మన తెలుగింటమ్మాయి తీసిన ఓ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దాకా వెళ్లిందని ఎంత మందికి తెలుసో గాని నాకైతే తెలియదు. (నా అజ్ఞానాన్ని మన్నించాలి) ఏదో విభాగంలో ఏదోక పాట నామినేటైతేనే భూమ్యాకాశాలను తల్లకిందులు చేసిన మీడియా.. నిండా మూడు పదుల వయస్సు లేని మన అమ్మాయి గురించి మాటమాత్రం రాసినట్టు, చెప్పినట్టు గుర్తులేదు. అందుకనే నేనిప్పుడు చెప్పాలనుకుంటున్నా.
ఆమె పేరు అపూర్వ గురు చరణ్. పదహారణాల తెలుగుబిడ్డ. సామాజిక స్పృహ మెండు. సినిమాపై తెలివిడీ ఎక్కువే. చాలా తీసినా ఆస్కార్ బరిలో నిలిచిన సినిమా ది జాయ్ ల్యాండ్. తీసుకున్న కథాంశం లింగమార్పిడి (ట్రాన్జాండర్). నామినేట్ చేసిన దేశం పాకిస్తాన్. ఈ అమ్మాయి మూలాలు సామాజిక ఉద్యమాలకు పుట్టిల్లయిన అనంతపురం. పుట్టింది హైదరాబాదు, ఐదో తరగతి వరకు చదివింది హైదరాబాదే. ఈ సినిమాను ఈనెల 28న అమెరికా టెక్సాస్ లోని డాలస్ నగరంలో ప్రదర్శిస్తున్నారు. ఈ షోకి ఆ అమ్మాయి వస్తోంది. ఈ షోకి రమ్మని హరిచరణ్ ఆహ్వానం పంపారు. ఇండియా నుంచి మళ్లీ పోలేను గనుక ఈ నాలుగు మాటలు…
కాఫీ ఎందుకు.. భోజనానికే రండి…
ఆస్కార్ అవార్డుల సందడి ముగిసింది. పేరున్న వారందర్నీ ఆ సమయంలో మీడియా పరిచయం చేసింది. ఆ టైంలో టీవీల్లో కనబడాలన్నా పత్రికల్లో పేర్లు రావాలన్నా ఖరీదైన వ్యవహారమట. ఈ తంతు అయిపోయాక మొన్నామధ్య ఓ రోజు సీఎన్ఎన్ ఛానల్ చూస్తుంటే ఈ జాయిలాండ్ కి అవార్డు ఎలా మిస్సయిందనే దానిపై ఓ పెద్ద కథనం వస్తోంది. అప్పుడా ప్రజెంటర్.. అపూర్వ పేరు, ఊరు చెప్పారు. ఆ మర్నాడే అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్తా) సదరన్ కన్వెన్షన్ డాలస్ లో జరిగింది. ఆ వేదికపై అపూర్వ నాన్న హరిచరణ్ ప్రసాద్ ని సన్మానించారు.
Ads
అప్పుడు నా ఛాతీ కూడా 56 అంగుళాలై వేదిక వెనక్కు పరిగెత్తితే, ఆయన ముందు నుంచి దిగివెళ్లిపోయారు. ఉసూరనిపించింది. ఇంగ్లీషు సినిమాల ఎఫెక్టేమో.. ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్లా.. నిర్వాహకుల్లో ఒకరైన నవీన్ ను పట్టుకున్నా. తెలియదన్నాడు. ఆయనే కాస్త ఆలోచించి.. ఆ కార్యక్రమానికి యాంకరింగ్ చేసిన సజిత దగ్గరకు తీసుకెళ్లాడు. ఆమె నెంబర్ లేదంది కానీ ఏదోలా సంపాయించి ఇస్తానన్న మాట నిలబెట్టుకుంది.
గంపెడంత సంతోషపడి నాకు వచ్చీ రానీ ఇంగ్లీషులో పెద్ద మెసేజ్ పంపా తెలుగు మర్చిపోయాడేమోనన్న భ్రమలో.. దాన్ని చూసినాయన భళ్లున ఫోన్ చేసి తప్పకుండా కలుద్దామని చెప్పి మరచినట్టున్నారు. నాకేమో ఇండియా వచ్చే కాలం మూడింది. ఓరోజు సాహసం చేసి మళ్లీ మెసేజ్ పెట్టా. నేను ఫలానా తారీఖున వెళ్లిపోతా, ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, కాఫీ తాగి వెళ్దామన్నా. ఏమనుకున్నాడో ఏమో డేట్, టైం చెప్పి కుటుంబంతో సహా భోజనానికే రమ్మన్నారు. ఎగిరిగంతేసినట్టయింది.
కమ్లీ మై డాటర్ ఈయన తీసిన సిన్మానే..
చిత్రసీమపై నాకున్నది అజ్ఞానమే. ఓనమాలూ తెలియవు. అపూర్వ వాళ్ల నాన్నగార్ని కలవాలన్న యావ తప్ప ఆయన సినీ పండితుడని తెలియదు. మాటలు మొదలు పెట్టాక తెలిసింది ఈ మనిషి మామూలోడు కాదు మహాలోతైన వాడని. మాలపల్లి నవల మొదలు చలం అరుణ, కేశవరెడ్డి చివరి గుడిశ వరకు సాహిత్యం, బెన్ హర్ మొదలు ఎవడే సుబ్రమణ్యం వరకు ఏమేమో మాట్లాడుతున్నారు.
కొన్ని చలం నవలల్ని సినిమాలుగా తీయాలనుకుని ఎవరికో డబ్బిస్తే వాళ్లు శుభ్రంగా వాడుకుని మౌనం దాల్చారట. ఆశ్చర్యమేసింది. మీ దగ్గర అన్ని డబ్బులున్నాయా అని అమాయకంగానే అడిగా.. ఆయన పెద్దగా నవ్వి నాకున్నవేవో నాకున్నాయి గాని మంచి కాన్సెప్ట్, కథ, నెట్ వర్క్ ఉంటే మాంచి సినిమా తీయవచ్చండీ అన్నాడు. అందుకు అపూర్వే పెద్ద నిదర్శనమన్నారు. కమ్లీ మై డాటర్, ష్ తీశానని చెప్పినప్పుడు నేను గబుక్కున ఏమైనా వచ్చాయా, పోయాయా అంటే చేతులు కాల్లేదు గాని రాష్ట్రపతి అవార్డు వచ్చిందంటూ వాళ్లవిడ అవార్డు తీసుకుంటున్న ఫోటో చూపించారు.
తండ్రిని మించిన తనయ…
డాక్టర్ పిల్లలు డాక్టర్లు, కలెక్టర్ల పిల్లలు కలెక్టర్లయినట్టే హరిచరణ్, సుకన్య దంపతులు తమ బిడ్డను ఫైన్ ఆర్ట్స్ల్ లో తీర్చిదిద్దారు. పిట్ట కొంచెం కూత ఘనమన్నట్టు చిన్న వయసులోనే ఆస్కార్ అవార్డు బరిలో అపూర్వ నిలవడం, దక్షిణాసియా ఫిలిం ప్రొడ్యూసర్ గా అందరూ పిలుస్తుంటే ఏ తండ్రికైనా కాలర్ ఎగరేయాలనిపిస్తుంది కదా. అలా ఆమె గురించి చెబుతూ బోలెడంత పొంగిపోయారు.
నిజానికి హరిచరణ్ కరవు సీమ నుంచి వచ్చిన ఓ మధ్యతరగతి మనీషి. బలగముంది గాని డబ్బుజబ్బు లేని కుటుంబం. అనంతపురంలో పుట్టి పెరిగి అక్కడే చదివి ఐఎఎస్ కాబోయి బ్యాంక్ ఆఫీసరై ట్రైనింగ్ లో తన సహచరి సుకన్యతో చేయీ చేయీ కలిపి ఏడడుగులు వేశారు. అలా ఒకటైన ఆ జంట ఉద్యోగ రీత్యా భాగ్యనగరానికి చేరింది.
తిరిగే కాలు తిట్టే నోరు ఊరకుండదు కదా ఏవేవో ప్రయోగాలు చేశారట. అపూర్వ పుట్టిన తర్వాత ఎస్సార్ నగర్ లో అచీవర్స్ అనే స్కూలు పెట్టి చేతులు కాల్చుకున్నారట. సరిగ్గా ఆ దశలోనే బ్యాంకింగ్ రంగం కంప్యూటీకరణ వైపు మళ్లుతుండడంతో ఓ ప్రైవేటు కంపెనీ తరఫున అమెరికా చేరి ఉత్తర కాలిఫోర్నియాలో కాపురం పెట్టారు. అప్పటికే అపూర్వ మన భట్టీ చదువులో ముందుంది.
సగటు భారతీయ మహిళ మాదిరే వాళ్లమ్మ ఈ పిల్లను ఏ ఇంజినీరింగో, డాక్టర్ గిరో చేయించాలనుకుందట. ఇదేమాత్రం గిట్టని ఆ చిన్నారి మిడిల్ స్కూలు రోజుల్లో ఓ రోజు రాత్రి వాళ్ల నాన్న పక్క చేరి నాన్న నాకీ భట్టీ చదువొద్దు, ఫైన్ ఆర్ట్స్ చేస్తానందట. దానికి తగ్గట్టే ప్రాజెక్ట్ చేసి కొలంబియా యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (MFA) సీటు కొట్టేసింది.
వాళ్ల నాన్న చెప్పిన 3P’S (PURPOSE, PASSION, PROFESSION)ని వంటబట్టించుకున్న అపూర్వ ఇక ఆతర్వాత ఎన్నడూ తిరిగి చూడలేదు. తండ్రికి తగ్గ తనయనిపించింది. క్రియేటివిటీ ఎవడబ్బ సొత్తు కాదని నిరూపించింది. ఉత్తరాఖండ్ లో కొండ జాతుల జీవనాన్ని కళ్లకు కట్టింది. ఈ డాక్యుమెంటరీ ఆమె కెరీర్‌ను మలుపుతిప్పింది. పిన్న వయసులోనే దేశదేశాలు చుట్టివచ్చింది. ఆసియాస్ డిజిటల్ ప్రొ ట్యూడర్ నగర నిలిచింది. ఎన్నో సిరీస్‌లలో పని చేసింది.
చదువే సమస్తమని గట్టిగా నమ్మే తండ్రి లాగే మంచి చదువరి. తల్లిలాగా భక్తురాలు. మనిషి జీవితం చుట్టూ తిరిగే కథా కథనాలంటే మక్కువెక్కువ. మూస పద్ధతికి, రొడ్డకొట్టుడికి బహుదూరం. 27 ఏళ్లకే 20కి పైగా చిన్న సినిమాలు ఆమె సొంతం.
అవార్డులు, రివార్డులకు కొదువేలేదు…
అపూర్వ వయసు చిన్నదే కాని అవార్డులు, రివార్డులు, ఫెలోషిప్ లకు కొదువేలేదు. తీసిన ప్రతి సినిమా ఏదో ఒక అవార్డు గెలిచిందే. ప్రమాణాలకు పెట్టింది పేరనే హెచ్.బి.వో., హెచ్.బి.వో మాక్స్, వాల్ట్ డిస్నీ లాంటి సంస్థలు సైతం ఆమె సినిమాలకు పెద్దపీట వేశాయంటే అతిశయోక్తి కాదు. డయానా లిన్ నటించిన LONELY BLUE NIGHT ఆమె తీసిందే. 2020 సంవత్సరానికి AFI ఫెస్ట్ లో ఆడియన్స్ అవార్డు గెలిచిన ది ఫేర్ వెల్ అపూర్వ నిర్మించిందే.
HBO APA విజనరీస్ అవార్డుకు ఫైనలిస్ట్‌గా నిలిచినపుడు సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారట. సినీరంగంలో కొమ్ములు తిరిగిన మొనగాళ్లకు దక్కని చోటు ఆమెకు అనేక అంతర్జాతీయ వేదికలపై దక్కింది. 2018లో ఆమె నిర్మించిన DISTANCE ఫిల్మ్ సింగపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చోటు దక్కించుకుంది. 2020లో పైప్‌లైన్ సినిమా ఉత్తమ చలనచిత్ర అవార్డు గెలిచింది. ఫెలోషిప్ లకైతే లెక్కేలేదు.
2019లో ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ క్రియేటివ్ ప్రొడ్యూసింగ్ ఫెలో, 2020 ఫిల్మ్ ఇండిపెండెంట్ క్రియేటివ్ ప్రొడ్యూసింగ్ ల్యాబ్ ఫెలో, 2021 ఉమెన్ ఇన్ ఫిల్మ్ ఎమర్జింగ్ ప్రొడ్యూసర్స్ ఫెలో వంటివెన్నో ఆమె ఖాతాలో ఉన్నాయి. బిగ్ బీచ్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ లైవ్ యాక్షన్ డిపార్ట్‌మెంట్, బ్లూ హార్ప్ వంటి పెద్దపెద్ద సంస్థలైతే ఆమెకు సాదరస్వాగతం పలికాయి. 2018లో గులాబ్ ఫీచర్ ఫిల్మ్ సినీపండితుల్నేఓ ఊపుఊపిందట.
ప్రస్తుతం ఆమె HORIZON అనే సిరీస్ ను, సెవెన్త్ బౌల్ అనే ఇరానియన్ మూవీని తీసే పనిలో ఉన్నారు. ప్రపంచ ప్రేక్షకుల మెదళ్లకు పట్టిన తుప్పును వదిలించే సరికొత్త కథనాలే నేటి అవసరమనే ఆమెమీ కమ్యూనిస్టు కాదు. అలా అని క్యాపిటలిస్టూ కాదు. ఓ మంచి హ్యూమనిస్టంటారు ఆమె.
2 మిలియన్ డాలర్లుంటే ఆస్కార్ వచ్చేదే..
అపూర్వకు అవార్డులపై పెద్దగా మోజున్నట్టు కనిపించలేదు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ వేదికలు, ఉత్సవాల్లో ఆమె ప్రత్యేకతను చాటుకున్నారు. ఆస్కార్ కి మొత్తం 98 దేశాల నుంచి సినిమాలు నామినేట్ అయితే ఆమె తీసిన ది జాయిలాండ్ 95వది పాకిస్తాన్ నుంచి నామినేట్ అయింది. వడపోత తర్వాత టాప్ 12లో నిలిచింది. అప్పటికే ఆమె, ఆమె బృందం అలసిపోయింది. చేతిలో డబ్బూ అయిపోయింది. మరో రెండు మిలియన్ డాలర్లు ఉంటే ఆస్కార్ వచ్చేదేమోనంటారు హరిచరణ్.
ఇప్పటికొచ్చిన పేరు ప్రతిష్టలు చాలు, ఆస్కార్ వచ్చినా రాకున్నా పర్వాలేదన్నది ఆమె జవాబు. ఇక, ఈ జాయ్ ల్యాండ్ సినిమా అడుగడుగునా వివక్షను ఎదుర్కొంటున్న ఓ లింగమార్పిడి వ్యక్తి ప్రేమలో పడడం ఇతివృత్తం. అనేక ఆటుపోట్ల నడుమ పాకిస్తాన్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది.
యూరోప్ లో అక్కడక్కడా విడుదలైంది. అమెరికాలో ఇప్పుడు రిలీజవుతోంది. ఇండియాలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో త్వరలో పీవీఆర్ మూవీస్ వారి ఆధ్వర్యంలో విడుదలయ్యే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. ఉత్తమ కళలు పుట్టే చోటే చరిత్రను మలుపు తిప్పే మంచి సంఘటనలూ పుడతాయంటారు. అటువంటి పనికి నడుంకట్టి చిత్తశుద్ధి, అంకిత భావంతో ముందుకు సాగుతున్న అపూర్వకు మరిన్ని విజయాలు రావాలి. మన తెలుగింటి ఆడబిడ్డ పేరు దేశదేశాల్లో మార్మోగాలని ఆకాంక్ష.
… అమరయ్య ఆకుల, సీనియర్ జర్నలిస్టు 9347921291
Share this Article