కష్టకాలంలో రామోజీరావుకు కేసీయార్ చల్లని చూపు కావాలి… కేసీయార్‌కు కూడా అంతే… ఓ పెద్ద పత్రిక, టీవీ చానెళ్ల మద్దతు కావాలి… తన సొంత మీడియా ఉన్నా సరే, సొంత పార్టీ వాళ్లే పట్టించుకోరు దాన్ని… మార్గదర్శి చిట్స్‌పై జగన్ ఉరుముతున్నాడు… అంతు చూస్తానంటున్నాడు… ఇంకోవైపు సుప్రీంలో మార్గదర్శి ఫైనాన్స్ భూతం అలాగే జడలు విప్పుకుని ఉంది… జగన్ ప్రభుత్వం అందులోనూ ఇంప్లిడయింది… తనకు ప్రబల ప్రత్యర్థిగా మారిన ఈనాడుకు ఝలక్ ఇవ్వడానికి ఒక్క రోజైనా సరే రామోజీరావు, ఆయన కోడలు శైలజను జైలుకు పంపించాలని జగన్ పట్టుదల…
ఈ స్థితిలో తను బతుకుతున్న తెలంగాణలో… ముఖ్యమంత్రి కేసీయార్ మద్దతు కావాలి తనకు… అందుకే ఈనాడు పత్రికను తెలంగాణకు సంబంధించి రంగూరుచివాసనచిక్కదనం లేని నిర్జీవ పదార్థంగా మార్చేశాడు… కేసీయార్ మీద ఈగ వాలడానికి లేదు… వీలైతే తనే తెలంగాణ పాలకుడికి పల్లకీలు మోయాలి… నిజానికి భజన విషయంలో నమస్తే తెలంగాణ కూడా వేస్ట్ అనిపించేలా… కొన్ని విషయాల్లో ఈనాడు… ‘‘నమస్తే ఈనాడు’’లా తయారైంది…
ఈరోజు కొత్త సచివాలయం మీద కుమ్మేసిన ఓ ఫుల్ పేజీ స్పెషల్ ఐటమ్ చూడగానే అనిపించింది ఇదే… ఇది ఆత్మగౌరవ పతాక అట… ఎలా..? ఒక భవనం ఒక జాతి, ఒక ప్రాంత ఆత్మగౌరవానికి ప్రతీక అవుతుందా..? తెలంగాణ ఠీవి అట… ఓహో… గుజరాత్‌లో కడితే గుజరాత్ ఠీవి, తమిళనాడులో కడితే తమిళ ఠీవి అయిపోతాయా..? తెలంగాణ ఠీవి అని భవన నిర్మాణాల్లో కూడా ప్రతిబింబిస్తుందా..? అసలు తెలంగాణ ఠీవి అనగానేమి..? ఏదో తోచింది అక్షరీకరించి, అచ్చేసి, రాజభక్తిని ప్రదర్శించడమేనా..?
Ads
ఆల్‌రెడీ కొత్తగా నిర్మితమైన భవనాలను సైతం వాస్తు లోపాల సాకులతో… ఫైర్ సేఫ్టీ సాకులతో… నేలమట్టం చేసి… వందల కోట్ల ప్రజాధనాన్ని పాతరేసి… కొత్తగా మరో భవనం కడితే అది ‘‘సుందర ప్రసాదం’’ అయిపోయిందా..? ఈ నిర్మాణ నిర్ణయాల మీద ఈనాడు ఎప్పుడైనా ఒక్క నిష్పక్షపాత సమీక్షా వాక్యం నిజాయితీగా రాసిందా..? ఆయన కట్టించిందే నిజాం వాస్తు శైలితో, మేం అధికారంలోకి వస్తే ఆ గుమ్మటాలను కూలగొడతాం అని బీజేపీ కస్సుమంటోంది కదా… అందుకని అది నిజాం శైలి కాదనీ… ఇంకా ఏవేవో వాస్తు సంప్రదాయల మేలి కలబోత అని రాసుకొచ్చింది ఈనాడు… తను సర్టిఫికెట్ ఇస్తోంది… ఎక్కడా పొరపాటున కూడా నిజాాం కాలం నాటి రాచరిక పోకడల వాస్తు శైలి అని రాయలేదు…
వనపర్తి సంస్థాన రాజప్రాసాదం అట… మరో కోణంలో నిజామాబాద్ నీలకంఠేశ్వరుడి గుడి అట… గుజరాత్‌లోని సలంగ్‌పూర్ హనుమాన్ ఆలయశైలి అట… ఇవి సరిపోవని… మరో కొత్త పదమిశ్రమాన్ని ప్రయోగించింది… హిందూ- దెక్కనీ- కాకతీయ నిర్మాణ రీతులు అట… బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీ కదా… మరో నాలుగైదు ప్రాంతాల వాస్తు ధోరణులనూ ఉదహరించి, వీటిలోనే కలిపేస్తే సరిపోయేది ఫాఫం… ఈ కథనంలోనే ఎక్కడో రాశారు… ఇండో-పర్షియన్-అరేబియన్ వాస్తు ధోరణుల మేలు మేళవింపు అట… పనిలోపనిగా రోమన్- అమెరికన్- ఆస్ట్రేలియన్ కలిపేస్తే ‘‘సచివాలయానికి విశ్వ ముద్ర’’ వేసినట్టయ్యేది కదా…
రెండు గుమ్మటాల మీద జాతీయ చిహ్నాలైన మూడు సింహాల బొమ్మలున్నాయి కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవ పతాక అట… సింహాల బొమ్మలు ఆత్మగౌరవ పతాకలు ఎలా అయ్యాయి..? అసలు మూడు సింహాలు ఏమిటి..? జాతీయ చిహ్నం అంటే నాలుగు సింహాలు కాదా..? ఓహో, కేసీయార్-ఈనాడు కలిసి ఓ సింహాన్ని చంపేసి, కేవలం మూడు సింహాలనే ఆత్మగౌరవ చిహ్నం చేశాయా..? ఏది తోస్తే అది రాసేసి, మొత్తానికి ఒక ఫుల్ పేజీ నింపేశారు… పాత భవనాలను కూల్చేసి, నేలను చదును చేయడం కూడా ఛాలెంజింగ్ అయిపోయిందట… ఆ అసాధ్యాన్ని కేసీయార్ ప్రభుత్వం సుసాధ్యం చేసిందట…
ఈ ఆర్కిటెక్టులకు ఏం తెలుసు పాపం..? ఈనాడు జర్నలిస్టులకన్నా ఎక్కువ తెలుసా..? అసలు ఇన్నిరకాల వాస్తు రీతుల మేళవింపు అని కేసీయార్‌కే తెలియదేమో… ఆర్కిటెక్టులు ‘‘తెలంగాణ సాంస్కృతిక సంపద, శాంతియుత జీవన శైలులకు ప్రతిరూపం’’ అంటున్నారు… ఓహో, శాంతియుత జీవనశైలిని కూడా ఈ నిర్మాణం ప్రతిబింబిస్తోందా..? ఏరకంగా అని అడగకూడదు, ఈనాడు కథనం కదా…!! ఎంత ఇసుక, ఎంత సిమెంటు, ఎంత ఉక్కు గట్రా వివరాలు రాశారు గానీ… మొదట్లో ఎంత అంచనా వ్యయం..? ఎంతకు పెరిగింది..? వంటివి మచ్చుకైనా రాయలేదు, రాయకూడదు… డప్పు కదా…!! పేరుకేమో తెలంగాణ సాంస్కృతిక పతాక అని ముద్రవేశారు, కానీ ఆ ఛాయలే లేవు… అందుకని చేర్యాల పెయింటింగ్స్ (నకాషీ) గోడలకు వేలాడదీసే ఆలోచన ఉందట… అంతా అయిపోయాక ఇప్పుడు ఆ ఆలోచన వచ్చిందట…!!
Share this Article