌కి సరిపడేలా వర్క్ చేస్తే చాలు అన్నట్లుంది. పాటల్లో దర్శనమిచ్చే కాశ్మీరు అందాలు మన ఫిల్మ్ సిటీయేగా అని తెలిసేలా తియ్యడం గొప్పదనం. శృంగారరస సీన్లలోను దుఖఃభరిత సీన్లలోనూ అదే డిమ్‌ లైటింగ్‌… అదే న్యూ ఏజ్‌ లైటింగ్‌!

సంగీతం:

సినిమా చూస్తున్నప్పుడేకాదు ఇంటికొచ్చాకకూడా చిన్న బిట్‌ కూడా గుర్తుండనంత గొప్పగా చేసారు background score and songs. సీన్ల ఎలివేషన్‌ గానీ మూడ్‌ ఎలివేషన్‌‌ గానీ ఏమాత్రం పట్టించుకోలేదు. యుద్ధపు సీన్లలో కూడా ఆల్రెడీ కొట్టి పెట్టెలో పెట్టినవే తెచ్చి అతికించారన్నట్లున్నాయి.

పాటలు:

డ్యూయెట్‌ గా వచ్చిన పాట, ఎడబాటులో ఎదురు చూపులతో పాడే పాట వరకు బాగున్నాయి. శకుంతలని దుష్యంతుని దగ్గరకు తీసుకెళ్ళేప్పటి పాట ‘ఏలో నావ…’ లో ఇప్పటి భాషను భలే కలిపికొట్టారు శ్రీమణి… ఆఁ యేముందిలే పడవపాటేగా, భాషను ఎవరు పట్టించుకుంటారు అని ‘తుఫాను’ లాంటి పదాలను వాడేసారు… అవార్డొచ్చేదా లేక అంత జ్ఞానమున్న ప్రేక్షకులు ఇప్పుడున్నారా అనుకున్నారు…!

ఆర్ట్ :

ఎంత సీజీవర్క్ ఐనా కొన్ని సెట్లు కూడా అవసరమే…. అందుకే ఆర్ట్ డిపార్ట్మెంటుకు కూడా పని దొరికింది… కోటలు, సభలు మంటపాలు , ఆశ్రమాలు, సరస్సులు, ఉద్యానవనాలు అన్నీ బాగున్నాయి… కానీ పాత సినిమాల్లో స్టూడియో సెట్‌లో పాటల చిత్రీకరణని మరోసారి గుర్తు చేసారు.
ఇంత టెక్నాలజీ ఇంత ఫెసిలిటీలు వచ్చినా కూడా నిజమైన కాశ్మీరు మంచులో పాటలు తీసివుంటే ఇంకా బాగుండేది. నావను బాగా తయారు చేసారు. కన్వాశ్రమం సెట్‌ కూడా బాగుంది.

సీజీ వర్క్ :

కాస్టింగ్‌ తర్వాత అంతకంత చెత్తగా వున్నది ఈ సీజీ వర్కే… ట్రైలరప్పుడే జనాలు హాహాకారాలు చేసి కుతూహలాన్ని చంపేసారు. పాతకాలం టీవీ సీరీస్‌లో కూడా ఇంత అమెచ్యూరిష్ గా లేదు. ఇంతకంటే ఎక్కువ రాయడం సబబు కాదు.

కాస్ట్యూమ్స్ :

మన చిన్నప్పటి నీతా లుల్లాతోనే కాస్ట్యూములు చేయించడం మరొక బ్లండర్‌…. ఋషి కన్యకు కూడా జగదేక శ్రీదేవికి వేసినట్లుగానే సెమీ బికినీ వెయ్యడంతోనే సగం ఎంపథీ పోయింది. మరీ ముఖ్యంగా పాటల్లో జలతారు (ఇంచుమించు దేవతావస్త్రాల) వంటి సెమీ బికినీ వేసి మనసు ముక్కలు చేసారు. దుష్యంతునికి కూడా పద్ధతి పాడు లేకుండా అసందర్భపు కాస్ట్యూములు వేసారు… మిగతా పాత్రలకు డిజైనర్‌ లుల్లా వెయ్యలేదు కాబట్టి చాలా బాగున్నాయి.

కొరియో గ్రాఫీ :

దీని గురించి నాలుగైదు ఠావులు రాయాలనుంది గానీ, అయిపోయిన పెళ్ళికి బాజాలెందుకని మూడుముక్కలు రాస్తా…. లాలిత్యానికి, హొయలుకు, అణకువకు, సౌందర్యానికి ప్రతిరూపమైన శకుంతల ఇందులో పాటలు రాగానే క్యాబరే డాన్సులు చేస్తుంది. ఊ… అంటే వెనక్కు తిరిగి జఘనాలు ఊపుతుంది…. ఉఊ అంటే ముందుకు తిరిగి చేతులెత్తి బాహుమూలాలు ప్రదర్శించి వక్షాలను ఊపుతుంది… అదే గుణశేఖరుని శకుంతల… చీప్ టేస్ట్…

ముగింపు : 

దాదాపు వందేళ్ళగా తెరకెక్కుతూ వున్న ఈ కథని ప్రతి డైరెక్టరు తనదైన శైళిలో తనదైన భావుకతతో తనదైన దృక్కోణంలో ప్రజెంట్‌ చేసాడు. కానీ వారందరినీ మనోడు తలదన్నాడు. సతీ సీత, కుంతి, మాద్రి, గాంధారి, ద్రౌపది, రుక్మిణి, సత్యభామ మొదలు వరూధిని వరకూ అన్ని స్త్రీ పాత్రలూ ఉదాత్తమైనవి ధీరోదత్తమైనవిగానే కవులు సృష్టించారు. ఎంతో గొప్ప ఆత్మాభిమానము కలిగిన స్త్రీలు క్లిష్టసమయాల్లో తమ బేలతనాన్ని గానీ తమలోని గూడుకట్టుకున్న దుఖఃన్నిగానీ పదిమందిలో ప్రదర్శించరు.

తాము వంటరిగా ఉన్నప్పుడు రెండు కన్నీటిబొట్లు జారవిడిచి తను ఎలా ఎదురీదాలో నిర్ణయించుకుంటారు. సతి గానీ సీత గానీ తామెంతటి అభిమానవతులో లోకానికి చాటిచెప్పారు. కాళిదాసుని శకుంతల కూడా అంతటి అభిమానవతే…. పైన పేర్కొన్నవారెవరికీ తీసిపోని ధీరశాలి. వంటరిగా బిడ్డను సాకి ఒక కొత్త శకానికి నాంది పల్కగల సంట్టును తయారు చేసింది…

కానీ మన ‘గుణ’శకుంతల మాత్రం మాటొస్తే ముక్కుచీది బేలతనాన్ని ప్రదర్శిస్తుంది. ప్రియుడు అడగ్గనే రెడీ ఐపోతుంది, క్లైమాక్స్‌లో కూడా రాజు వచ్చి అడగగానే ‘అబ్బ…అడిగాడు… త్వరగా రడీ ఐపోవాలి… లేకుంటే మనసు మార్చుకుంటాడు…’ అన్నట్లు టింగుమని తయారైపోతుంది….
హేవిటో….!!

ఇన్ని నెగెటివ్‌లు ఉన్న ఈ సినిమాలో మిగిలిన డిపార్టుమెంటులను ప్రస్తావించడానికి మనసు రావడం లేదు…. మొత్తం మీద గుణశేఖరుని శాకుంతలం is a wasted effort !!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions