విఖ్యాత తెలుగు నవలారచయిత Yandamoori Veerendranath తన ఫేస్బుక్ వాల్ మీద షేర్ చేసుకున్న ఓ పోస్టు చదవండి ముందుగా……….. ‘‘మరి కొద్ది గంటల్లో నగరం మీద పడబోయే బాoబు గురించి తెలిసిన అతి కొద్దిమందిలో అతనొకడు. కుటుంబంతో కలిసి రహస్యంగా రాష్ట్రం విడిచి వెళ్ళటానికి తయారు అవుతూ ఉండగా ‘హోమ్ ఫర్ ది ఏజ్డ్ నుంచి మాట్లాడుతున్నాం. మీ తండ్రి రామానంద, నెం 64392 అరగంట క్రితం మరణించారు” అని ఫోన్ వచ్చింది. ఈ సమయంలో తండ్రి మరణం షాక్‌లా తగిలింది. వాచీ చూసుకున్నాడు. ఎలక్ట్రికల్ క్రిమేషన్ (కరెంటు ద్వారా శవాన్ని బూడిద చెయ్యటం) వచ్చాక అంతా అరగంటలో అయిపోతుంది. ఫ్యామిలీ తో వెళ్ళాడు. అది విజిటింగు అవర్స్ టైమ్. ఇతడి కారు కాంపౌండ్‌లో ప్రవేశించగానే మేడ మీద కూర్చుని ఉన్న వృద్ధులు గబగబా డాబా అంచు వద్దకు వచ్చి చూశారు. వచ్చినది తమ తాలూకు వాళ్ళు కాదని తెలిసి వాళ్ళ మొహాల్లో నిరాశ కొట్టొచ్చినట్టు కనపడింది. అంతమంది అలా పిట్టగోడ అంచున నిలబడటం ఏటి ఒడ్డున కొంగల వరుసని గుర్తుకు తెస్తోంది. ఇది సరయిన ఉపమానం కాదు. అయినా అతడికి అదే గుర్తొచ్చింది.
గది బయట వరండాలో తండ్రి శవం ఉంది. ఎలక్ట్రికల్ క్రిమేషన్ చేసే బంగళా చిన్న కాంపౌండ్‌లో ఉంది. క్లర్క్ ఇచ్చిన ఫారంలో పూర్తి చేసుకుంటూ ఒక కాలమ్ దగ్గర ఆగి, ”ఏమిటిది?” అని అడిగాడు. “యాష్. మీకు శవం తాలూకు బూడిద కావాలంటే అక్కడ టిక్ పెట్టండి. పది వేల రూపాయలు ఎక్కువ అవుతుంది.” ”బూడిద కావాలనేవాళ్ళు కూడా ఉంటారా?” ”కొంతమంది ఉంటారు. సెంటిమెంట్‌గా నదిలో కలుపుతారట. వాళ్ళకోసం పాత మిషను వాడాలి. దానికి ఎగస్ట్రా.”
Ads
భరద్వాజ ‘యాష్’ అన్నచోట అడ్డంగా కొట్టేశాడు. అప్పటికే శవాన్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు. ఫ్లోర్ కి రైలు పట్టాల్లా ఉన్నాయి. ధాన్యం పోసుకునే పెద్ద గాదెలాటి అల్మైరా లోకి అవి వెళ్తున్నాయి. ఆ పట్టాల మీద స్ట్రెచర్ ఉంది. క్లర్కు వచ్చి శవం మొహం మీద ముసుగు తొలగించాడు. భరద్వాజ అడుగు ముందుకేసి, తండ్రి మొహంకేసి ఒకసారి చూసి పక్కకి తప్పుకున్నాడు. తరువాత అదే విధంగా సైనిక వందనం రీతిలో కొడుకు, కూతురు, భార్యకూడా చేశారు. తరువాత స్ట్రెచర్ని పట్టాల మీద ముందుకు తోశారు. గుహలోకి రైలు ప్రవేశించినట్టు అది ఆ ‘ఓవెన్’లోకి ప్రవేశించింది. ….. స్స్స్ మన్న ధ్వని.
రెండు నిమిషాలు ఆగి తలుపు తెరిచాడు. లోపల్నుంచి ఖాళీ స్ట్రెచర్ బయటకొచ్చింది. పైనేమీ లేదు. ‘అయిపోయింద’న్నట్టూ క్లర్కు భరద్వాజ వైపు చూశాడు. భరద్వాజ గాఢంగా నిశ్వసించి తలూపి వెనుదిరిగాడు. వెనకే కుటుంబం కూడా నడిచింది. అoత నిశ్శబ్దంగా, అలా మెకానికల్‌గా ఒక మనిషి ఆనవాలు కూడా లేకుండా నిష్క్రమించటం ఎంత కాదనుకున్నా అదోలా ఉంది.
”చాలా అదృష్టవంతులు. ఏ రోగమూ, బాధ లేకుండా పోయారు” అంది భార్య.”పుట్టినవాళ్ళు పోక తప్పదుకదా” అన్నది కూతురు.చెల్లెల్ని వెక్కిరిస్తూ ”శ్మశాన వైరాగ్యమా?” అన్నాడు కొడుకు.”కాదు క్రిమేషన్ వైరాగ్యం” రిటార్డు ఇచ్చిందా అమ్మాయి.”ష్…” అని సైగ చేసింది అతడి భార్య. భరద్వాజ మౌనంగా గంభీరంగా ఉండటాన్ని వాళ్ళు గమనించారు. అది నిజమే. కానీ అతడలా ఉన్నది తండ్రి మరణం గురించి కాదు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని, ప్రాణం రక్షించుకోవటం కొసo వలస వెళ్తున్నప్దుడు, కార్లో తీసుకువెళ్ళే వస్తువుల్లో తండ్రి కూడా ఒకడున్నాడని అరగంట క్రితం అలోచన రానందుకు. (తరువాతి ఎడిషన్ కోసం, (40 సంవత్సరాల తరువాత మొదటి సారి) చదువుతూంటే ఏదోలా అనిపించింది……….. ఇదీ ఆ పుస్తకంలోని ఓ ఎపిసోడ్…
వేల మందికి మొన్నటి కరోనా దుర్దినాల్లో కనీసం ఈ ‘‘చివరి మర్యాదలు’’ కూడా దక్కలేదు… అనాథ శవాల్లా లోకం వీడివెళ్లిపోయారు… వాళ్లు గుర్తొచ్చారు ఇది చదువుతుంటే… సందర్భాలు వేరు, అనుభవాలు వేరు కావచ్చు… కానీ తన వెంట ఓ కన్నీటిచుక్కను వెంట తీసుకుని వెళ్లని ప్రతి ఒక్కడూ దురదృష్టవంతుడే కదా… ‘‘మంచి పిల్లలు’’ లేని అనాథలు కొందరు ఈమధ్య కాశి వెళ్తున్నారు… తమ అంత్యక్రియలకు ముందే డబ్బులిస్తున్నారు… చివరకు గంగ ఒడ్డున పెట్టే ‘‘ఆత్మపిండం’’ కోసం కూడా పంతుళ్లకు ముందే పైసలిస్తున్నారు… నిజమే సార్, కాలం మారుతోంది… ఇళ్లు ఇరుకైపోతున్నయ్… స్పేస్ సరిపోవడం లేదు… మరీ ప్రాక్టికల్ మనుషులం కదా… అక్కరకు రాని వస్తువుల్ని డిస్పోజ్ చేసేస్తున్నాం…!!
Share this Article