Wrestling with System:
అదేమిటి?
తాము అబలలం కాదని…సబలలమని బరిలో గిరిగీచి…నిలిచి…గెలిచినవారు కదా? ఎందుకలా వలవల కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నారు?
అదేమిటి?
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున మన క్రీడా గర్వకారణాలు రోడ్డునపడి విలపిస్తున్నాయి?
Ads
అదేమిటి?
భారత మల్లయోధుల సమాఖ్య అధిపతి బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించాడని...న్యాయం చేయమని ప్రాధేయపడుతున్న యోధురాళ్ల వార్తలను మీడియా నెలల తరబడి ఇస్తూ ఉంటే…అంతమందిని చెరచగల లైంగిక పటుత్వం నాకుందా? అని అతడు అంత లేకిగా, వెకిలిగా, నీచంగా మాట్లాడుతున్నాడేమిటి?
అదేమిటి?
యోధులు సర్వోన్నత న్యాయస్థానం మెట్లెక్కేదాకా అతడి మీద కేసే కట్టలేదెందుకు?
అదేమిటి?
మమ్మల్ను ఇంతగా అవమానిస్తారా? మాకిచ్చిన అత్యున్నత పౌర పురస్కారాలయిన పద్మ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తాం…అని వారెందుకు గుండెలు బాదుకుంటున్నారు?
అదేమిటి?
నిరసన వ్యక్తం చేస్తున్న యోధుల పట్ల ఢిల్లీ పోలీసులు అంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు?
అదేమిటి?
మల్ల యుద్ధంలో కండలు తిరిగి, గుండెలు తీసిన బంట్లను ఎదుర్కొన్న ధీరులు ఇలా భీరువులై…దిక్కు లేని వారయ్యారు?
అదేమిటి?
ఎన్నెన్ని పట్లు తెలిసినవారు…ఇలా పట్టు కోల్పోయి…ఎవరూ పట్టించుకోని వారయ్యారు?
అదేమిటి?
“Justice delayed is justice denied”. న్యాయం ఎంత ఆలస్యమయితే అంత అన్యాయమయిపోతామని ఆదర్శమేదో ఉంది కదా?
అదేమిటి?
“భారత్ మాతాకీ జై” అంటున్నాం కదా? వీరు భరత మాత కన్న బిడ్డలు కారా? వీరికి జరిగిన అవమానం మనది కాదా?
అదేమిటి?
“ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం… ఆరవ వేదంమానభంగ పర్వంలో… మాతృహృదయ నిర్వేదం…
“ప్రతి భారతి సతి మానం చంద్రమతీ మాంగల్యం…
శిశువులుగా మీరుపుట్టి పశువులుగా మారితే…మానవరూపంలోనే దానవులై పెరిగితే…సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే…
కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో…భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో…నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే… ఏమైపోతుందీ సభ్యసమాజం? ఏమైపోతుందీ మానవధర్మం?
ఏమైపోతుందీ ఈ భారతదేశం, మన భారతదేశం?”
అన్న వేటూరుల ఆక్రందనలు వినపడడం లేదా?
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article