మనం ఇంతకు ముందు కొన్నిసార్లు చెప్పుకున్నాం… ఫాఫం, అంతటి పేరున్న దర్శకుడు టి.కృష్ణ కొడుకు గోపీచంద్ ఎక్కడికి జారిపోయి, కొట్టుకుంటున్నాడో, సగటు తెలుగు దరిద్రపు ఇమేజీ బిల్డప్పుల ఫార్ములా కథల్లో పడి, తనను తాను ఎలా కెరీర్‌ను ధ్వంసం చేసుకున్నాడో…! ఏళ్లుగా హిట్ లేక, ఫస్ట్ షోకు కూడా పెద్దగా జనం లేని ‘పక్కా కమర్షియల్’, ఆరడుగుల బుల్లెట్ ఎట్సెట్రా తన సినిమాల దురవస్థకు కారణాలేమిటో అన్వేషించుకోలేని దుస్థితిని కూడా ప్రస్తావించుకున్నాం… గోపీచంద్ పనైపోయింది అనే పరిస్థితికి కారణమేంటో ఇక తనే సమీక్షించుకోవాలనీ హితవు చెప్పాం…
ప్చ్… పదే పదే అదే తప్పు… మరో ఫక్తు రొటీన్ సినిమా తీశాడు… పేరు రామబాణం… ఈ దెబ్బకు అసలే ఐసీయూలో చేరిన తన కెరీర్‌కు మరో స్ట్రాంగ్ ఇన్‌ఫెక్షన్… తన కథల ఎంపిక ఫక్తు బ్లండర్… తను ఎందుకు సినిమాలు తీస్తున్నాడో, ఎందుకు ఇంకా లోపలకు కూరుకుపోతున్నాడో తనకే తెలియాలి… ఫాఫం, ఓ మంచి నటుడు చేజేతులా కెరీర్‌ను ధ్వంసం చేసుకుంటున్న చప్పుళ్లు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి…
గోపీచంద్ ఇప్పటికీ అదే తొక్కలో నాసిరకం తెలుగు సినిమా ఫార్ములా నుంచి బయటికి రాలేడు… రావడం లేదు… అవేమో వర్కవుట్ కావు… వాటిని జనం ఛీఛీత్కరిస్తున్నారనే సోయి కూడా తనకు లేదు… కనీసం తన చుట్టూ తెలుగు ఇండస్ట్రీలో, ఇతర భాషల ఇండస్ట్రీల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ధ్యాస కూడా లేదా..? చివరకు ఒకప్పటి బూతు దర్శకుడు మారుతి తన మార్క్ కామెడీని, హీరోయిక్ యాక్షన్‌ను కలగలిపిన ఓ తిక్క వంటకంలోకి తనను లాగుతున్నాడనే దృష్టి కూడా లేకుండా పోయింది… వెరసి పక్కా కమర్షియల్ అనబడే ఓ సినిమా బుడగ ఫట్‌మని పేలిపోయింది…
Ads
తనకు గతంలో హిట్స్ ఇచ్చిన శ్రీవాసు అనే దర్శకుడిని నమ్ముకున్నా… తనూ గోపీచంద్‌ను అడ్డంగా ముంచేశాడు… జాగ్రత్తగా కథలు, బ్యానర్లు, దర్శకులను ఎంపిక చేసుకుని, కొంతలోకొంత ప్రయోగాలకు చాన్స్ తీసుకుంటే గోపీచంద్ కెరీర్ వెలిగిపోయేది… ఇప్పటిలా బావిలో పడ్డట్టు ఉండకపోయేది… నిజానికి ఈ రామబాణం సినిమాకు రివ్యూ కూడా అనవసరం… తన కెరీర్ రివ్యూ గోపీచంద్ కు అవసరం… తను ఇండస్ట్రీలో ఉండాలని అనుకుంటున్నాడా, వెళ్లిపోతాడా తేల్చుకోవాలి… ఎంత మంచి నటుడు అయితేనేం..? ఏ ఒక్క కోణంలోనూ రామబాణం సినిమా గురించి పాజిటివ్‌గా చెప్పడానికి ఏమీ లేదు… మరొక్క సినిమా ఇలాంటిది పడితే మాత్రం… ‘‘అప్పట్లో గోపీచంద్ అనే ఓ మంచి నటుడు ఉండేవాడు’’ అని చెప్పుకోవాల్సిందే…
రామబాణం సినిమానే తీసుకుంటే… హీరోయిన్ డింపుల్ ఉండీ లేనట్లే… మరో రెండుమూడు పాత్రలు అసలు కథకు సంబంధం లేకపోయినా, ప్రాధాన్యం లేకపోయినా కనిపిస్తాయి… విలన్ తరుణ్ అరోరా కూడా పెద్దగా రాణించలేదు… సినిమాలో ప్రధాన పాత్రలు రెండే… గోపీచంద్, జగపతి బాబు… గోపీచంద్ మంచి నటుడే అయినా సరే, జగపతిబాబు తన అనుభవాన్ని మొత్తం రంగరించిన కారణంగా కొన్నిసీన్లలో గోపీచంద్‌ను జగపతిబాబే డామినేట్ చేసినట్టు అనిపిస్తాడు…
సినిమాలో ఏదీ తక్కువ కాకూడదు అనుకుని, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ గట్రా అన్ని మసాలాలూ దట్టించినా సరే… అది ఏ యూనిక్ రుచి లేని నాసిరకం వంటకంగా మారిపోయింది… దానికి ప్రధాన కారణం కథలో కొత్తదనం లేదు… పాతచింతకాయపచ్చడి కథ… చాలామంది దర్శకులు కొట్టీ కొట్టీ నలిగిపోయిన కథే అది… ఇక అందులో చేయడానికి ఎవరికైనా ఏ స్కోపూ లేదు… దర్శకత్వపు మెరుపులు కూడా ఏమీ లేవు… ఏదో టైంపాస్ పల్లీ వ్యవహారం అనుకుందామా అంటే… మ్యూజిక్ పెద్ద మైనస్… పర్లేదు, ఓటీటీలో గానీ టీవీలో గానీ చూడొచ్చు… అసలు నిజానికి అదీ అఫర్డ్ చేయాల్సిన పనేమీ లేదు…
Share this Article