ఒక వ్యాపార ప్రకటన ఎలా ఉండకూడదు అని చెప్పడానికి పక్కా ఉదాహరణ ఇది… ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి మార్కెటింగ్ ఉద్యోగి చదివి తీరాల్సిన ఓ ఉదాహరణ… ప్రత్యేకించి పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు ఇచ్చేవారు, తీసుకునేవారు పరిగణనలోకి తీసుకుని, గుర్తుంచుకోవాల్సిన ప్రకటన ఇది… చదివేవారికి, చూసేవారికి చాయిస్ ఎలాగూ ఉండదు కాబట్టి, వాళ్ల ఖర్మ…
వ్యాపార ప్రకటన అని ఎందుకు అంటున్నానూ అంతే… పత్రిక వాడికి ఇది వ్యాపారమే కాబట్టి…! ఆ వ్యాపారం మీదే పత్రిక మనుగడ కాబట్టి…! విషయంలోకి వెళ్తే… ఈనాడు ప్రకాశం జిల్లా పేజీలో ఈ వింత ప్రకటన వచ్చిందీ అని నవ్వు ఈమోజీతో ఓ పోస్టు కనిపించింది… నమ్మలేదు మొదట్లో… ఎహె, మరీ అంత గుడ్డిగా ఎలా ఇస్తారు అనుకుని, ఈనాడు ప్రకాశం పేజీ కోసం ఈ-పేపర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది… ధ్రువీకరణ కోసం… ఎవరైనా వైసీపీ అభిమానులు వ్యంగ్యంగా పోస్ట్ చేసిన మార్ఫింగ్ ఫోటోయేమో అనుకున్నాను మొదట్లో…
Ads
నిజంగానే ఈ-పేపర్‌లో కనిపించింది… మాస్ట్ హెడ్ కూడా ముద్రించి ఉన్న ఈ ఫుల్ పేజీ యాడ్‌లో ఎన్టీయార్ కృష్ణుడి వేషంలో ఉన్న బొమ్మ ఉంది… ఎన్టీయార్‌ను రాముడిగా, కృష్ణుడిగా చూపించి ఈరోజుకూ సొమ్ముచేసుకోవడం టీడీపీకి, చంద్రబాబుకు అలవాటే కదా… వెన్నులో లోతుగా ఓ పోటు కసుక్కున పొడిచి మరీ, కాళ్లకు దండం పెట్టే బ్యాచ్ కదా… జనహృదయనేతకు జన్మదిన శుభాకాంక్షలు అని రాసి లోకేష్, బాలయ్య, అచ్చెన్నాయుడు ఫోటోలు ఆ అక్షరాల కిందే పెట్టారు…
అందులో ఎవరి బర్త్ డే..? అది అర్థం కాలేదు మొదట్లో… ఐనా ఈరోజు 420 కదా… ఐమీన్ ఏప్రిల్ 20 కదా… చంద్రబాబు జన్మదినం కదా అని గుర్తొచ్చి, ఇదే యాడ్‌లో ఆయన బొమ్మలు రెండు కనిపించి, ఇవి చంద్రబాబుకు ఇచ్చిన శుభాకాంక్షల ప్రకటనే అని అర్థం చేసుకుని నిమ్మళం చేసుకున్నా… టీడీపీ ఎంబ్లమ్ కూడా వేశారు… అదీ బాగానే ఉంది… కానీ లోకేష్, బాలయ్య, అచ్చెన్నాయుడు ఫోటోల కింద, చంద్రబాబు మొహం పక్కనే ‘‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’’ అని కొట్టొచ్చినట్టుగా పదాలు కనిపించాయి… బ్యాక్ గ్రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కనిపిస్తోంది…
ఇదేం ఖర్మ..? ఒకవైపు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ… చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఖర్మ అని చాటిచెబుతున్నట్టుగా ఈ పదాలు ఏమిటి…? మనసులో మాట చెబుతున్నాడా సదరు ప్రకటనకర్త…? కొంపదీసి ఈ యాడ్ ప్రిపేర్ చేసిన కళాకారులు దీన్ని నిందా స్తుతి అనుకోలేదు కదా..? ఖర్మరా బాబూ… ఐనా చంద్రబాబు పత్రికగా పేరుగాంచిన ఈనాడు కదా… మరి యాడ్ పేజీలో పెట్టేటప్పుడు మార్కెటింగ్ సిబ్బంది ఇలా తప్పుడు అర్థం వస్తుంది అని అలర్ట్ చేసి ఉండాలి కదా…
అఫ్ కోర్స్, ప్రకటన ఇచ్చినవాడికి మార్కెటింగ్ సిబ్బంది నీతులు చెప్పొద్దు అనేది నిజమే… కానీ మరీ ఇలాంటి బ్లండర్స్ వస్తున్నప్పుడు ఓ మాట చెప్పొచ్చుగా… చటుక్కున చూసిన వాడికి… ‘‘చంద్రబాబును చూపిస్తూ, కృష్ణుడి వేషంలోని ఎన్టీయార్ ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని శంఖం పూరించి మరీ చెబుతున్నట్టుగా’’ కనిపిస్తోంది యాడ్… ప్రకటన ఇచ్చినవాడి ఉద్దేశం అదే అయితే మాత్రం… మనమేం చేయలేం…!!
Share this Article