Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈనాడును అప్పట్లో వరంగల్‌లో కొట్టిపడేశాం… పాత్రికేయుడిగా అదొక కిక్కు…

May 8, 2023 by M S R

Prasen Bellamkonda…….   ఈనాడు విలేకరి రాలేదా, వచ్చాక ప్రెస్ మీట్ మొదలెడదాం… అనే అనుభవం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఈనాడేతర విలేకరినీ వేధిస్తూనే ఉంటుంది. ఈ చిరాకు గురించిన Murali Buddha పోస్ట్ ఈనాడు లేదా రామోజీ క్షీణ స్థితిని కళ్ళకు కడుతూ.. బాగుంది.

ఈ మంట నాకూ ఉండేది. అదేంటి అలా ఎలా ప్రెస్ మీట్ ఆపుతారు అని నేను ఘర్షణ పడ్డ సందర్భాలూ ఉన్నాయి. అయినా మనం ఆఫ్ట్రాల్ ఆంధ్రభూమి ప్రతినిధి కావడంతో కేరెజాట్ అని బతిమాలినట్టు నటించి, ఈనాడు విలేకరి వచ్చే వరకూ ఆపడంలో మాత్రం మార్పుండేది కాదు. అది సర్క్యూలేషన్ అడ్వాంటెజ్. నేను భూమిలో రాసిన స్టోరీ పది రోజుల తరవాత ఈనాడులో వస్తే కౌంటర్ ప్రెస్ మీట్లు, ఖండనలు హడావిడి నానా రచ్చ ఉండేది. అదే మనం ఎంత ‘ఫస్ట్ ఆన్ భూమి’ అని మొత్తుకున్నా కనీసం పెడచెవినయినా పెట్టకపోయేవారు. ‘ నేనయినా ఈనాడు విలేకరి అయినా ఒకటే కాపీ రాస్తాం. ఎన్ని కాపీలు అచ్చేసుకుంటారన్నది రామోజీ రావ్, వెంకట్రామ్ రెడ్డి సమస్య ‘ అని ఓ తర్కం విసిరి సంతృప్తి పడే వాడిని.

అయితే బుద్దా మురళి ఇప్పటి క్షీణ ఈనాడు గురించి రాసారు గానీ నాకు మాత్రం పగ తీర్చుకుని నా ఈగో ను సంతృప్తి పరుచుకునే అవకాశం ఈనాడు ఉచ్ఛ దశలో వున్నపుడే దొరికింది.

Ads

అదెలాగంటే?….

నేను ఆంధ్రజ్యోతి వరంగల్ బ్యూరో ఇంచార్జ్ గా 2002 లో ఎంట్రీ ఇచ్చాను. అప్పటికి జ్యోతికీ ఈనాడుకూ సర్క్యులేషన్లో చాలా తేడా ఉండేది. ఆ తేడాను తగ్గించడానికే నన్నక్కడ ల్యాండ్ చేశారు. అయితే అంతకు మించి జరిగింది.

మామూలు కథనాలనే నాదైన ప్రత్యేక శైలిలో ప్రజెంట్ చెయ్యడం, ప్రత్యేక కథనాలను మరింత దూకుడుగా సమర్పించడం వంటి అంశాలు నాకు కలిసొచ్చాయి. కేసీఆర్ మరోకోణం, సమ్మక్క సారక్క స్థలపురాణాలు, ఒక ఎయిడ్స్ బాధితురాలితో ముఖాముఖి, గోల్కొండ రైలు ప్రమాదం కవరేజ్ లో చూపిన స్పీడు, కొన్ని స్కామ్ లు, ఇలా అనేక రాతలు జ్యోతి సర్క్యూలేషన్ ను బాగా పెంచాయి. ఎనిమిది నెలల్లోనే వరంగల్ జిల్లా ఈనాడు సర్క్యూలేషన్ కంటే జ్యోతి సర్క్యూలేషన్ రెండొందల కాపీలు ఎక్కువైయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈనాడును బీట్ చేసిన ఏకైక జిల్లా వరంగల్.

అప్పట్లో ఈ సంవత్సర చందాలు చేర్పించి ప్రతులు పెంచే స్కీములు లేవు సుమా. నాకు మంచి టీమ్ ఉండేది. సెకండ్ స్టాఫర్ రమేష్, క్రైమ్ రమేష్,సూర్య ప్రకాష్, జయరాజ్, ధనుంజయ్, రవీందర్ ఇంకా చాలా మందితో మంచి సైన్యం నాది. అంతకు ముందు ఈనాడు విలేకరి వచ్చే వరకూ ఆగే ప్రెస్ మీట్ లు ఈ దెబ్బతో జ్యోతి విలేకరి వచ్చే వరకూ ఆగుతున్నాయి. నా టీమ్ కు ఇది కొత్త అనుభవం. దాన్ని నా టీమ్ బాగా ఆస్వాదించింది. ‘సార్..చాలా గర్వంగా వుంది ‘ అనేవాళ్ళు.

అప్పుడు వరంగల్ ఈనాడుకు రామకృష్ణ బ్యూరో ఇంచార్జ్ గా వుండే వాడు. వార్తల్లో ఎంత రైవల్రీ ఉన్నా మేం ఇద్దరం చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. అతను ఒక రకంగా చెప్పాలంటే ‘అన్ ఈనాడు’ తరహా విలేకరి. డౌన్ టు ఎర్త్ ఉండేవాడు. నేను ప్రెస్మీట్ కు లేట్ గా వెళితే ‘గురువుగారూ.. మా మీద పగ తీర్చుకోవడానికే మీరు లేట్ గా వచ్చారు కదూ ‘ అనేవాడు నవ్వుతూ నా చెవిలో. మంచాల శ్రీనివాసరావ్ గారు కూడా ఆ టైంలో ఈనాడు వరంగల్ లోనో, హైదరాబాద్ లోనో హయ్యర్ పొజిషన్ లోనో ఉన్నట్టు గుర్తు.

నేను వరంగల్ నుంచి బయటకు వచ్చే వరకూ ఆ ఆధిపత్యం అలాగే కొనసాగింది. నా కొన్ని సంవత్సరాల ఫ్రస్ట్రేషన్ కు అలా వరంగల్ ఒక రిలీఫ్. ‘జ్యోతి విలేకరి రాలేదా.. ఓ పది నిముషాలాగుదాం’ అన్న భావనే మనోభావాలను తెగ సంతృప్తి పరిచేది.

అప్పుడు రామచంద్రమూర్తి గారు ఎడిటర్. కె. శ్రీనివాస్ గారు ఎడిటర్ ఇన్ మేకింగ్. ఆయన నాకు పూర్తి అండగా వున్నారు. నా కొన్ని అవుటాఫ్ బాక్స్ రాతలకు కూడా ఆయన పచ్చ జెండా ఊపడం వల్లే ఆ సక్సెస్ సాధ్యమైంది. హరిబాబు, జాన్ రెడ్డి, కృష్ణ ప్రసాద్ లాంటి టాబ్ ఫస్ట్ పేజ్ అందంగా డిజైన్ చేసే ఎడిషన్ ఇంచార్జ్ లు ఉండేవారు. ఇతర స్టాఫర్లు కొండల్, లెనిన్, శివ నాకు మంచి అండ. ఈనాడును కొట్టడం అనేది ఎవరికైనా కిక్కిచ్చే అంశమే కదా.

క్రెడిబులిటి దెబ్బతిన్నమాటైతే నిజమే, విలువల విషయంలో చాలా కిందికి జరిగిన మాట కూడా నిజమే కానీ ఇప్పటికీ ఈనాడు ఆధిపత్యం అలానే ఉంది… ఇదంతా నేనేదో నా గొప్ప చెప్పుకోవడానికి రాయట్లేదు. ఇది కేవలం బుద్దా మురళి కదిల్చిన తుట్టె . మొన్నటి బుద్ధా మురళి రాసిన పోస్టు చదవనివారి కోసం ఆ లింక్ ఇదుగో… 

ఈనాడు రిపోర్టర్ ఇంకా రాలేదా..? కాసేపు ఆగి ప్రెస్‌మీట్ స్టార్ట్ చేద్దాం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ చెత్త మొహాల పారితోషికాల్ని కట్ చేయండి, వందల మంది బతుకుతారు…
  • యోగీ భాయ్… ఎవరో గానీ నిన్ను ముందుజాగ్రత్తగా తొక్కేస్తున్నారు భయ్యా…
  • ‘‘గతేడాది బతికే ఉన్నానేమో గుర్తులేదు.., ఇప్పుడయితే బతికే ఉన్నా.,.‘‘
  • బీసీ రిజర్వేషన్లు… క్రెడిట్ రేవంత్‌రెడ్డిది… ఎవరెవరో హైజాక్ ప్రయత్నాలు…
  • కీచక ప్రజ్వల్ కేసు..! న్యాయవ్యవస్థపై ఆశల్ని బతికించే తీర్పు..!!
  • వినుడు వినుడు విజయవాడ వెతలూ… వినుడీ జనులారా..!!
  • ఎవరు నిజమైన జర్నలిస్టు అనే ప్రశ్న సరే… అసలు జర్నలిస్టు అంటే ఎవరు..?
  • ఆహ్లాదానికీ అసభ్యతకూ నడుమ గీత చెరిపేశాడు రాఘవేంద్రుడు..!!
  • జాతీయ అవార్డు పొందిన ఆ కాసర్ల శ్యామ్ పాట ఎందుకు నచ్చిందంటే..?
  • మియా భాయ్… హేట్సాఫ్ సిరాజ్… నువ్వూ ట్రూ హైదరాబాదీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions