వారసుడు…. రాజకీయాల్లో, నటనారంగంలో ప్రజలకు ఈ బెడద ఎక్కువ… చాలా ఎక్కువ… ప్రత్యేకించి సినిమా రంగంలో తమ వారసుల్ని ప్రేక్షకుల నెత్తిన రుద్ది, ప్రేక్షకుల పట్ల కృతజ్ఞత కూడా లేకుండా ‘‘కక్ష’’ తీర్చుకుంటారు చాలామంది… ఇక ఆ వారసులు వెండి తెర మీద తైతక్కలాడుతూ ప్రేక్షకుల ఉసురు పోసుకుంటుంటారు… నాగార్జున, అఖిల్ కథ కూడా ఇదే…
ప్రత్యేకించి ఏజెంట్ అనే తాజా సినిమా చూశాక బలంగా మళ్లీ అనిపించేదీ అదే… నాగార్జునకు జీవితంలో చెప్పుకోలేని బాధ ఏదైనా బలంగా ఉందీ అంటే, అది అఖిల్ గురించే కావచ్చు బహుశా… 2015 నుంచి కొట్టుకుంటుంటే ఈరోజుకూ ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగిన సినిమా లేదు అఖిల్‌కు… అసలు తనను ఓ హీరోగా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయనేలేదు… తాజాగా ఏజెంట్ మూవీ తన కెరీర్‌లో మరో భారీ ఫ్లాప్, బ్లండర్ కూడా…
బండల్ అనే పదం తెలంగాణలో కాస్త ఫేమస్… అంటే చెత్త అని… కొట్టుకుపోయింది అని… నాసిరకం అని..! ఏజెంట్ ఘోరంగా ఢమాల్ అన్నట్టే… అమెరికా ప్రీమియర్ షోల టాక్ మరీ వ్యతిరేకంగా ఉంది… కెరీర్ చూస్తే ఇలా… శ్రేయా భూపాల్‌తో పెళ్లి ఫెయిలై వ్యక్తిగత జీవితమూ అంతే… ఫాఫం నాగార్జున… ఎంత చేసినా నాగచైతన్య ఎదగడం లేదు, తన పెళ్లి కూడా సమంతతో పెటాకులు… నాగార్జున కెరీర్ కూడా ముగింపుకు వచ్చినట్టే… వెరసి నాగార్జునకు శిరోభారం పెరిగిపోతోంది…
Ads
ఏజెంట్ మూవీ విషయానికొస్తే కథే పెద్ద డ్రాబ్యాక్… నేను ఏడాది కష్టపడ్డాను, ఈ ఎయిట్ ప్యాక్ ఫిజిక్ కోసం మస్తు జిమ్ చేశాను అని చెప్పుకుంటే ఫలితం ఏముంది..? అఖిల్ బాడీ, లుక్కు కోసం సినిమా థియేటర్లకు రారు కదా జనం… కథలో దమ్ముండాలి… అప్పట్లో మధుబాబు షాడో నవలలు ఫేమస్… ఏదో మాఫియా సిండికేట్… భారత గూఢచారి సంస్థలో స్పై హీరో… ఓ లవ్వు… సిండికేట్ కొమ్ములు వంచే హీరోయిజం… జనం షాడో నవలలు చదవడం ఎన్నడో మానేశారు, కానీ తెలుగు సినిమా మాత్రం షాడోను వదలడం లేదు, అన్ని హీరో పాత్రలూ దాదాపు అవే… ఈ ఏజెంటూ అదే…
దుమ్ము రేపడం ఖాయం అన్నాడు దర్శకుడు సురేందర్‌రెడ్డి, ఏవేవో చెప్పాడు… తీరా చూస్తే సినిమా తెర మీద తుస్సు… ఎక్కడికెక్కడికో వెళ్లారు షూటింగు కోసం, మస్తు యాక్షన్ సీన్లు పెట్టారు… కానీ బేసిక్‌గా ఇంట్రస్టింగు స్టోరీ, ప్రజెంటేషన్ లేకపోతే ఎవరు చూడాలి సినిమాను… హీరోయిన్ సాక్షి వైద్య సోసో… విలన్‌గా డినో మారియాను తెచ్చిపెట్టుకున్నా తనకు ఆ పాత్ర అతకలేదు… మమ్ముట్టి రా చీఫ్… ఆయన ఈ పాత్ర ఎందుకు అంగీకరించాడో ఆయనకే తెలియాలి…
సంగీతం బాగా లేక, ఫన్ లేక, వావ్ అనిపించే సీన్లు లేక, కథనం గ్రిప్పింగుగా లేక… ఏదీ సరిగ్గా లేక దర్శకుడు సురేందర్‌రెడ్డి ఏ విషయంలో తన అనుభవాన్ని రంగరించాడో అస్సలు అర్థం కాదు… అసలు వక్కంతం వంశీ కథే పెద్ద మైనస్… దేశవ్యాప్తంగా హీరోలు కొత్త కథలు, ప్రయోగాల కోసం ప్రయత్నిస్తున్నారు… తమ ఎఫర్ట్ పూర్తి స్థాయిలో పెడుతున్నారు… ఇప్పుడున్న పోటీ అంత టఫ్… ఏదో తోచిన కథను తెరపై పరిచేస్తే ప్రేక్షకులు గతంలోలాగా చూస్తారనుకోవడం హీరో, దర్శకుల ఫాల్ట్… అవునూ, నాగార్జున కూడా ఏమీ పట్టించుకోవడం లేదా..? కొడుకు కెరీర్‌ను వదిలేశాడా..!?
Share this Article