మీడియా అంటే… తాము ఎవరి పల్లకీ మోస్తున్నారో, వారికి అనుగుణంగా వార్తల్ని మలుచుకుని, ప్రజల్లోకి ఆ పైత్యాన్ని ప్రసారం చేయడం… ప్రచారం చేయడం… జనం బుర్రల్లోకి ఎక్కించడం…! ఇంతకుమించి మీడియా ఏదో చేస్తుందనీ, సొసైటీ బాగుకు ఉపయోగపడుతుందనీ, సమాచార దీపికలు అనీ ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది… ప్రత్యేకించి తెలుగు దినపత్రికల సంగతి కొంత తెలుసు కదా…
నమస్తే తెలంగాణ కేసీయార్ డప్పు… సాక్షి జగన్ చిడుత… ఆంధ్రజ్యోతి, ఈనాడు చంద్రబాబుకు మృదంగాలు… వెలుగు మోడీ కీర్తనల ఆల్బమ్… నవతెలంగాణ, విశాలాంధ్ర, ప్రజాశక్తి, ప్రజాపక్షం ఎట్సెట్రా ఎర్ర కంజీరలు… సరే, కొట్టుకోనివ్వండి, ఎవడి బాజా వాడిది… కానీ ఎవరో ఓ గెస్టు రాష్ట్రానికి వస్తే, ఏదో మాట్లాడితే, ఆ మాటల్ని కూడా తమ రాజకీయ విధానాలకు అనుగుణంగా మార్చుకుని, ప్రయారిటీలు ఇచ్చి పబ్లిష్ చేసుకోవడమే నవ్వొచ్చే అంశం…
రజినీకాంత్ ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాల కోసం రాష్ట్రానికి వచ్చాడు… ఏదో మాట్లాడాడు… పాపులారిటీలో మాత్రమే గొప్పతనం సంపాదించిన రజినీకాంత్ వక్తగా చాలా పూర్… పైగా టార్గెటెడ్‌గా, ఫోకస్‌డ్‌గా ఉండదు… కలగూరగంప… చంద్రబాబును, ఎన్టీయార్‌ను, కేసీయార్‌ను, హైదరాబాద్‌ను ఏకకాలంలో మెచ్చుకుని, నేను బ్యాలెన్స్ చేస్తున్నానని అనుకున్నాడు గానీ అది ‘ఎటూ కాని రకం’ అయిపోయింది… కాకపోతే తనకు చంద్రబాబు అంటే ప్రేమ ఎక్కువ… కాబట్టి చంద్రబాబు కీర్తన కాస్త ఎక్కువైంది…
Ads
ఏమిటో ఎన్టీయార్‌ను నటుడిగా మాత్రమే చూసినట్టున్నాడు రజినీకాంత్… ఎన్టీయార్ రాజకీయ విధానాల మీద ఏమాత్రం అవగాహన కూడా లేనట్టుంది… పెద్దగా టచ్ చేయలేదు… ఆ నటనకు సంబంధించి కూడా సొల్లు మాటలే… ఆయన డైలాగులు విని తెలుగు నేర్చుకున్నాను, ఆరేడేళ్ల వయస్సులో పాతాళ భైరవి చూశాను ఎట్సెట్రా వ్యాఖ్యలు… ఇక వాటి గురించి మాటలు అక్కర్లేదు గానీ…
22 ఏళ్ల తరువాత హైదరాబాదులో తిరుగుతుంటే న్యూయార్క్ అనిపించిందన్నాడు… ఇంకేముంది..? దాన్నే లీడ్ తీసుకుని నమస్తే తెలంగాణ తమ కేసీయార్‌కు కీర్తికిరీటాలు తొడుక్కుంది… (ఏమాటకామాట… ఈ ఒక్క విషయంలో రజినీకాంత్ చెప్పింది నిజం… పదేళ్ల క్రితం హైదరాబాదుకూ ఇప్పటి హైదరాబాదుకూ పోలిక లేదు… ఈమధ్య వీసా పని మీద ముంబై, చెన్నై వెళ్లి, ఆ బజారుల్లో తిరుగుతుంటే మోడరన్ హైదరాబాద్‌తో వాటిని పోల్చడమే దండుగ అనిపించింది…)
ఆంధ్రజ్యోతికి చంద్రబాబు డప్పు దొరికితే ఊరుకుంటుందా..? మోత మోగిపోతుంది కదా… రజినీకాంత్ మాటల్లోని చంద్రబాబు కీర్తనను పట్టుకుని మురిసిపోయింది… అదే ప్రయారిటీగా అచ్చొత్తి, సంబరంగా మెటికలు విరిచింది… పదే పదే చంద్రబాబు మాటల్లో వినిపించే డొల్లు, సొల్లు రజినీ మాటల్లో కూడా… కేవలం చంద్రబాబు కారణంగానే వేలాది మంది ఐటీ రంగంలో రాణించి, విదేశాలకు వెళ్లినట్టు..! చంద్రబాబు చెప్పినట్టుగా కంప్యూటర్ కనిపెట్టిందీ చంద్రబాబే అని సొల్లలేదు, సంతోషం… హైదరాబాద్ నిర్మించిన చంద్రబాబు మరి అమరావతి ఎందుకు కట్టలేకపోయాడు రజినీ… ఎప్పుడూ ఇలాంటివే మాట్లాడతావా..?
రజినీకాంత్ వార్తను కవర్ చేయకుండా ఉండలేదు, ఆయన మాటల్లోని చంద్రబాబు స్తుతివాక్యాల్ని పబ్లిష్ చేయలేదు… అందుకే సాక్షి ఎన్టీయార్ మీద రజినీ పొగడ్తలను రాసుకుని, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది… సాక్షి ఏడుపు, ఐమీన్ బాధ అందరికన్నా డిఫరెంట్… అది నమస్తేకు నకలు… ఈనాడు, ఆంధ్రజ్యోతికి వ్యతిరేకపదం…
ఈనాడు కూడా చంద్రబాబు పత్రికే కదా… చంద్రబాబు విజన్ మీద రజినీ మాటల్ని హైలైట్ చేసింది… మరీ బాగుండదు, ఆంధ్రజ్యోతిలా ఉండలేం కదా అనుకుని ఎన్టీయార్ మీద వ్యాఖ్యలకు కూడా ప్రయారిటీ ఇచ్చింది… ఇక్కడ చిత్రం ఏమిటంటే… న్యూయార్క్‌ను తలదన్నేలా హైదరాబాద్ డెవలపైంది అని రజినీ కామెంట్‌ను నమస్తే కేసీయార్‌కు అనుకూలంగా, ఈనాడు చంద్రబాబుకు అనుకూలంగా మార్చేసుకున్నాయి… రజినీకాంత్‌కు సినిమా కథ రచయితల గురించి బాగా తెలుసేమో… కానీ వాళ్లను మించినవాళ్లు, వక్రబాష్యాల్లో, బాకాల్లో, బాజాల్లో మా పత్రిక రచయితలు సిద్ధహస్తులు అనే విషయం ఇప్పుడు తెలుసుకుంటాడేమో…!!
మిస్టర్ హిపోక్రాట్… తమరు ఇప్పుడు యుగపురుషుడు అని తెగ కీర్తిస్తున్న సదరు ఎన్టీయారుడికి వెన్నుపోటు పొడిచినప్పుడు, ఇక్కడికి నవ్వు వచ్చావు, చంద్రబాబుకు జై అన్నావు, తెలుగుదేశం (వెన్నుపోటు శిబిరం)కు నైతిక భరోసా ఇచ్చావు… గుర్తుందా..? ఇప్పటి తెలంగాణ సీఎం కేసీయార్ కూడా అప్పట్లో చంద్రబాబు అనుచరుడిగా నీ వెనుకే అమాయకంగా నిలబడి ఉన్నాడు, చూశావా..? ఇప్పుడు ఎన్టీయార్ గొప్పతనం కళ్లముందు కదలాడుతోందా..?!
Share this Article