Gurram Seetaramulu………. ఒకప్పుడు ఈ దేశంలోకి వామపక్ష రాజకీయాలు బయలుదేరినప్పుడు ఈ దేశంలో పీడక కులాలే తమ ఇళ్ళల్లో ఆశ్రయం ఇచ్చాయి. నాయకత్వం కూడా పీడక కులాల చేతిలోనే ఉండేది. ఇది కేవలం ఒక్క ప్రాంతంలో జరిగిన కథ కాదు.
ప్రతి ప్రత్యామ్నాయ మార్పు వెనక ఆధునికతను అర్ధం చేసుకున్న సమూహాలే ముందుకు వస్తాయి ఆ ఉద్యమాలకు వాన్ గార్డ్ లాగా ఉంటాయి. ఇలా పీడక కుల వాసన లేని చోట కూడా ప్రజాఉద్యమాలు పెల్లుబికాయి. అది బస్తర్ కావొచ్చు, శ్రీకాకుళం కావొచ్చు, జనతన సర్కార్ కావొచ్చు. ఇక్కడ ఉద్యమాలు ఉన్నాపోయినా అవేసిన మార్పు పునాది గొప్పది.
రెడ్లు బలంగా ఉన్న దగ్గర కమ్మలు , కమ్మలు బలంగా ఉన్న దగ్గర రెడ్ల దగ్గర ఈ సర్దుబాటు జరిగేది. ఈ రెండు కులాలు లేని దగ్గర బాపన, నియోగి కులాలు వాటికి చేదోడు అయ్యాయి.
Ads
ఇక్కడ X Y Z అనే మూడు సమూహాలు ఎర్రజెండాలను ఎత్తుకోవడం వెనక ఒకటి భూమి, రెండు అధికారం, మూడు ఆధిపత్యం. ఈ మూడూ బలంగా పనిచేశాయి. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన ప్రాంతాలలో ఆసక్తికరమైన సంఘటనలు నేను కొన్ని నమోదు చేసాను. భూమి, అధికారం, ఆధిపత్యం ఒక దాని తర్వాత మరొకటి కుర్చీల ఆటలాగా మారుకుంటూ వచ్చింది.
ఒక వూరిలో X ఒక ప్రజాకంటకుడు ఉంటాడు. అక్కడ భూమి మొత్తం వందల వేల ఎకరాలు వాడి కబ్జాలో ఉంటుంది. ప్రజలు అరిగోస పడతారు. హత్యలు, దోపిడీలు, రేప్ లు సహజంగా ప్రజల మీద జరుగుతూనే ఉంటాయి. అక్కడ Y నాయకత్వంలో పార్టీ బలంగా సమీకరించి, అవసరం అయితే X ని చంపేసి, అక్కడ ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగేలా చేస్తాడు. భూమి మాత్రం X సామాజిక వర్గం నుండి Y సామాజిక వర్గానికి బదిలీ అవుతుంది.
మరొక్క చోట Y నుండి Z కి బదిలీ అవుతుంది. అలా గడిచిన డెబ్బై ఏళ్ళలో భూమి స్థిరంగా అదే దోపిడీ కులాల చేతిలోనే ఉంది. మార్పు కోసం తమ రక్తాన్ని సాకబోసిన సామాన్యుల స్తూపాలు తెలంగాణ రచ్చబండల దగ్గర మనల్ని వెక్కిరిస్తూ ఉంటాయి. ప్రతి ప్రత్యామ్నాయ మార్పు వెనక త్యాగాలు ఉంటాయి అనే ఎరుక ఉంది.
ఇక్కడ XYZ కులాలు కాకుండా పార్టీ అని అన్వయించుకున్నా… అదే దోపిడీ పీడన చర్విత చరణంగా పునరావృతం అవుతూనే ఉంది. ఈ వందేళ్ళలో అధికార మార్పిడి మూలంగా XYZ సమూహాలు తప్ప ఎవరి బ్రతుకు చూసినా ఇంతే ఉంది.
మా ఖమ్మం రాజకీయ ముఖ చిత్రం బహు కంపరంగా ఉంటది. ఇక్కడ సాహిత్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక సూటిగా మాట్లాడుకుంటే తెలంగాణ ఉద్యమం పీక్ లో ఉన్నప్పుడు మా ఖమ్మం నడి బొడ్డుమీద శ్రీశ్రీ విగ్రహం పెట్టారు. నాకు విగ్రహాలు అంటే కంపరం.
ఆనాడు మీటింగ్ లో వేలాది మంది ఉండగా ఇప్పటి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ ఒక మాట అన్నాడు. అదే ఆంధ్రాలో మా కాళోజీ , దాశరధి విగ్రహం పెట్టే నిగ్రహం ఆంధ్రా సమాజానికి ఉందా అని ఒక సవాలు విసిరాడు. తెలంగాణ వ్యతిరేకి ఆయన శ్రీశ్రీని ఒక కవిగా ఆదరించి విగ్రహం నిలబెట్టే ఔదార్యం తెలంగాణ సమాజానికి ఉంది. కారణం అది బాధిత గొంతు కనుక.
లకారం చెరువు ఒకప్పుడు వందల ఎకరాలు సాగుభూమికి తాగు నీటికీ పెద్ద వనరు. ఇప్పుడది కబ్జాల పాలయి కాసినో డాన్స్ లు వేస్తోంది. నేను చెరువుల పరిరక్షకున్ని కాదు, వనరుల రక్షకున్ని అసలే కాదు. సాంస్కృతిక దోపిడీ పెత్తనం మీద నా అభిప్రాయాన్ని చెప్పడం మాత్రం కాదు.
ఈ నెల ఇరవై ఎనిమిది నాడు ఖమ్మం లకారం చెరువు మధ్యలో యాభై ఆరు అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు. దాని ఆవిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు. ఆయనదేముంది కల్వకుంట్ల తారక రామారావు వచ్చినా నాకేమీ ఆశ్చర్యం లేదు. ఇంకా చెప్పుకుంటే ఈ విగ్రహ ఖర్చు రెండున్నర కోట్లు.
మా ఖమ్మం లో నెహ్రూ, ఇందిర, అంబేద్కర్, జగ్జీవన్ రాం విగ్రహాలు ఉన్నాయి, కొందరు కవులు మేదావులవి కూడా . ఆంధ్రాలో, తెలంగాణలో ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అవనతం చెందిన దశలో… తెలంగాణలో.అసలు ఉనికే లేని కాలంలో శతజయంతి సందర్భంగా విగ్రహం పెడుతున్నారు.
డబ్బులు ఉన్నాయి పెట్టుకుంటున్నారు. నిజంగా విగ్రహం పెడితే ఆయన పుట్టిన రాష్ట్రంలో, ఆయన గెలిచిన నియోజక వర్గంలో, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన హైదరాబాద్ లో పెట్టుకోవచ్చు. కానీ ఖమ్మంకు మాత్రమే ఇటువంటి స్పేస్ ఉంటది, దానికి కారణం ఇక్కడ X Y Z రాజకీయ పార్టీలు,
X Y Z కవులు కళాకారులు, X Y Z ML పార్టీలు X Y Z విద్యాసంస్థలు అన్నీ ఒకే చిలుక పలుకు పలుకుతాయి. ఒకవేళ ఏవన్నా X Y Z డిసెంట్ గొంతులు ఉంటే, వాళ్ళు వోటింగ్ పెడితే వందశాతం ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలి అంటారు. కారణం కులానికి ఎరుక, వాటి వెనక ఉన్న కాసులకి ఎరుక.
ఈ విగ్రహం ఒక తెలంగాణ కాబినెట్ మినిస్టర్ కనుసన్నల్లో, ఒక అమెరికా కుల సంఘ పర్యవేక్షణలో జరుగుతోంది అని వేరే చెప్పక్కరలేదు. మొత్తంగా ఇక్కడివాడిగా నాకు అర్ధం అయ్యింది ఒకటే. తెలంగాణ సాంస్కృతిక దోపిడీకి గేట్ వే ఖమ్మం. బానిస గిరికి అలవాటు పడ్డ సమాజం ఖమ్మం.
ఇప్పుడు ఒక మాట. మొత్తం ఆంధ్రాలో ఎంతమంది తెలంగాణ వాదులవి కవులవి, మేధావుల విగ్రహాలు ఉన్నాయో చెప్పాలి. ఖమ్మం మాత్రమే ఈ విగ్రహ స్థాపనకు కేంద్రం ఎందుకు అయ్యిందో చెప్పాలి. సింపుల్… ఇది విగ్రహాల మాటున సాంస్కృతిక పెత్తనం తప్ప మరొకటి కాదు. అందుకు కదా ట్యాంక్ బండ్ ని , మిలియన్ మార్చ్ ని ఆత్మగౌరవ ప్రకటనకు చిరునామాగా మేము చెప్పుకునేది….
Share this Article