Murali Buddha…….. ‘రాధా బాబుల ‘బంధం……. ఫిర్యాదు చేసిన ఆర్ కే … నవ్వుకున్న నేతలు…. ఓ జ్ఞాపకం
రాధాకృష్ణ చంద్రబాబుల బంధం ఎలాంటిది.? అమలిన ప్రేమనా ? విడదీయరాని బంధమా ? జన్మ జన్మల బంధమా ? అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పవచ్చు … ఆ ఒక్కొక్కరిలో ఒకడిగా నాకూ ఓ అభిప్రాయం ఉంది .? పాతికేళ్ల నుంచి వృత్తిపరంగా చూసిన అనుభవంతో నాకూ ఓ అభిప్రాయం ఉంది .. పరస్పర అవసరం తప్ప ఇద్దరి మధ్య ఏ బంధం లేదు . పైగా బాబుకు వదులు కోవాలి అని ఉన్నా సరే, వదులుకోలేకుండా అంటుకుపోయిన బంధం అది .ఇద్దరి మధ్య పవిత్ర ప్రేమ ఉండడానికి ఏముంది ? అల్లుడే ఎన్టీఆర్ ను దించేశాడు . కుమారుడే తండ్రిని వ్యతిరేకించాడు . మామా అల్లుళ్ళు , తండ్రి కుమారుల మధ్యే లేని ప్రేమ వీరి మధ్య ఎందుకుంటుంది ? మితిమీరిన ప్రేమ ఒక్కోసారి గుదిబండగా మారుతుంది . ఐనా పరిస్థితులు ఆ బంధాన్ని వదులుకోలేవు . సరిగ్గా అలాంటి గుదిబండ బంధంలో బాబు చిక్కుకున్నారు అనేది నా అంచనా ? 96 ప్రాంతంలోనే ఈ బంధం నుంచి బయట పడేందుకు బాబు ఓ ప్రయత్నం చేశారు . కానీ కాలం కలిసి రాలేదు .
*****
Ads
నేను నీతో మాట్లాడవద్దంట … ఏమైనా అడగాలి అంటే రాధాకృష్ణను అడగాలి అట అంటూ నేను కనిపించగానే నవ్వుతూ పలకరించారు దండు శివరామరాజు … గోదావరి జిల్లా స్వచ్ఛమైన మనిషి దాపరికం ఉండేది కాదు .. హిమాయత్ నగర్ లో టీడీపీ ఆఫీస్ ఉన్నప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి .. మంత్రిగా చేశారు .
వయసు , ప్రాంతం ఒకటి కాదు కానీ స్నేహం కుదిరింది . నీతో మాట్లాడుతున్నాను అని రాధాకృష్ణ బాబుకు చెప్పారు . మన వాళ్ళు ఉన్నారు కదా ఏమైనా కావాలి అంటే మనవాళ్లతో మాట్లాడు, మురళితో ఎందుకు అని బాబు చెప్పారట … బాబుకు ఫిర్యాదు చేసినా దండు ఖాతరు చేయలేదు . ఎప్పటిలానే మాట్లాడేవారు . అధికార ప్రతినిధిగా నా పనిలో తప్పు ఉంటే చెప్పండి , నేను ఎవరితో స్నేహంగా ఉండాలో రాధాకృష్ణ ఎవరు చెప్పడానికి అన్నారు .
ఫిర్యాదు చేసినా దండు సన్నిహితంగానే ఉండేవారు .. 2001 లో తెరాస ఆవిర్భావం తరువాత తెలంగాణ వస్తుంది మురళి , నేను ఇక్కడే భూమి కొన్నాను . ఇక్కడే ఉంటాను అని అన్నారు . అప్పుడే అంత గట్టిగా ఎలా నమ్మారో తెలియదు కానీ తెలంగాణ వస్తుంది అనే వారు…
*****
ఈ రోజుల్లో కెసిఆర్ మీడియాను దూరం పెట్టారు అనే వారు నమ్మక పోవచ్చు కానీ ఆ రోజుల్లో కెసిఆర్ ఛాంబర్ జర్నలిస్ట్ లతో కిక్కిరిసి పోయి ఉండేది . 95 కన్నా ముందు క్యాబినెట్ సమావేశం జరిగాక ఇద్దరు ముగ్గురు ఇంటి జర్నలిస్ట్ లకు అప్పుడు మంత్రిగా ఉన్న చంద్రబాబు ఇన్సైడ్ స్టోరీలు చెప్పేవారు . బాబు సీఎం అయ్యాక ఇది కాస్తా విస్తృతం అయింది … కెసిఆర్ రవాణా శాఖ మంత్రి అయ్యాక క్యాబినెట్ అంటే పెద్ద సంఖ్యలో మీడియా కెసిఆర్ కన్నా ముందే ఆయన ఛాంబర్ లోకి దూరిపోయేది ..
ఒక దర్భారు తరహాలో వివిధ అంశాలపై కెసిఆర్ విస్తృతంగా మాట్లాడేవారు . మధ్య మధ్యలో క్యాబినెట్ అంశాలు , తరువాత అభివృద్ధి , దేశ రాజకీయాలు , ఆర్థిక సంస్కరణల ప్రభావం , అంతర్జాతీయ అంశాల గురించి వాక్ ప్రవాహం సాగేది … వీటి మధ్యలో క్యాబినెట్ అంశాలను ఏరుకోవడం జూనియర్లకు ఇబ్బందిగానే ఉండేది .. అలవాటు అయిన సీనియర్లకు ఈజీగానే ఉండేది . ఓ క్యాబినెట్ రోజు కెసిఆర్ ఛాంబర్ లో జర్నలిస్ట్ లు అంతా వేచి చూస్తుంటే క్యాబినెట్ ముగియగానే కెసిఆర్ అటు నుంచి ఆటే వెళ్లి పోయారు .
ఏమిటా ? అని విచారిస్తే … కెసిఆర్ క్యాబినెట్ విషయాలు అందరికీ చెబుతున్నారు అని రాధాకృష్ణ బాబుకు ఫిర్యాదు చేశారు .. అంతకు ముందు వరకు క్యాబినెట్ ఇన్సైడ్ అనేది ఇంటి జర్నలిస్ట్ ల గుత్తాధిపత్యంగా ఉండేది .. గుత్తాధిపత్యం పోయిందనే బాధ తప్ప బాబు ప్రేమ మాకే సొంతం అనే స్వార్ధం కాదు … ఒకటి రెండు వారాలు ఫిర్యాదు ప్రభావం ఉన్నా .. ఆ తరువాత మాములే ….
***
అధికార ప్రతినిధిగా ఉన్న దండు మన వాళ్ళ తో కాకుండా ఇతరులతో స్నేహంగా ఉంటున్నాడు అని ఫిర్యాదు చేసినా , కెసిఆర్ పై ఫిర్యాదు చేసినా ఇదేదో బాబుపై అమలిన ప్రేమ అనుకోలేం … రాజకీయాల్లో ఎవరిపై ఎవరికి ప్రేమ ఉండదు . ఎన్టీఆర్ పై బాబుకే లేని ప్రేమ బాబుపై రాధా కృష్ణకు ఎలా ఉంటుంది . సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు పైనే బాబుకు లేని ప్రేమ రాధాకృష్ణపై బాబుకు , బాబుపై రాధాకృష్ణకు ఎందుకు ఉంటుంది ? పరస్పర అవసరాలే తప్ప మరేమీ లేదు . బాబు తన గుప్పిట్లో ఉండాలి అని రాధాకృష్ణ కోరుకుంటే , వెన్నుపోటు ఇమేజ్ పడకుండా విజనరీ అనే ఇమేజ్ తనకు రావాలి అంటే మీడియా అవసరం అనేది బాబు ఆలోచన ..
బాబు సీఎం అయిన కొత్తలో వివిధ కార్యక్రమాల్లో మీడియాతో కలిసి బాబు భోజనం చేసేవారు . 95-96 ప్రాంతం లో మీడియా సంఖ్య చాలా స్వల్పం కాబట్టి తింటూ నేతలు, మీడియా మాట్లాడుకునే అవకాశం ఉండేది . వార్త దొరుకుతుంది అని మీడియా , ఫీడ్ బ్యాక్ దొరుకుతుంది అని బాబు చాలాసేపు మాట్లాడుకునే వారు … అప్పటికే బాబు రాధాకృష్ణ చెప్పినట్టు నడుచుకుంటారు అనే ఓ ప్రచారం ఉండేది . బాబు మీడియాతో కలిసి భోజనం చేస్తూ నాగురించి మీరు ఏమేమో అనుకుంటారు రిపోర్టర్ చెప్పినట్టు నడుచుకుంటాను …. జయప్రద … అని ఏమేమో అనుకుంటారు కదూ అన్నారు … నిజానికి అక్కడ ఈ అంశాన్ని ఎవరూ ప్రస్తావించలేదు . చర్చలో బాబే ఈ అంశాన్ని తీసుకు వచ్చారు . నేను స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాను … ఎవరి చెప్పుచేతుల్లో లేను అని బాబు చెప్పదలుచు కున్నారు అని అర్థం అయింది .
జయప్రదను దూరం పెట్టగలిగారు కానీ రాధాకృష్ణను దూరం పెట్టలేక పోయారు . వారికి కలిగించే ఆర్థిక ప్రయోజనాలతో బాబే స్వయంగా సొంత మీడియా పెట్టుకోవచ్చు కానీ …. మహాటీవీ బినామీగా నడిపినా తలనొప్పి తప్ప ప్రయోజనం కనిపించలేదు … 95 లోనే రేణుక చౌదరి ఓ సారి ఓ మాట అన్నారు . ఎన్టీఆర్ కు చంద్రబాబు ఉండే వారు. …కానీ చంద్రబాబుకు చంద్రబాబు లేరు అదే పెద్ద లోటు అని …
Ysr కు జగన్ ఉండడం వల్ల సాక్షి పెట్టగలిగారు … బాబుకూ ఉండి ఉంటే సాక్షిలా సొంత మీడియా పెట్టే వారేమో …. ఆంధ్రాలో ఇప్పుడు పార్టీల పరంగా మీడియా స్పష్టమైన విధానం అమలు చేస్తోంది . రాధాకృష్ణకు అనివార్యం కాదు కానీ బాబు అనివార్యంగా రాధాకృష్ణపై ప్రేమ చూపాల్సిందే ….
Share this Article