Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గుండు కుభేరుడు కూడా చెప్పేశాడు… అక్షయ తృతీయమే అద్వితీయమట…

April 20, 2023 by M S R

Lakshmi & Kubera: అక్షయ తృతీయరోజు విష్ణువును, ప్రత్యేకించి లక్ష్మీ దేవిని పూజిస్తే అక్షయమయిన సిరిసంపదలు వచ్చి మన నట్టింట్లో పడతాయని ఒక నమ్మకం. మంచిదే.

లలితా నున్నటి గుండాయన డబ్బులెవరికీ ఊరికే రావు అని అంటాడు కానీ– అక్షయ తృతీయ రోజు పూజ చేస్తే కనకధార కురుస్తుందంటే కాదనాల్సిన పనిలేదు. అక్షయ తృతీయ రోజు ఏ దేవుడిని పూజించినా తరగని సంపద వస్తుందనేది ఇంకొంచెం బ్రాడర్ భక్తి సూత్రంగా ప్రచారంలో పెట్టారు. ఇదీ మంచిదే. అక్షయ తృతీయ వైశిష్ట్యం గురించి అసలు పురాణాల్లో ఎక్కడా లేదని మనం బాధపడాల్సిన పని లేదు. నగల దుకాణాల వారు రాసిన ఆధునిక పురాణాల నిండా అన్ని పర్వాల్లో లక్షణమయిన తృతీయ ఎప్పటికీ క్షయం కాకుండా అక్షయంగా ఉంది.

అక్షయ తృతీయ రోజు హీన పక్షం  గుమ్మడికాయంత బంగారం కొంటే- ఇక వచ్చే అక్షయ తృతీయ వరకు మన గుమ్మాల్లో బంగారం గుమ్మెత్తిపోయేలా విరగకాస్తుంటే మనం వాటిని దాచుకోవడానికి లాకర్లు చాలక పిచ్చెక్కిపోవాలి. అందునా అక్షయ తృతీయ రోజు ఉదయమే బ్రహ్మీ ముహూర్తంలో మూడున్నరకు లేచి చన్నీళ్ళ స్నానం చేసి ఆ తడి బట్టలతోనే బంగారం షాపుకెళ్లి కూరగాయల్లా సంచిలో బంగారం వేసుకుని సూర్యుడి తూరుపు కిరణాలు మన ముంగిట్లో పడేవేళకు సంచిలో బంగారాన్ని గుమ్మం మీద కుమ్మరిస్తే- ఇక లక్ష్మీ దేవి అవస్థ చూడాలి. ఇంట్లో నుండి వెళ్ళమన్నా వెళ్లలేక మనింట్లోనే ఉండిపోతానని మన కాళ్ళా వేళ్ళా పడుతూ ఉంటుంది. గుమ్మం అవతల ఆమె భర్త శ్రీ మహా విష్ణువు ప్లీజ్ ప్లీజ్ …మా ఆవిడను మా వైకుంఠానికి పంపండి అని మన గుమ్మం పట్టుకుని వేలాడుతూ ఉంటాడు.

Ads

ఏ శాస్త్రంలో, ఏ పురాణంలో ఎక్కడా ఎవరూ చెప్పకపోయినా- అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం ఒక అంటువ్యాధిలా ప్రబలింది. నిజానికి అక్షయ తృతీయ అంతో ఇంతో ఉత్తర భారతీయులు జరుపుకునే పండుగ.

టీవీ సీరియళ్లు వచ్చాక పిండిపట్టే జల్లెడపెట్టి భర్తను- చంద్రుడిని మార్చి మార్చి చూసే కర్వా చౌత్ ను మనం అర్థం చేసుకుంటున్నాం. ఆనందిస్తున్నాం. వీలయితే మనం కూడా భర్త మొహాన జల్లెడ కొడుతున్నాం. అలాగే అక్షయ తృతీయ కూడా. ఒకప్పుడు కేవలం బంగారం వ్యాపారం చేసుకునే వారికి పరిమితమయిన ఈ పండగ ఇప్పుడు సార్వ జనీనమై- అప్పు చేసి అయినా బంగారం కొనాలన్నంత మాస్ హిస్టీరియాగా మారింది. ఇందులో నగల దుకాణాల మార్కెటింగ్ టెక్నిక్కులు కూడా ఫలించాయి.

బంగారం మీద మన మోజు ఈనాటిది కాదు. యుగాలది. బంగారం లాంటి మనిషి. బంగారు కొండ. బంగారు కుటుంబం. నీ ఇల్లు బంగారం కాను. సువర్ణాక్షరాలతో లిఖించడం. ఒళ్ళంతా బంగారం. బంగారు పంజరం. స్వర్ణాభరణాలు. బంగారు తూగుటుయ్యాల. బంగారు గోపురం. పలుకే బంగారం. స్వర్ణ సింహాసనం. స్వర్ణ వర్ణం. బంగారానికి తావి అబ్బినట్లు. మెరిసేదంతా బంగారం కాదు. బంగారం పండే భూమి. బంగారంలాటి పంట. ఇలా మన బతుకంతా బంగారు మాయం. భాషంతా బంగారుమయం. మన బంగారం మంచిదయితే కదా … ఇతరులను అనడానికి?

ఆ వీక్ నెస్ మీద బంగారం షాపుల వాళ్లు అక్షయ తృతీయ సెంటిమెంటును ఆయింట్ మెంటుగా పూసి బంగారు వల విసిరారు. మనం ఆ బంగారు వలలో చిక్కున్నాం.

అదిగో…
లలితా గుండాయన అక్షయ తృతీయ “కుభేర లక్ష్మీ పూజ” చేశాడట. ఆ వీడియోను చూడమని మొదటి పేజీ ప్రకటనలో పిలుస్తున్నాడు. బహుశా యాడ్ కమ్ ప్రోగ్రాంలా…ఒక దెబ్బకు రెండు అక్షయ బంగారు పిట్టలు పట్టే ఐడియాలా ఉంది.

కుబేరుడంటేనే గీసి గీసి బేరాలాడేవాడు (కుత్సితం బేరః) అని ఒక అర్థం.  చూడ్డానికి వికారంగా ఉన్నవాడు అని మరో అర్థం. అరణ్యవాసంలో సీతమ్మ తల్లి కూడా అక్షయ తృతీయ రోజే బంగారు లేడిని తెమ్మని శ్రీరాముడిని అడిగిందేమో ఎవరైనా ప్రవచనకారులు చెప్పాలి!

కుబేరుడికయినా లక్ష్మీ దేవే డబ్బులివ్వాలి. ఇక్కడ కుబేర లక్ష్మి మాటలను కలిపేయడంతో…ఈ పూజ చేస్తే నిరుపేద లక్ష్మికే కుబేరుడు డబ్బులిస్తాడు. అలాంటిది ఈ వీడియో చూస్తే…ఆ కుబేరుడు మనక్కూడా డబ్బులివ్వకపోడు అని అనుకుంటారు. అందులో కుబేరుడికి, లక్ష్మికి విడి విడిగా పూజ ఉంటుంది. మంత్ర శాస్త్రం తెలియనివాడెవడో ఈ మాటను కాయిన్ చేసినట్లున్నాడు. అందుకే ఆగమ శాస్త్రం దాన్ని “శ్రీ లక్ష్మీ కుబేర పూజా విధానం” అని స్పష్టంగా ముందు లక్ష్మికే ప్రాధాన్యం ఇచ్చి తరువాత కుబేరుడిని ప్రస్తావించింది.

అక్షయ తృతీయ రోజు బ్యాంకు కౌంటర్లో కూర్చున్న క్యాషియర్ కుబేరుడికి పూజ చేసి…
లక్ష్మీదేవి డబ్బులెందుకు ఇవ్వడం లేదని విష్ణువును నిలదీసే మన భక్తికి లలితా తరుగులేని ఆభరణాలే తిరుగులేని తోడు!

అన్నట్లు-
ఈ మాటలో కుబేరుడికి భాషలో లేని ఒత్తు పెట్టి “కుభేరలక్ష్మి” చేశారు. భాషాలక్ష్మి బాధ పడితే…అష్ట లక్ష్ములు సంతోషిస్తారా?

లేక లక్ష్మి ఉన్నచోట సరస్వతి ఉండదు – సరస్వతి ఉన్నచోట లక్ష్మి ఉండదు అన్న నానుడిని నిజం చేయడానికి తెలిసి తెలిసి కుబేరుడికి అక్షర దోషం అంటకట్టారా?

మన భావ  దారిద్ర్యమే అన్ని దరిద్రాలకు మూలం. ఎందరు “కుభేరులు” కట్టగట్టకుని వచ్చినా తరగని అక్షయమయిన అద్వితీయమయిన “తృతీయ” సంపద అది!

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

సిరి తా వచ్చిన వచ్చును…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బీసీ రిజర్వేషన్లు… క్రెడిట్ రేవంత్‌రెడ్డిది… ఎవరెవరో హైజాక్ ప్రయత్నాలు…
  • కీచక ప్రజ్వల్ కేసు..! న్యాయవ్యవస్థపై ఆశల్ని బతికించే తీర్పు..!!
  • వినుడు వినుడు విజయవాడ వెతలూ… వినుడీ జనులారా..!!
  • ఎవరు నిజమైన జర్నలిస్టు అనే ప్రశ్న సరే… అసలు జర్నలిస్టు అంటే ఎవరు..?
  • ఆహ్లాదానికీ అసభ్యతకూ నడుమ గీత చెరిపేశాడు రాఘవేంద్రుడు..!!
  • జాతీయ అవార్డు పొందిన ఆ కాసర్ల శ్యామ్ పాట ఎందుకు నచ్చిందంటే..?
  • మియా భాయ్… హేట్సాఫ్ సిరాజ్… నువ్వూ ట్రూ హైదరాబాదీ…
  • కర్త, కర్మ, క్రియ కేసీయారే..! ఖ్యాతి మసకబారి, తొలి అధికారిక మరక..!!
  • వంగా సందీప్‌రెడ్డి మార్క్ రోల్… నో, నెవ్వర్, సాయిపల్లవికి అస్సలు నప్పదు…
  • నౌషాద్ ఆఫ్ సౌత్ ఇండియా… ఘంటసాలకూ ఆరాధ్యుడు ఈ సుబ్బరామన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions