We are Top: నిన్నటి నుండి గాల్లో తేలినట్లుంది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఉబ్బి తబ్బిబ్బులుగా ఉంది. ఒకటే పులకింత. తుళ్లింత. మొన్ననే చైనా సరిహద్దు హిమాలయం కొండల దాకా వెళ్లి వచ్చాను. అప్పుడే ఈ వార్త తెలిసి ఉంటే…కనీసం హిమాలయం కొండ కాకపోయినా…గుట్ట అయినా ఎక్కి బిగ్గరగా అరచి ఉండే వాడిని.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల పద్దులో ఇన్ని శతాబ్దాలుగా అప్రతిహతంగా మొదటి స్థానంలో ఉన్న చైనాను కిందికి లాగి…భారత్ మొదటి స్థానంలోకి వచ్చింది. ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ శాఖ అధికారికంగా మన మొదటి స్థానాన్ని ప్రకటించింది.
Ads
ఇది చిన్న విషయం కాదు. ఈ మానవ జనన మహోన్నత మైలు రాయిని దాటడానికి కారణమయిన మనల్ను మనమే మనసారా అభినందించుకోవాల్సిన శుభ తరుణం. దీనికోసం తమ చెమట, రక్తం ధారపోసిన మన పూర్వులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ సందర్భంగా తలుచుకోవడం మన కనీస కర్తవ్యం.
ఇక ప్రపంచంలో ఏ శక్తీ మనల్ను ఆపలేదు. ఇక ప్రపంచంలో మనం తలదించుకుని నిలబడాల్సిన పనే లేదు.
1. ఈ క్షణానికి చైనా కంటే మన జనాభా ముష్టి ముప్పయ్ లక్షలే ఎక్కువ అని నిట్టూర్చాల్సిన పని లేదు. లెక్కకు మిక్కిలి పిల్లలు పుట్టించే ఈ పరుగు ఇక్కడితో ఆగదు. పుట్టించి…పుట్టించి…చైనా అలసిపోయింది. మన పరుగు వేగాన్ని వారు అందుకోవడం ఇక కలలో కూడా కల్ల.
2. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ ఈ వార్త దేశమంతా ఒకే శ్రుతిలో ఉత్సవం చేసుకోవాల్సినంత ప్రాధాన్యం కలిగినది.
3. అయిదుగురు, ఆరుగురు, ఎనిమిది, పదిమంది…ఇంకా ఎక్కువ మంది పిల్లలను కని…ఈ మైలు రాయి దాటడానికి ప్రత్యక్షంగా కారణమయిన వారిని దేశం ఈ సందర్భంగా ఆనందబాష్పాలతో స్మరించుకోవాలి.
4. దేవుడిని నమ్మేవారు తొట్ట తొలి రోజు బ్రహ్మ మనిషిని పుట్టించిన ఘడియలను, ప్రజాపతులను పుట్టించి వారికి మన ఆలనా పాలనా అప్పగించిన రోజును తలచుకుని…నోరారా మంత్రాల పూజలు చేయాలి.
5. దేవుడిని నమ్మని వారు…కోతుల నుండి పుట్టిన మానవ పరిణామ క్రమ శాస్త్రీయ సిద్ధాంతాన్నయినా ఒకసారి తలచుకుని…మన పుట్టుకకు కారణమయిన ఆ ఆదిమూల కోతులకు తలవంచి నమస్కరించాలి.
6. కేవలం సాహిత్యాన్నే నమ్ముకుని బతికేవారయితే- “ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో?” అన్న దాశరథి మాటను గుర్తుకు తెచ్చుకోవాలి.
7. వేదాంతులు అయితే- “నానాటి బతుకు నాటకము; కానక కన్నది కైవల్యము; పుట్టుటయు నిజము; పోవుటయు నిజము; నట్టనడిమి పని నాటకము; యెట్ట నెదుట గల దీ ప్రపంచము; కట్ట గడపటిది కైవల్యము” అన్న అన్నమయ్య మాటనే పలవరించి పాడుకోవాలి.
8. ఏదో తెలియని అయోమయంలో ఉన్నవారయితే- “పుట్టినరోజు పండగే అందరికి- మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?” అన్న సి నా రె ప్రశ్ననే మననం చేసుకోవాలి.
9. పుట్టినా…ఎందుకు పుట్టానురా దేవుడా! అని అనుకునేవారయితే- “జన్మమెత్తితిరా అనుభవించితిరా.. బ్రతుకు సమరములో పండిపోయితిరా…” అన్న అనిశెట్టి పాటలో మాటగా మారాలి.
అందరూ ఈ దేశానికి ఏదో ఒకటి ఇవ్వాలన్నది అత్యున్నత ఆదర్శం. మనం ఈ మహోన్నత దేశానికి 142.86 కోట్ల జనాభాను ఇచ్చాము. ప్రతిఫలంగా ఇక దేశమే ఎంతో ఇవ్వాలి మనకు.
నిజమే.
ఈ దేశం ఈ కోణంలో ఎప్పటికీ మనకు రుణపడి ఉండాలి.
కొస విరుపు:-
నిక్కమయిన నీలమొక్కటయినను చాలు;
తళుకు బెళుకు రాళ్లు తట్టెడేలా?
అన్నట్లు నెత్తురు మండే, శక్తులు పండే మేలిమి యువకులు మా దేశంలో 90 కోట్ల మంది ఉన్నారు?
మీ దేశంలో నెత్తురు మండని, శక్తులు పండని యువకులే ఉన్నారు అని చైనా మాండరిన్ భాషలో పెదవి విరుస్తోంది.
కింద పడ్డా…పై చేయి నాదే అనడంలో చైనాది అందె వేసిన చేయి!
ఊహాన్ ల్యాబ్ లో ఒక వైరస్ నే కృత్రిమంగా తయారు చేసిన చైనా ఎటు నుంచైనా నరుక్కు రాగలదు!
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article