పార్ట్-1, 2 చదివారు కదా… అసలు హస్తిన మీద యుద్ధం చేస్తానని కత్తీడాలు తిప్పిన కేసీయార్ ఢిల్లీ వెళ్లిరాగానే ఎందుకు అకస్మాత్తుగా వైరాగ్యంలోకి జారిపోయాడు..? ఆధ్యాత్మిక చింతన, వానప్రస్థం ఆలోచనల్లోకి ఎందుకు వెళ్లిపోయాడు..? రాజకీయ సన్యాసం వైపు అడుగులు ఎందుకు వేస్తున్నాడు..? అన్నీ ప్రశ్నలే… ఎప్పుడూ లేని ఆరోగ్యస్పృహ ఇప్పుడే ఎందుకొచ్చింది..? అసలు అధికారంలో ఉన్నప్పుడు అనారోగ్యాలూ దూరదూరంగానే ఉండిపోతాయి కదా..! సింపుల్… 1) బీజేపీ ప్రాంతీయ పార్టీలను దేశంలో ఉండనివ్వదు… దాని పొలిటికల్ లైన్ అది… చంద్రబాబును, జగన్‌ను తాత్కాలికంగా స్పేర్ చేస్తున్నా అది టైమ్ బీయింగ్ టాక్టిస్ మాత్రమే… 2) తెలంగాణ కుర్చీ మీద దాని కన్నుపడింది… 3) తెలంగాణలో స్పేస్ దొరుకుతోంది… 4) తమకు వ్యతిరేకంగా కూటమి కడుతూ, మిగతా పార్టీలకు డబ్బు సాయం కూడా చేసే కేసీయార్‌ను ఇక ఉపేక్షించవద్దనేది బీజేపీ అగ్రనాయకత్వం ఆగ్రహం… 5) అందుకే తన ఆర్థిక స్థంభాల వెంటపడింది… ఆదాయమార్గాల్ని కట్టడి చేయడమే కాదు, అవసరమైతే కేసీయార్‌ను తీవ్రంగా ఇరుకునపెట్టే రీతిలో ఫైళ్లు ప్రిపేర్ చేసుకుంది… 6) ఢిల్లీకి పిలిచి చూపించింది… 7) బీజేపీ ప్రత్యర్థులకు డబ్బు సాయం చేసే జగన్, కేసీయార్ ఇప్పుడు బెంగాల్ ఎన్నికల ఖర్చు కోసం బీజేపీకే డబ్బు సర్దుబాటు చేయమన్నారట… నిజమో, కాదో ఏ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణో వచ్చే ఆదివారం కొత్తపలుకులో రాయాల్సిందే… 8) ఇక తెలంగాణలో రాబోయే ప్రతి ఎన్నిక టఫ్‌గా ఉండబోతోంది… 9) ఇంతకుముందు పార్టీకి బలంగా ఉన్న తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు లేదు… ఇప్పుడంతా ఫక్తు రాజకీయమే కదా… 10) కేసీయార్ సంక్షేమ పథకాలు వోట్లు రాల్చుతాయనే నమ్మకం ఇప్పుడు లేదు…
ఇన్ని కారణాల రీత్యా కేసీయార్ వెళ్లి ఢిల్లీలో కత్తీడాలు తిప్పే పరిస్థితి లేదు… అంతేకాదు, దేశంలో బీజేపీయేతర నాయకుల స్థితి చూద్దాం… కాశ్మీర్లో ముఫ్తీ, ఉమర్ వెన్నులు విరగ్గొట్టేశారు, నవీన్ పట్నాయక్ పోరాడే స్థితిలో లేడు… శరద్ పవార్ కేసీయార్‌ను నమ్మడం లేదు… మమతకు తన ఇల్లు చక్కబెట్టుకోవడమే కష్టమవుతోంది… నితిశ్‌కు మెల్లిగా పొగపెడుతున్నా తను మాట్లాడి, ఎదురుతిరిగే సీన్ కనిపించడం లేదు… ఉద్దవ్ ఠాక్రే చంచల స్వభావం… కుమారస్వామి కాంగ్రెస్‌తో కలిసి తప్పుచేశామంటూ బోరుమంటున్నాడు… సో, ఏ ప్రాంతీయ పార్టీ నేత కూడా కేసీయార్ చెప్పగానే వచ్చి తనతో కలిసే సూచనల్లేవు… గతంలో ఒకటీరెండు ప్రయత్నాలు చేసినా ఎవరూ పెద్దగా రెస్పాండ్ కాలేదు… స్టాలిన్ కాంగ్రెస్‌ను వదిలి వేరే కూటమిలోకి రాడు… లెఫ్ట్ కూడా వీలయితే కాంగ్రెస్ సారథ్యంలోని యాంటీ-ఎన్డీఏ కూటమికే సై అంటుంది… అసలు 2022లో జరిగే ముందస్తు జమిలి ఎన్నికల్లో తెలంగాణలో తనకు ఎన్ని సీట్లు వస్తాయో కేసీయార్‌కే తెలియదు… అందుకని జాతీయ రాజకీయాల్లేవ్, ప్రాంతీయ పార్టీల సమాఖ్యల్లేవ్, హస్తినలో గాయిగత్తర లేపే ఆలోచనల్లేవ్… అసలు కత్తినే పట్టుకోడు… అది ముగిసిన అధ్యాయం…
Ads
సో, రాజకీయ సన్యాసం స్వీకరించాక ఏం చేస్తాడు అనేది మరో ప్రశ్న… పార్టీలో హరీష్ రావు తదితరులు ఏం చేస్తారు అనేది ఇంకో ప్రశ్న… ప్రస్తుతానికి హరీష్‌రావుకు పార్టీలోనే కొనసాగడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు… ఒకవేళ సొంత పార్టీ పెట్టినా సరే, కేసీయార్ వ్యతిరేక వోటు చీలిపోయి, మళ్లీ కేటీయార్‌కే లాభం… ఈలోపు రేవంత్ కొత్త పార్టీ పెడితే యాంటీ-కేసీయార్ వోటు మరింత చీలిపోతుంది… పైగా పార్టీలోనే ఉంటూ ఓ ప్రెజర్ గ్రూపుగా ఉండటం వేరు, పార్టీని విడిచిపెట్టి బయటికివస్తే ఇప్పటిదాకా సై అంటున్నవాళ్లు కూడా వెంటరాకపోవచ్చు… ఒక్కసారి పైపైన చూస్తే టీఆర్ఎస్లో ఆ పాత తెలుగుదేశం బాపతు నాయకులే ఎక్కువ… యాంటీ-తెలంగాణ ముద్ర పడ్డవాళ్లూ మంచి పదవుల్లో ఉన్నారు… ఇలాంటోళ్లు అవసరాన్ని బట్టి ఎటయినా జంప్ చేయగలరు… ఇలా రాష్ట్ర రాజకీయం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ఎవరూ అంచనా వేయలేని స్థితి… కేటీయార్ నిజంగానే సీఎంగా పగ్గాలు చేపడితే, ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ ఉండదు… ఆ రథం నడుస్తూనే ఉంటుంది, తనకు ఏ థ్రెట్టూ ఉండదు… కానీ పార్టీని పూర్తిగా తన అదుపాజ్ఞల్లో ఉంచుకోగలడా..? ఉన్న బలాన్ని కాపాడుకోగలడా..? అదొక్కటే కాలం బదులు చెప్పాల్సిన ప్రశ్న..!!
Share this Article